లక్షలాది వాహనదారులకు ఉపశమనం
ఆ రోడ్డును ప్రమాదరహితంగా మారుస్తాం
వచ్చే వారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీనీ కలుస్తాం : ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ ఆల్ ఇండియా రేడియోస్టేషన్ వరకు 7.1 కి.మీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ లక్షలాది మంది వాహనదారులకు ఉపశమనం కలుగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాయలంలో ఎలివేటెడ్ కారిడార్‌పై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాన్ని డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌తో ప్రమాదరహితం మార్చబోతున్నట్టు తెలిపారు. అందుకు రూ. 941 కోట్ల ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర వాటాగా రూ. 200కోట్లు ఇచ్చేందుకు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపారు. నాగపూర్ తర్వాత ఇండియాలో చేపట్టే రెండో పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 54 కాలనీల్లో నివసించే సుమారు 20లక్షల మంది ప్రజలకు పెద్ద ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. జాతీయరహదారి 65 రూట్‌లో ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు విపరీతమైన రద్దీతో రోడ్ దాటేందుకు ప్రజలు ఇబ్బందిపడుతున్నారనీ, ఈ సమయంలో రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
దీనికి వీలైనంత త్వరగా అనుమతులు పొంది, టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ఎంవోఆర్‌టీహెచ్ వార్షిక ప్రణాళికలో ఇప్పటికే పొందుపర్చామని ఆర్‌వో కృష్ణ ప్రసాద్ తెలిపారు. కింద సర్వీస్ రోడ్డు, మధ్యలో జాతీయ రహదారి, పైన మెట్రో రైలు నిర్మాణం నేపథ్యంలో సాంకేతికంగా పిల్లర్ ఫౌండేషన్, స్ట్రక్చర్స్, మెట్రో స్టేషన్స్ వంటి అంశాలపై చర్చించినట్టు తెలిపారు. పూర్తి నాణ్యతతో బలమైన పిల్లర్లు, రెగ్యులర్ ఎలివేటెడ్ కారిడార్ కంటే పటిష్టంగా, వెడల్పుగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్లు నిర్మించాలని ఈ సందర్భంగా సూచించారు. మంత్రి సూచన మేరకు అందుకు అనుగుణంగా హెచ్‌ఎంఆర్‌ఎల్ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఆనంద్ మోహన్ ప్రాజెక్ట్ కన్సెంట్ ఇచ్చేందుకు అంగీకరించారు. కన్సల్టెన్సీని పిలిచి డీపీఆర్ అంచనా సిద్ధం చేయాల ని కోరారు. దీనిపై వచ్చే వారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఆర్ అండ్ బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఎంవోఆర్‌టీహెచ్ రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్, హెచ్‌ఎంఆర్‌ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద మోహన్, ఆర్ అండ్ బీ సీఈ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్, హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



