మౌనాన్ని వీడి శక్తిగా మారి…

Let go of silence and become power...కుటుంబాన్ని చక్క దిద్దుకునే విషయంలో స్త్రీ చేసే శ్రమకు హద్దులు లేవు. తన పిల్లలను పోషించడానికి, వారికి మంచి భవిష్యత్‌ ఇచ్చేందుకు తన శక్తి మేరకు శ్రమిస్తుంది. 47 ఏండ్ల రుక్మణి దేవి జీవితం కూడా అలాంటిదే. ఆమె ఒక రైతును వివాహం చేసుకున్న తర్వాత గుమ్లా జిల్లాలోని అలంకేరా గ్రామంలో నివసించడానికి వచ్చింది. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం…
చిన్న వయసులోనే పెండ్లయిన రుక్మణి తన జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసింది. ముగ్గురు కూతుర్లు, ఒక కొడుక్కి జన్మనిచ్చింది. కుటుంబాన్ని పోషించాల్సిన భర్త మద్యానికి బానిసయ్యాడు. దాంతో పూట గడవడటమే కష్టమయింది. అతని వ్యసనాల ఫలితంగా ఆ కుటుంబానికి జీవనోపాధి కల్పించే మహువా చెట్లను సాగుచేసే వ్యవసాయ భూమిని కోల్పోయారు. చివరకు ఇంట్లో ఉన్న సామాన్లు కూడా అమ్ముకుని తాగేవాడు.
మద్యానికి బానిసైన భర్త
ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లాలో, ఎవరి సాయం పొందాలో అర్థం కాలేదు. అలాగే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. మద్యానికి బానిసైన భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చివరికి అతను చనిపోయాడు. అప్పటి నుండి రుక్మణి ఒంటరి పోరాటం మొదలుపెట్టింది. పిల్లల కడుపు నింపడం కోసం ఇండ్లల్లో పని చేసింది. అలాగే కూలీ పనులకు కూడా వెళ్ళేది. ఒక భయంకరమైన స్థితి కారణంగా తన చిన్న కుమార్తెను పని కోసం రాంచీ నగరానికి పంపించి. ఆ వచ్చే ఆదాయం కుటుంబానికి సహకరిస్తుందని ఆమె ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది.
అహర్నిశలూ శ్రమించింది
అప్పట్లో రుక్మణి తనలోని బాధను ఎవరితో చెప్పుకోలేకపోయేది. ఇతరులను సహాయం అడగలేక మౌనంగా రోధించేది. ఇన్ని కష్టాల్లో కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ధైర్యంగా కుటుంబాన్ని పోషించేది. ఎక్కడా వెనకడుగు వేయలేదు. తన బాధ్యతలను ఎప్పుడూ విస్మరించలేదు. పిల్లలను పెంచడం, వారికి మంచి భవిష్యత్తును అందించడం కోసమే అహర్నిశలూ శ్రమించేది. అటువంటి సమయంలోనే సంక్షేమ ప్రాజెక్ట్‌ రూపంలో ఆమెకు ఒక అవకాశం వచ్చింది. సామాజిక సంస్థ ప్రధాన్‌, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం (జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమ)కి జాతీయ మద్దతు సంస్థ, ప్రభుత్వ ప్రధాన గ్రామీణాభివృద్ధి కార్యక్రమం మొదలు పెట్టింది. ఆమె దుస్థితిని గుర్తించిన ప్రధాన్‌ సభ్యులు గ్రామసభ, పంచాయతీ ముందు ఆమె ఆవేదనను వినిపించారు. ఈ సంస్థల సంయుక్త ప్రయత్నాలతో వితంతు పింఛన్‌తో సహా సంక్షేమ పథకాలలో ఆమె పేరు నమోదు చేయబడింది.
