నిషేధిత భూముల్ని కేసీఆర్‌ కుటుంబం దోచుకుంది

KCR family owns restricted lands robbed– పార్ట్‌బీ పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్లు మాజీ ఎంపీ సంతోష్‌ కుటుంబంతో సహా పలువురి ప్రమేయం
– త్వరలో ఆధారాలు బయట పెడతాం : ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి
– ధరణి స్పెషల్‌ డ్రైవ్‌ 17 వరకు పొడిగింపు
– ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేసీఆర్‌ కుటుంబం ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని నిషేధిత భూములను కొట్టేసిందని ధరణి కమిటీ సభ్యులు, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు కోదండరెడ్డి ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం వద్ద కమిటీ సభ్యులు సునిల్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్ట్‌ బీలోకి వెళ్లిన పేదల భూములకు విముక్తి కలగక పోగా నిషేధిత జాబితాలో ఉన్న సర్కార్‌ భూములను బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారి పేరిట బదలాయించారని ఆరోపించారు. మాజీ ఎంపీ సంతోష్‌ రావు కుటుంబీకుల పేరిట జరిగిన భూ కుంబకోణమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీలను కాదని, విదేశీ కంపెనీకి ధరణి నిర్వహణ బాధ్యతను అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్‌ ఇవ్వడం వెనక పెద్ద భూ కుంభకోణం దాగుందని అన్నారు. మొదట ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు, అనంతరం టెర్రాస్‌కు, ఆ తర్వాత క్వాంటెల్లా సంస్థకు ధరణి బాధ్యతలను అప్పగించారని గుర్తు చేశారు. 2020లో తీసుకొచ్చిన ఆర్వోఆర్‌ చట్టం ఆధారంగా ఏర్పాటు చేసిన లోపభూయిష్టమైన ధరణి వ్యవస్థ వల్ల పేదలు భూమిపై హక్కులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 లక్షల మంది రైతులకు చెందిన కోటి 35 లక్షల ఎకరాల భూమిని ధరణి అనే చెరసాలలో పెట్టి ఇష్టా రాజ్యంగా కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నేతలు బదలాయించుకున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌ అప్పగింతతో పాటు దాని ద్వారా జరిగిన భూ అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతామని తెలిపారు.
లక్ష దరఖాస్తులకు మోక్షం : సునీల్‌
ఈ నెల 1 నుంచి 9 వరకు నిర్వహించిన ధరణి స్పెషల్‌ డ్రైవ్‌లో పరిష్కరించిన లక్ష దరఖాస్తులను త్వరలో అన్‌లైన్‌లో నమోదు చేస్తామని ధరణి కమిటీ సభ్యులు సునిల్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి మాడ్యూల్స్‌లో మార్పులు చేస్తున్నామన్నారు. రెండో దఫా స్పెషల్‌ డ్రైవ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల పరిశీలనకు తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో 2 నుంచి 3 బందాలు పని చేస్తాయని చెప్పారు. అసైన్మెంట్‌, ఇతర ముఖ్య భూ వివాదాలకు సంబంధించి మాత్రం తహసీల్దార్‌ ధ్రృవీకరించిన తర్వాత, సమస్యను బట్టి, ఆర్డీవో, కలెక్టర్‌, అనంతరం సీసీఎల్‌కు బదిలీ చేస్తారనీ, తుది నిర్ణయం సీసీఎల్‌ తీసుకోనుందని వెల్లడించారు. స్పెషల్‌ డ్రైవ్‌ అనంతరం ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఎలాంటి తప్పులు జరగకుండా మూడు స్థాయిల్లో పరిశీలన చేసి నివేదికలను రపొందిస్తున్నామని చెప్పారు.
ధరణి స్పెషల్‌ డ్రైవ్‌ పొడగింపు
రాష్ట్రంలో కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారం కోసం చేపట్టిన ధరణి స్పెషల్‌ డ్రైవ్‌ను ప్రభుత్వం మరో వారం పొడిగించింది. ఈ నెల 11 నుంచి 17 వరకు పొడగిస్తూ సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల ఒకటో తేదీ నుంచి 9 వరకు నిర్వహించిన మొదటి విడత స్పెషల్‌ డ్రైవ్‌లో లక్ష ధరఖాస్తులకు పరిష్కారం లభించగా, మాడ్యూల్లో మార్పుల అనంతరం వాటిని అన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ధరణి పోర్టల్‌ నిర్వహిస్తున్న క్వాంటెల్లా సంస్థ మార్పులు చేర్పులకు సంబంధించిన లాగిన్‌ ఆథరైజేషన్‌ను తహసీల్దార్లు, ఆర్టీవోలు, డిప్యూటీ కలెక్టర్లకు ఇంకా బదలాయించలేదు. క్షేత్ర స్థాయిలో విచారణ చేసి అమోదయోగ్యమైనవని ఎంఆర్‌వోలు నివేదికలు ఇచ్చినా వాటిని పోర్టల్‌లో నమోదు చేయలేదు. సాంకేతిక కారణాల వల్లనే వాటిని ఇంకా పోర్టల్‌లో ఎక్కించలేదని తెలుస్తోంది. కాగా ప్రభుత్వం గత నెల 29న ఇచ్చిన మెమో ఆధారంగా రెండో విడతలో పెండింగ్‌ భూ సమస్యలను పరిష్కరించనున్నట్టు స్పెషల్‌ డ్రైవ్‌ పొడగింపు కోసం జారీ చేసిన మెమోలో సీసీఎల్‌ఏ పేర్కొంది. కరెక్షన్‌ చేసిన దరఖాస్తుల వివరాలను డిజిటల్‌ రూపంలో భద్రపర్చనున్నారు. ఆధార్‌ నెంబర్‌ మిస్‌ మ్యాచ్‌, రైతుల పేర్లు తప్పుగా నమోదై ఆగిపోయిన అప్లికేషన్లు, ఫొటో మిస్‌ మ్యాచ్‌లకు రెండో దఫాలో పరిష్కారం లభించనుంది. దరఖాస్తుదారునికి ఫోన్‌, వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించనున్నారు. అప్లికేషన్లను క్లియర్‌ చేసే ముందు ప్రభుత్వ రికార్డుల్లో వాటి వివరాలను నమోదు చేస్తారు. రెండో దఫా తర్వాత కూడా తిరస్కరణకు గురయిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లు సీసీఎల్‌ఏకు రిపోర్ట్‌ చేయనున్నారు.

Spread the love