బీజేపీలోనూ కేసీఆర్‌ కోవర్టులు

– ఇతరుల గౌరవానికి భంగం కలిగించొద్దని చురకలు.. ఈటల కౌంటర్‌ ఎటాక్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బీజేపీలో ‘దున్నపోతు’ వ్యవహారం దుమారం రేపుతున్నది. చినుకు చినుకు కాస్త జడివానలా మారినట్టు జితేందర్‌రెడ్డి ట్వీట్‌తో గ్రూపుల పోరు తారాస్థాయికి చేరుకున్నది. ఈటల కౌంటర్‌ ఎటాక్‌తో ఇంటి పోరు బజారున పడ్డది. జితేందర్‌రెడ్డి ట్వీట్‌ చేసి రెండు రోజులవుతున్నా దాన్ని నేతలెవ్వరూ ఖండించలేదు. పార్టీలో ఈ ధోరణి మంచిదికాదనీ, నేతలెవ్వరూ అలా ట్వీట్లు చేయొద్దని అధిష్టానం చెప్పలేదు. రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఎంపీ బండి సంజరుకుమార్‌ వాటిని ఖండించకపోవడం పైనా ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఆ ట్వీట్‌ను ఉపసంహరించుకోవాలని ఎందుకు సూచించలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఇంత రచ్చ జరుగుతున్నా జితేందర్‌రెడ్డి తొలగించకపోవడాన్ని బట్టి చూస్తేనే ఈటలకు వ్యతిరేకంగా ఆ పార్టీలో బలమైన ఫోర్స్‌ పనిచేస్తున్నదని అర్ధమవుతున్నది. ఈ వాస్తవాన్ని పసిగట్టిన ఈటల రాజేందర్‌ తన స్థాయిలోనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘వయస్సు, అనుభవం ఉన్నవారు ఏదిపడితే అది మాట్లాడొద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగేలా చూడొద్దు’ అంటూ తనదైన శైలిలో చురకలు అంటించారు. అదే సమయంలో కాంగ్రెస్‌పార్టీలోనే కాదు…బీజేపీలోనూ కేసీఆర్‌ కోవర్టులున్నారని మరోమారు బాంబు పేల్చారు. ఆ కోవర్టులు పార్టీలోనే ఉంటూ అదే పార్టీని ముంచుతారని మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. కోవర్టులతోనే కేసీఆర్‌ రాజకీయం చేస్తారనీ, ఇంటిదొంగల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందేననని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌ ‘కోవర్ట్‌’ కామెంట్‌ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చేశారు. ఆ సమయంలో తమ పార్టీలో ‘కోవర్టులెవ్వరూ లేరు’ అంటూ బండి, విజయశాంతి, పలువురు సీనియర్లు ఖండించిన సంగతి తెలిసిందే. తాజా ఈటల బాంబుతో…అసలు పార్టీలో కేసీఆర్‌ కోవర్టులు ఎవరు? అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇది ఎటువైపు దారి తీస్తుందో అని ఆ పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, బలమైన ముదిరాజ్‌ సామాజిక తరగతి నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌ సేవలను బీజేపీ సరిగ్గా వాడుకోవట్లేదనే విమర్శా రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కూడా తాము గీసిన చక్రబంధంలో ఉండి పనిచేయాలనే బీజేపీ విధానం కూడా ఆ పార్టీకి చేటు చేస్తున్నదనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది. ఈ పద్ధతే ఈటల రాజేందర్‌, రాజగోపాల్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌కుమార్‌, తదితర నేతలు అంటీముట్టనట్టు ఉండటానికి కారణమనే చర్చ కూడా నడుస్తున్నది.
ఈటలకు వై ప్లస్‌ భద్రత,బుల్లెట్‌ ఫ్రూప్‌ కారు, 16 మంది పోలీసులతో రక్షణ
ఈటల రాజేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం వైప్లస్‌ భద్రతను కల్పించింది. అతనికి బుల్లెట్‌ ఫ్రూప్‌ కారును కేటాయించింది. 16 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచే ఆయనకు వైప్లస్‌ కేటగిరీ భద్రత అమల్లోకి రానున్నది. బీజేపీలో జరుగుతున్న పరిణామాలు, మరోవైపు తన భర్తను చంపించే కుట్ర జరుగుతున్నదని జమున చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నది. దీనికి ముందే కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించబోతుందన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈటలకు భద్రత అంశాన్ని ఐఏఎస్‌ ఆఫీసర్‌ను పంపి పరిశీలించాలని కేటీఆర్‌…డీజీపీని ఆదేశించిన విషయం విదితమే. ఈ క్రమంలో డీసీపీ సందీప్‌రావు ప్రత్యేక నివేదికను డీజీపీకి అందజేశారు. ఈ క్రమంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. సౌమ్యుడైన ఈటల రాజేందర్‌ విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమేనన్న చర్చ నడుస్తున్నది.

Spread the love