నాకే రివర్స్‌ కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు

పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే
– దేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ
– ఖమ్మంలో కమ్యూనిస్టు ఐడియాలజీ ఎక్కువ
– అందుకే పొంగులేటి వెనుకడుగు : ఈటల రాజేందర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తమ పార్టీలో చేరటం కష్టమేనని బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తన అభిప్రాయపడ్డారు. రోజూ వారిద్దరితోనూ మాట్లాడుతున్నాననీ, అయితే, వారే తనకు రివర్స్‌లో కౌన్సిలింగ్‌ ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని హోటల్‌ దస్పల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికే కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ అనీ, ఖమ్మం జిల్లా ప్రజల్లో ఇప్పటికీ కమ్యూనిస్టు ఐడియాలజీ ఉందని చెప్పారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నాయనీ, చివరకు టీడీపీ కూడా ఉందని చెప్పారు. ఆ జిల్లాలో అసలు బీజేపీ లేదన్నారు. అందుకే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెనుకడుగు వేస్తున్నారన్నారు. బీజేపీలో చేరటానికి వారికి భౌతికంగా అనేక ఇబ్బందులున్నాయని చెప్పారు. ప్రియాకగాంధీని కలుస్తున్నారనే సమాచారంతోనే అప్పట్లో ఖమ్మంలో పొంగులేటి నివాసానికి వెళ్లామనీ, ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరకుండా ఆపగలిగామని అన్నారు. కొందరు తాను అనని వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని కేసీఆర్‌ అవలీలగా మింగేస్తారని చెప్పారు. తాను బీజేపీలో పదవులు ఆశించి చేరలేదనీ, ఏ పని అప్పగించినా అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. తనకు ఏ పదవి ఇవ్వాలో అధిష్టానానికి తెలుసన్నారు. ఈటల వ్యాఖ్యలతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరబోవటం లేదనే విషయంపై మరింత స్పష్టత ఏర్పడింది.

Spread the love