కేసీఆర్‌వి మాయమర్మాల స్కీములు

KCRV Mayamarmala Schemes– పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా..
–  ఎన్నికల్లో లబ్ది కోసమే ప్రారంభోత్సవం : జూపల్లి కృష్ణారావు
– అనంతరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన జూపల్లి అరెస్ట్‌
– ఎక్కడికక్కడ నాయకుల గృహనిర్బంధం
నవ తెలంగాణ -మహబూబ్‌నగర్‌
పోరాటాల గడ్డ తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వానివి మాయ మర్మాల స్కీములని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి హైడ్రామా కొనసాగింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పరిశీలించేందుకు వెళ్లడానికి సిద్ధమవ్వగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో జూపల్లి హైదరాబాదు నుంచి నేరుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. తొమ్మిదేండ్ల్ల కాలంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఒక్క స్కీమును కూడా ప్రజలకు నిర్దిష్టంగా అందించలేదని, మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారని విమర్శించారు. ఈనెల 16వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు మోటర్లు ఆన్‌చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. వాస్తవాలను కప్పి పుచ్చి వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తోందన్నారు. ”మేము ధర్నాలు చేయడం లేదు.. మీరు పూర్తి చేశామన్న ప్రాజెక్టును ప్రజలకు చూపించడానికి వెళుతుంటే ఎందుకు అరెస్టులు చేస్తున్నారు” అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఇప్పటికీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు 30 శాతం మిగిలి ఉన్నాయని, వాటిని పూర్తి చేయలేదని అన్నారు. 2015లో శంకుస్థాపన చేసిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 7 సంవత్సరాలు గడుస్తున్నా కాలువలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ఒకటి రెండు మోటార్లు బిగించి ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని చెప్పడం ఇది కేసీఆర్‌ ప్రభుత్వానికి మాత్రమే చెల్లుతుందన్నారు. ఆ మోటార్ల కొనుగోలులో కోట్ల రూపాయల అవనీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పటివరకు మొదటి లిఫ్టు పనులు మాత్రమే పూర్తయ్యాయని, వాటిలో కూడా కాల్వలకు టెండర్లు పిలువ లేదన్నారు. ఇప్పటికీ ప్రాజెక్టు సెంట్రల్‌ అనుమతులు లేవని, కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని చెప్పారు. బాహుబలి -1 రూ.2500 కోట్లకు ప్రయివేటు కంపెనీకి అనుమతి ఇచ్చిందని, ఇదే మోటార్‌కి బీహెచ్‌ఈఎల్‌ 8 కోట్లకే టెండర్‌ వేసినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మోటార్ల కొనుగోలులో 1600 కోట్ల అవినితి జరిగిందన్నారు. ఇది తప్పని నిరూపిస్తే ప్రగతిభవన్‌ గేటు ముందు ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ముఖ్యమంత్రికి సవాలు విసిరారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. అనంతరం ప్రాజెక్టు దగ్గరకు బయలుదేరిన జూపల్లి కృష్ణారావు, వీర్లపల్లి శంకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు నాయకులకు పోలీసుల మధ్య వాదన జరిగింది. అనంతరం అరెస్టు చేసి మహమ్మదాబాద్‌ పోలీస్‌ స్టేషనుకు తరలించారు.

Spread the love