పాటల ప్రవాహానికి జేజేలు

     వనపర్తి కలలకు కాణాచి. కళాకారులకు కల్పతరువు. సాహిత్య వేత్తలకు నిలయం. అభ్యుదయ, ప్రగతి కాముకులతో విలసిల్లిన, జానపద, రంగస్థల కళామా తల్లులతో పరిఢవిల్లుతున్నది విద్యాపర్తి. ఎంతో చారిత్రిక ప్రాశస్త్యం కలిగిన వనపర్తి జిల్లా పాటకు స్వాగతం పలికింది. ఈ పిలుపును అందుకున్న పాట పరవళ్ళు తొక్కింది. అలరింపజేసింది. అంత్యంత వైభవంగా పాటకు పట్టాభిషేకం కట్టింది. తెలంగాణ సాహితి ప్రజానాట్య మండలి, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం వనపర్తి జిల్లా కమిటీలు సంయుక్తంగా పట్టణంలో మే 27, 28 తేదీలలో తెలంగాణ సాహితీ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా 27న పాటకు పట్టాభిషేకం, 28న కవికి పట్టాభిషేకం అనే రెండు బృహత్తరమైన సాహిత్య సమ్మేళనాలు జరిగాయి.ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వందమందికి పైగా గాయకులు తమ మధురమైన గాత్రాన్ని వినిపించారు. ఎనబైమంది కవులు తమ కవితాగానం చేశారు.
ప్రజలు పొద్దస్తమానం పని చేస్తూ తమ శ్రమను ధార పోసేటప్పుడు వెలుపల చెమట చుక్కల నుండి అసువుగా పాట వచ్చిందని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఆనందచారి అన్నారు. శ్రామికులు, కార్మికులు, మహిళలు ఫ్యాక్టరీలలో, వ్యవసాయ పనుల్లో పనిచేస్తూ అలసి సొలసిపోతుంటారని, ఈ సందర్భంగా అలసినప్పుడు పాటను పాడుకుంటూ సేద తీరుతారన్నారు. ప్రస్తుతము పాట వరస మారుతుందని, పట్టు తప్పుతుందని, ప్రజల కోసం ప్రజలను చైతన్య పరచడం కోసమే పాట పాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ప్రజలను విభజించ డానికి, కన్న ప్రజల పేగు బంధాన్ని విడదీయడానికి పాలకులు కుయుక్తి పన్నుతున్నారని వీటిని ఎండగట్టాలని కవులకు, గాయకులకు ఆయన పిలుపునిచ్చారు.
ప్రకృతియే కమ్యూనిజం..!
ప్రకృతి ఒక కమ్యూనిస్టు వ్యవస్థని, గాలి, నీరు, వాయువు, ప్రతిప్రానికి అందిస్తుందని, అదేవిధంగా ప్రజలకు, జంతువులకు, పక్షులకు బతికేందుకు, సమాన అవకాశాలు సమానంగా కావాలని కోరడము కమ్యూ నిజమని ప్రముఖ కవి, గాయకుడు, ప్రకృతి తత్వవేత్త జయరాజు అన్నారు. జన హితం కోసం పాటను, కలాలను ఆయుధంగా ఉపయోగించుకోవాలన్నారు. పాటను బతికిం చుకోవాలని పాట ద్వారానే ప్రజల కష్టసుఖాలను వెతికి తీసి వెన్ను దన్నుగా ఉండాలని కోరారు.
జనహితం కోసం పాటే ఆయుధం..!
జనహితం కోసమే పాటను ఆయుధంగా ఉపయో గించుకోవాలని తెలంగాణ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి అన్నారు. పాట ప్రభుత్వాలను కదిలిస్తుందని, ప్రభుత్వాలను మారుస్తుందని, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెడుతుందని అన్నారు. ధూమ్‌ ధామ్‌ కార్యక్రమాల ద్వారా ప్రజలలో పెద్దఎత్తున చైతన్యాన్ని తెచ్చిం దన్నారు. పాట ప్రజల చైతన్య పరచడమే కాకుండా వారిలో ఉన్న నిద్రాణమైన వ్యవస్థను పురికొలుపుతుందన్నారు.
సామాజిక రుగ్మతలకు పాటే మంత్రం..!
సమాజంలో నెలకొన్న అవిద్య, నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పాట మంత్రంగా ఉపయోగ పడిందని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేముల ఆనంద్‌, కట్టా నరసింహ, నవ తెలంగాణ న్యూస్‌ ఎడిటర్‌ ఆర్‌.రమేష్‌ అన్నారు. పాటలు, కవిత్వాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ ఆనాడు అక్షరాస్య ఉద్యమంలో పదునైన ఆయుధంగా ఉపయోగ పడింది అన్నారు. ఉమ్మడి ఆంధ్రాలో తమ సమస్యల ద్వారా లక్షలాదిమంది చదువు రాని వారిని, అంధకార బతుకల నుంచి వెలుగు దీపాలు నందివడం జరిగిందన్నారు. పాట కవిత్వం ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా గాయకులు రచయితలు పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్ధన, ఉపాధ్యక్షులు మోహనకృష్ణ, సహయ కార్యదర్శి సలీమా, వనపర్తి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోకనాథ్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిట శ్రీధర్‌, సీపీ(ఐ)ఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్‌, తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌ గుప్తా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మోహన్‌ కుమార్‌ యాదవ్‌తో పాటు ఈ కార్యక్రమం నిర్వహణకు సాయపడ్డ స్థానిక ప్రజా వైద్యశాల డాక్టర్‌ మురళీధర్‌, మోడల తిరుపతయ్య సాగర్‌తో, పాటు నిర్వాహక కమిటీ గౌరవ అధ్యక్షుడు అధ్యక్షులు గంధం నాగరాజు, అధ్యక్షుడు డి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి రాజారావు ప్రకాష్‌, ప్రచార కార్యదర్శి శీర్లనాగేంద్రం సాగర్‌, కార్యదర్శులు కాకం ఆంజన్న, భూరోజు గిరిరాజాచారి, తెలంగాణ సావితి నాయకులు ఖాజామైనోద్దీన్‌, మహీద్‌ ఖాన్‌, జెవివి, నాయకుడు నరేందర్‌, ఎన్‌.రాములు, జానపద కళాకారుల సంఘం నాయకులు డప్పు స్వామి, మిస్టేక్‌, దండు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సన్మానం..
ఈసందర్భంగా రెండు రోజులు కార్యక్రమంలో పాల్గొన్న కవులు, గాయకులకు శాలువా, మెమొంటో, ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించడం ఘనంగా సన్మానించడం జరిగింది. పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కవితలు,పాటలు వినిపించినందుకు వారిని నిర్వాహకులు అభినందించారు
– డి.కృష్ణయ్య, 9490206137
తెలంగాణ సాహితి, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి

Spread the love