JEE Main Result 2024:25న జేఈఈ మెయిన్‌-2 ఫలితాలు

నవతెలంగాణ హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ర్యాంకులు ఈ నెల 25న విడుదల చేయనున్నట్టు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) వెల్లడించింది. ఫలితంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుల ప్రక్రియ తేదీల్లో ఐఐటీ మద్రాస్‌ మార్పు చేసింది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే ఐఐటీల్లో బీటెక్‌లో చేరేందుకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే అవకాశం కల్పిస్తారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను ఏప్రిల్‌ 20న వెల్లడిస్తామని గతంలో ఐఐటీ మద్రాస్‌కు ఎన్‌టీఏ సమాచారమిచ్చింది. దీంతో ఫలితాలు విడుదలైన మరుసటి రోజు ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తామని ఐఐటీ మద్రాస్‌ గతేడాది డిసెంబరు 1న కాలపట్టిక విడుదల చేసింది.
తాజాగా ఎన్‌టీఏ ఈ నెల 25న జేఈఈ మెయిన్‌ ర్యాంకులు వెల్లడిస్తామని ప్రకటించడంతో… ఐఐటీ మద్రాస్‌ ఈ నెల 21కి బదులు.. 27 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు స్వీకరించేలా షెడ్యూల్‌లో మార్పు చేసింది. పరీక్ష మాత్రం యథాతథంగా మే 26న జరుగుతుందని ప్రకటించింది. జేఈఈ మెయిన్‌ చివరి విడత పేపర్‌-1 పరీక్షలు ఈ నెల 9న ముగిశాయి. పేపర్‌-1కు ఈసారి 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 95 శాతానికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా దానిలో దాదాపు 2.40 లక్షల మంది పరీక్షలు రాసినట్టు తెలుస్తోంది.

Spread the love