మద్యం సిండికేట్‌

– దరఖాస్తు చేసుకోకుండా అడ్డంకులు
– కమిషనర్‌ ఆఫీసు ప్రత్యేక కౌంటర్‌కు 100 దరఖాస్తులు
– ఇప్పటి వరకు 45వేలకుపైనే
– ఖజానాకు రూ.900కోట్ల ఆదాయం
– నేడు ఆఖరు తేది
– ఈ నెల 21న లాటరీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా జరగాలి. రాష్ట్రంలో ఏ మద్యం దుకాణానికైనా దరఖాస్తు చేసుకోవడానికి ఆయా జిల్లాల్లతో పాటు, హైదరాబాద్‌లోని ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. దరఖాస్తుల సమర్పణలో ఎవరైనా సిండికేట్‌గా ఏర్పడినా, ఎవరినైనా అడ్డుకున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అందరికీ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవారికి, సహకరించే వారిపై గట్టి నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఉన్నతాధికారుల సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గతంలో స్పష్టంగా ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. సిండికేట్‌ వ్యవహారం జోరుగా సాగుతున్నది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలతోపాటు యాదాద్రి-భువనగిరి జిల్లా సిండికేట్‌ ప్రభావం తీవ్రంగానే ఉందని పలువురు బాధితులు చెబుతున్నారు.
రాష్ట్రంలో 2023-25 రెండేండ్లకుగాను మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం ఆబ్కారీ శాఖ ఈనెల 4న నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 6గంటలకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ప్రకటించారు. 21న లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు 786 షాపులను ప్రత్యేకంగా కేటాయించారు. వీటిలో గౌడ కులస్తులకు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 కేటాయించారు. ఎస్టీలకు కేటాయించిన వాటిలో 95 దుకాణాలు షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నాయి. నాన్‌ షెడ్యూల్‌ ఏరియా గిరిజనులకు 36 దుకాణాలను కేటాయించారు.
స్పెషల్‌ కౌంటర్‌కు
సిండికేట్‌ కారణంతో ఆయా జిల్లాలకు చెందిన దరఖాస్తుదారులకు ఇబ్బంది తలెత్తకుండా హైదరాబాద్‌ లోని ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయం లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. సిండికేట్‌ బెదిరింపులకు భయపడిన వాళ్లంతా హెడ్‌ ఆఫీసు కౌంటర్‌లో దరఖాస్తులను అందజేస్తున్నారు. గురువారం వరకు 100పైగానే దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. శుక్రవారం వరకు వీటి సంఖ్య 200లకు పెరిగే అవకాశమున్నట్టు సమాచారం. సిండికేట్‌గా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా పరిస్థితి అలానే ఉందని పలువురు బాధితులు వాపోతున్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో..
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మద్యం దుకాణాలకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడంలేదని తెలిసింది. ఉమ్మడి మెదక్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల్లో ప్రభుత్వం ఆశించినంతగా ఆదరణ లేదు. అయితే ఒక్క నిజామాబాద్‌ నగరంలోని దుకాణాలకు తప్ప మిగిలిన జిల్లాల్లోని దుకాణాలకు గతేడాది వచ్చిన దరఖాస్తులకు సమానంగా అప్లీకేషన్లు వచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ జిల్లాల్లో మద్యం టెండర్ల ప్రక్రియను పర్యవేక్షించడానికి ఓ ఉన్నతాధికారిని స్ఫెషల్‌ ఆఫీసర్‌గా నియమించారు.
45 వేల దరఖాస్తులు… రూ.900 కోట్ల ఆదాయం
రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి కోసం ఇప్పటివరకు 45వేల దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 6గంటల వరకే గడువు ఉండడంతో వాటి సంఖ్య 50వేలు దాటే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే 2021-2023 రెండేండ్లకుగాను 37,500 దరఖాస్తులు వచ్చాయి. అంటే దరఖాస్తుల ద్వారానే మొత్తం రూ. 750కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి మాత్రం గతం కంటే 7500 దరఖాస్తులు అధికంగా వచ్చాయి. 45వేల దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.900కోట్ల ఆదాయం వచ్చింది. శుక్రవారం సాయంత్రానికి దరఖాస్తులు 50వేల మార్క్‌ దాటే అవకాశముందని అధికారుల అంచనా. దీంతో ఆదాయం రూ.1000కోట్లే చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టే.
నేడే ఆఖరు
మద్యం దుకాణాలకు దరఖా స్తులను స్వీకరించడానికి శుక్రవారం సాయంత్రం 6గంటల వరకే గడువు ఉంది. దరఖాస్తుదారులు 6గంటల వరకు కౌంటర్‌ పరిసర ప్రాంతంలో చేరుకుంటే వాళ్ల దరఖాస్తు లను సైతం తీసుకునేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఈనెల 21న లాటరీ నిర్వహించనున్నారు.

Spread the love