సాహెబ్‌ నగర్‌ కలాన్‌లో అక్రమ నిర్మాణాల పరిశీలన

నవతెలంగాణ-హయత్‌నగర్‌
హయత్‌ నగర్‌ రెవెన్యూ పరిధిలోని సాహెబ్‌ నగర్‌ కలాన్‌ సర్వేనెంబర్‌ 71/1లో ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఆదివారం తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్‌ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రారంద స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూమి మొత్తం 149-32 ఎకరాలు, ప్రస్తుతం 35 ఎకరాలలో ఆర్డిఓ, ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కలిసి సర్వేనెంబర్‌ 71/2, 71/3 ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకొని, జీవో 118 కింద రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఈ భూమిలో ఆర్డిఓ తో సహా ఒక్క ఫ్లాట్‌ దారుని దగ్గర రెండు లక్షల నుండి 5 లక్షల వరకు తీసుకొని రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారని, డబ్బులు ఇయ్యని వారి నిర్మాణాలను కూలగొట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఇదే భూమిలో ఆర్డీవో, ఎమ్మార్వో, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఇల్లు నిర్మించుకున్నారని, ఆర్‌ఐ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ కూడా దొరికిందని తెలిపారు. ఆర్డీవో, తహసీల్దార్‌ ఇండ్లు బినామీ పేర్లతో ఉండడం వలన ఎవరికి దొరకకుండా ప్రయత్నం చేస్తున్నారన్నారు. కావున ఈ భూమిని సర్వే చేసేంత వరకు ఇందులో జరుగుతున్న 118 జీవో రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయాలని ప్రారంద స్వామి డిమాండ్‌ చేశారు. హయత్‌నగర్‌ మండలంలో ప్రభుత్వ భూములు దాదాపుగా 70 ఎకరాలు కబ్జాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాహెబ్‌ నగర్‌ కలాన్‌ సర్వేనెంబర్‌ 71/1లో 35 ఎకరాలు అనుమగల్‌ హయత్‌ నగర్‌ సర్వేనెంబర్‌ 255లో15 ఎకరాలు బాగ్‌ హయత్‌ నగర్‌ సర్వేనెంబర్‌ 25 లో 10 ఎకరాలు రెవెన్యూ అధికారులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తుల దగ్గర రూ.కోట్లు బేరం ఆడుకొని మరి దగ్గరుండి ఇల్లు కట్టిస్తున్నారని ఆరోపించారు. మండల అధికారులు ఆర్డిఓ వెంకటాచారి ధైర్యం చూసుకొని ఇష్టం వచ్చినట్లుగా కబ్జాలకు పాల్పడుతూ దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి..ప్రభుత్వ భూమిని రక్షించకపోతే దళిత సంఘాలు, అఖిలపక్ష పార్టీలతో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెేవీపీఎస్‌ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఐ. భాస్కర్‌, కాంగ్రెస్‌ ఎల్బీనగర్‌ నియోజకవర్గం ఎస్సీ సెల్‌ చైర్మన్‌ బోడ రాజశేఖర్‌, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ బీఎన్‌రెడ్డి అధ్యక్షులు కొంగర నరసింహ, రవి, రాజు, నవీన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Spread the love