నిరుద్యోగ భృతి, రుణమాఫీ హామీలను అమలు చేయాలి

– ప్రజాగర్జనకు తరలిరండి
– సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో
– పార్టీ జాతీయ సమితి సభ్యులు హేమంతరావు
నవతెలంగాణ-ఖమ్మం
పాలకులు ఎవరైనా ఇచ్చిన హామీలను విస్మరించి పాలన సాగిస్తే ప్రజా పోరాటాలు తప్పవని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు హెచ్చరించారు. సోమవారం ఖమ్మంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం మహ్మద్‌ సలాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఖాతాలో డబ్బులు జమ సహా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టు కోలేదన్నారు. పాలనను విస్మరించి మత ప్రచారానికి ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. పార్లమెంటు భవన ప్రారంభోత్సవ సందర్భంగా నిమ్న వర్గాల పట్ల మోడీ వైఖరి.. బహిర్గతమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా మత విద్వేషాలను రెచ్చగొడుతున్న మోడీ సర్కార్‌ను సాగనంపాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిరుద్యోగ భృతి, రుణమాఫీ, పోడు భూములకు పట్టాలు మొదలైన వాటిపై స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ అందులో ఏ ఒక్కటి పూర్తి చేయలేదన్నారు. పోడు భూములకు హక్కు పత్రాల ”విషయమై నాన్చివేత ధోరణి అవలంభిస్తుందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జూన్‌ నాలుగున కొత్తగూడెంలో జరిగే ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా నుంచి 300 బస్సులు, 100 ఇతర వాహనాల్లో తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని హేమంతరావు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, సహాయ కార్యదర్శి దండి సురేష్‌, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ మహ్మద్‌ మౌలానా తదితరులు పాల్గొన్నారు.

Spread the love