భారత్‌ పర్యటనలో కాంబోడియా రాజు

– నేడు రాష్ట్రపతి, ప్రధానమంత్రితో చర్చలు
న్యూఢిల్లీ : భారత పర్యటన కోసం కాంబోడియా రాజు నరోడోమ్‌ షిమామోని సోమవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇక్కడి పాలం ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో కాంబోడియా రాజుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ సింగ్‌ ఆహ్వానం పలికారు. మొత్తం 27 మంది ప్రతినిధులతో కూడిన అత్యున్నత బృందంతో కలిసి కాంబోడియా రాజు భారత్‌ పర్యటనకు విచ్చేశారు. ఈ బృందంలో రాయల్‌ ప్యాలెస్‌ మంత్రి, విదేశాంగ మంత్రి, ఇతర సీనియర్‌ అధికారులు ఉన్నారు. భారత్‌-కాంబోడియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంబోడియా రాజు భారత్‌ పర్యటనకు వచ్చారు. 1952లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమయ్యాయి. అలాగే 60 ఏళ్ల విరామం తరువాత కాంబోడియా రాజు భారత్‌లో పర్యటిస్తున్నట్ల యింది. 1963లో ప్రస్తుత రాజు నరోడోమ్‌ షిమామోని తండ్రి భారత్‌లో పర్యటించారు. కాగా, మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో కాంబోడియా రాజకు స్వాగత కార్యక్రమం నిర్వహిస్తారు. మంగళవారం రాత్రి రాజు గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల్లో కాంబోడియా రాజు పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనకర్‌, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తోనూ రాజు చర్చలు జరుపుతారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 366 మిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుంది. దీనిని విస్తరించడానికి, సాంస్కృతిక, రక్షణ, భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ చర్చలు సాగుతాయి.

Spread the love