ఊర చెరువు భూమి ఆక్రమణ

– కుంటలో మట్టి తవ్వి చెరువులో పోసి శిఖం పేరుతో చెరువు భూమి ఆక్రమణ
– మరో రెండు రోజుల్లో చెరువుల పండుగ
– చోద్యం చూస్తున్న అధికారులు
నవతెలంగాణ-ఆత్మకూర్‌ఎస్‌
చెరువు శిఖంలోభూములు ఉన్న వారు కొందరు చెరువుని ఆక్రమించే ప్రయత్నంలో భాగంగా చెరువులో మట్టి పోసి ఎకరాల కొద్దిభూమిని ఆక్రమిస్తున్న సంఘటన మండలపరిధిలోని గట్టికల్‌లో ఆదివారం చోటు చేసుకుంది.ఏడాదికాలంగా చెరువులో మట్టిపోసి చెరువును అక్రమిస్తున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసులు పెట్టి పోలీసులు, ఫిర్యాదు చేసినట్లు చెప్పి అధికారులు తప్పకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.చెరువులో ఎఫ్‌టీఎల్‌ హద్దు దిమ్మెలు వేసినప్పటికీ వాటిని కూడా పూడ్చి వేశారన్న ఆరోపణలు వచ్చాయి. గ్రామానికి చెందిన ఒకరు సమీపంలోని అదే గ్రామానికి చెందిన ఎర్రగుంట నుండి ట్రాక్టర్లు, జేసీబీసహాయంతో మట్టిని ఊరచెరువు దగ్గరగా తన సొంత భూమి సమీపంలో ఉన్న చెరువులో మట్టి పోసి ఆక్రమిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు.నాలుగు రోజులుగా భారీగా మట్టి తోలుతున్నప్పటికీ అధికారులు తనకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికే రెండు ఎకరాలకు పైగా మట్టి పోసి చెరువుభూమిని ఆక్రమించాడని స్థానికులు ఆరోపించారు.అదేవిధంగా చెరువు సమీపంలో ఉన్న శిఖం భూముల వారు ఇదేవిధంగా రెండేండ్లుగా మట్టి పోసి ఆక్రమిస్తున్నారని ఆరోపించారు.ఈ విషయమై ఆదివారం అధికారులకు స్థానికులకు సమాచారం ఇవ్వగా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పనులు నిలిపివేశారు.చెరువు అక్రమణకు పాల్పడుతున్న వారిపై వాహనాలపై ఐబీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మరో రెండు రోజుల్లో చెరువుల పండుగ ఉన్నది అక్రమించించిన చెరువు భూములపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
చెరువును ఆక్రమిస్తే చర్యలు తప్పవు తహసీల్దార్‌-పుష్ప
గట్టికల్‌ ఊర చెరువులో మట్టి పోసి చెరువు భూమిని అక్రమిస్తున్నట్లు సిబ్బంది ద్వారా సమాచారం ఉంది.చెరువులు అక్రమిస్తే చర్యలు తీసుకుంటాం.
పోలీసులకు పిర్యాదు చేస్తాం
ఐబీ ఏఈ- రామారావు
గట్టికల్‌ ఊర చెరువులో భూమి అక్రమించేందుకు అదే గ్రామంలోని ఎర్రకుంట మట్టి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వెళ్లి పనులు నిలిపి వేశాం.చెరువు ఎఫ్‌టీఎల్‌ హద్దు దిమ్మెలను కూడా వదలకుండా మట్టి పోసి అక్రమిస్తున్నారని వారిపై వారు ఉపయోగించిన వాహనాలపై చట్టపరంగా చర్యల కోసం పోలీసులకు పిర్యాదు చేశాం

Spread the love