చొరబడుతున్నారు..

చొరబడుతున్నారు..మెదడు గుడ్డిదైపోయాక కళ్లుండీ ప్రయోజన ముండదు. ఆ ప్రమాదం ముదరకముందే సమాజంలో వివేకం మేల్కోవాలి. ఏలినవారి తీరుకు బుద్దిజీవులెవరికైనా ఈ అభిప్రాయం రాకమానదు. ఇప్పటికే ఈ ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరుతో విద్యరంగంలో ఆధునిక భావాలకు, శాస్త్రీయ ఆలోచనలకు పాతరేస్తోంది. ప్రయివే టీకరణకు తలుపులు బార్లా తెరుస్తోంది. క్రమేణా పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల సిలబస్‌లోంచి అనేక శాస్త్రీయ, చారిత్రక అంశాలను తొలగించి తమ హిందూత్వ భావజాలాన్ని చొప్పిస్తోంది. తద్వారా దేశంలో వైజ్ఞానిక స్పృహకు తలుపులు మూస్తోంది. ఇప్పుడు కొత్తగా సైనిక పాఠశాలలను సైతం సంఫ్‌ుపరివార్‌కు అప్పగిస్తూ తన కాషాయీకరణను మరింత వేగవంతం చేస్తోంది.
”ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌” నివేదిక ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే సైనిక్‌ స్కూళ్లలో అత్యధికం ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలకు, బీజేపీ నేతలకు, హిందూమత ప్రచారకులకు ఈ ప్రభుత్వం కట్టబెడుతోంది. ”ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలలో 62 శాతం సైనిక పాఠశాలలు సంఫ్‌ుపరివార్‌, దాని అనుబంధ హిందూత్వ సంస్థలు, వ్యక్తులకు అప్పగించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు, సమాచారహక్కు చట్టం ద్వారా అందిన వివరాలు దీనిని ధృవీకరిస్తున్నాయి.” అని రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ వివరించింది. ఈ రకమైన చర్య సైనిక్‌ స్కూళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి అని ఈ నివేదిక పేర్కొనడం గమనార్హం.
రక్షణ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో, స్వయంప్రతిపత్తి కలిగిన ”సైనిక్‌ స్కూల్‌ సొసైటీ” ఆధ్వర్యంలో నడిచే ఈ పాఠశాలల్లో ప్రయివేటు భాగస్వామ్యానికి ప్రవేశం లేదు. కానీ 2021లో బీజేపీ ప్రభుత్వం ఇందుకు తలుపులు తెరిచింది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం నిధుల సమీకరణకు, మౌలిక వనరుల కల్పనకు ఉపయోగకరమని ఆనాడు ప్రభుత్వ పెద్దలు ప్రవచించారు. తీరాచూస్తే ఇది కేవలం ఒక ముసుగనీ, ఈ ముసుగులో సైనిక్‌ స్కూళ్లను కూడా కాషాయీకరించడమే వీరి ఉద్దేశ్యమని నేడు తేలిపోయింది. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నావల్‌ అకాడమీల్లో ప్రవేశాలకు అవసరమైన శిక్షణ ఇవ్వడంలో ఈ సైనిక్‌ స్కూళ్లది కీలకమైన పాత్ర. అటువంటి సంస్థలను ఎలాంటి హేతుబద్ధత లేకుండా బీజేపీ తన మాతృసంస్థకు, హిందూ మత ప్రచారకులకు ధారాదత్తం చేస్తోంది. సైనిక వ్యవస్థలో లౌకిక ప్రమాణాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలు దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాకపోగా ప్రమాదకరమైనవి.
సైంటిఫిక్‌ టెంపర్‌ అంటేనే గిట్టనివారికి విద్యావ్యవస్థలను అప్పగిస్తే ఏం జరుగుతుందీ? ”పుస్తకాల గది నుంచి వచ్చే వైజ్ఞానిక తరమే సమాజానికి అవసరం” అంటాడు ప్రముఖ అమెరికన్‌ మానసిక శాస్త్రవేత్త ఆర్ధర్‌ జాన్‌. మరి ఆ పుస్తకాల గదులను ‘పూజగదులు’గా మార్చజూస్తున్న ఈ ప్రభుత్వ చర్యలను ఏమనాలి? మతం చుట్టూ తిరిగేదే జ్ఞానం అని భావించేవాళ్లు భావితరాలకు ఏం అందించగలరు? బహుశా స్వర్గ నరకాలకు దారులు చూపుతారు కాబోలు! పాతాళలోకానికి వెళ్లే సొరంగ మార్గాలను వెతికి చూపుతారు కాబోలు! ఈ సమస్త లోకాలను మోసే ఆదిశేషుని పరిమాణాన్ని, దానిమీద పవళించే విష్ణుమూర్తి చిరునామాను పట్టి ఇస్తారేమో…! డార్విన్‌ పరిణామవాదాన్ని, న్యూటన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అంగీరించనివారు అందించేది ఇంతకన్నా ఏముంటుంది…?! కండ్ల ముందే నిరూపించబడిన సత్యాన్ని, సైన్సును కాలదన్ని…రుజువులు లేని విశ్వాసాల ఆధారంగా చరిత్రను చూడలనేవాళ్లు అందించే చదువులు ఈ దేశాన్ని ఏ వైపునకు నడిపిస్తాయి? ఆధునిక వైజ్ఞానిక ప్రగతివైపుకా లేక మధ్యయుగాల చీకటి కాలానికా?
ఇప్పటికే రామాయణ కాలంలోనే విమానాలున్నాయి అంటాడొకడు. మహాభారతంలోనే టెస్టుట్యూబ్‌ బేబీలున్నా యంటాడు ఇంకొకడు. అది తాజ్‌మహల్‌ కాదు తేజోమహల్‌ అనీ, ఇది ఇండియా కాదు భారత్‌ అని, ప్యారిస్‌ను పురుషోత్తమ పట్టణమనీ, ఆస్ట్రేలియాను అస్త్రాలయ అనీ ఆధారాలు లేని విశ్వాసాలను తాము నమ్మడమేగాక దేశాన్నీ నమ్మమని శాసించ జూస్తున్నారు.
ఇలాంటి శక్తుల చేతులకు విద్యారంగాన్ని అప్పగిస్తే ఇక దేశంలో వైజ్ఞానిక స్పృహకు ఆస్కారముం టుందా? అందులోనూ రక్షణ రంగానికి కీలకమైన సైనిక పాఠశాలల్ని కట్టబెడితే దేశం భద్రంగా ఉంటుందా? మనుషుల్ని బానిసలుగా మార్చి తాము మాత్రం చక్రవర్తులుగా వెలగాలనుకునేవారి చర్యలు ఇలాగే ఉంటాయి. పౌరసమాజం తక్షణమే మేల్కొని తమ వివేకాన్ని ప్రదర్శించక పోతే… కాళ్లు మనవే అయినా.. నడకలు మనవి కాకుండాపోతాయి. కండ్లు మనవే కానీ… వాటి చూపుల్ని రాజ్యమే నిర్దేశిస్తుంది. ఏం చదవాలో, ఎలా ఆలోచించాలో నిర్ణయిం చడమే కాదు, ఆఖరికి మన నాలుక మీద రుచి ముద్రల్ని కూడా రాజ్యమే వేస్తుంది. హిందూత్వ శక్తులకు విద్యారంగాన్ని అప్పగిస్తే ప్రజాస్వా మ్యాన్ని తోసిరాజని నియంతృత్వాన్నే ప్రబోధిస్తారు.

Spread the love