నాలో విశ్వాసాన్ని నింపాయి
ఆమె గుర్తింపు కోసం తదుపరి దశ కీలకమైనదిగా నిరూపించబడింది. రేషన్‌ కార్డును ఆమె పేరు మీద బదిలీ చేయడంతో స్వతంత్ర, సామర్థ్యం గల మహిళగా ఆమె తయారయింది. ‘ప్రధాన్‌ మార్గదర్శకత్వంతో నేను రేషన్‌ కార్డును విజయవంతంగా పొందాను. అంటే నా కుటుంబానికి అవసరమైన నిత్యావసర వస్తువులను పొందగలుగుతున్నాను. ఇది నా తక్షణ అవసరాలను తీర్చడమే కాకుండా నన్ను నన్నుగా తీర్చిదిద్ది ఈ సమాజంలో బతికే విశ్వాసాన్ని నాకు కల్పించింది’ అని ఆమె చెప్పింది. క్రమంగా ఆమె మహిళా సమిష్టితో అనుబంధం పొందింది. సానుకూల సామాజిక పరివర్తనను సృష్టించడం ద్వారా తన విశ్వాసాన్ని పెంచుకుంది. గ్రామ సంస్థ, స్వయం సహాయక బృందం (ఎస్‌హెచ్‌జీ) మహిళల బలంతో రుక్మణి తన భూమిని లాక్కున వ్యక్తులను ఎదుర్కొంది. గ్రామంలో తనకు తిరుగులేని మద్దతు లభించడంతో గుమ్లాలోని పాల్‌కోట్‌ పోలీస్‌ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేయగలిగింది. ఆమె దృఢత్వం, స్థానిక అధికారుల జోక్యం ఫలితంగా ఆమె కోల్పోయిన భూమిని మళ్ళీ దక్కించుకుంది.
వ్యవసాయం అభివృద్ధి చేసుకుంటూ…
గృహనిర్మాణ పథకం కింద, పంచాయితీ, గ్రామసభల మద్దతుతో తన పిల్లలను శిథిలావస్థలో ఉన్న నివాసం నుండి పక్కా ఇంటికి మార్చుకోగలిగింది. ఆ గ్రామంలో సోలార్‌ లిఫ్ట్‌ను ఏర్పాటు చేయడంతో 2022 ఓ మలుపు తిరిగింది. ఇది అక్కడి ప్రజలకు పెద్దఎత్తున తాగునీరు, నీటిపారుదలని అందిస్తుంది. ఈ నీటి సౌకర్యాన్ని ఉపయోగించుకుని తన బంజరు భూము లను ఏడాది పొడవునా పంటలతో వర్ధిల్లేలా తీర్చిదిద్దుకుంది. కష్టపడే వ్యక్తి నుండి ఆత్మవిశ్వాసంతో కూడిన రైతుగా రుక్మణి దేవి రూపాంతరం చెందడం ఆమె పట్టుదలకు నిదర్శనం.
స్థిరమైన జీవనోపాధి
తన వ్యవసాయ భూమిని అభివృద్ధి చేసుకుని చుట్టూ సరిహద్దును నిర్మించింది. ఇప్పుడు ఆమె మహువా మొక్కల పెంపకంతో పాటు కూరగాయల సాగులో నిమగమై ఉంది. క్రమంగా ఓ స్థిరమైన జీవనోపాధిని ఏర్పరుచుకుంది. ఇప్పుడు ఆమె వార్షిక సంపాదన సుమారు రూ. 50,000. తన పిల్లలను చదివించేందుకు ధైర్యంగా అడుగులు వేసింది. ఆమె కొడుకు ఒకప్పుడు పాఠశాలకు వెళ్ళలేని స్థితిలో మధ్యలోనే మానేశాడు. ఇప్పుడు తిరిగి పాఠశాలకు వెళుతున్నాడు. ఆడపిల్లలు ఎక్కడో దూరప్రాంతానికి పనికి పోకుండా తల్లికి వ్యవసాయంలో సహాయం చేస్తున్నారు.
అవసరమైన వనరులు పొందితే…
రుక్మణి క్రమంగా ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పీఓ)లో భాగమయ్యింది. జిల్లా కన్వర్జెన్స్‌ ప్రోగ్రామ్‌ నుండి ప్రయోజనం పొందుతూ తన ప్రయాణం కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఆమె చేనేత పనులు కూడా నేర్చుకుంది. తన ఆదాయాన్ని మరింత పెంచుకుంది. పేదలకు ఉపయోగపడే పథకాలు, స్వయం సహాయక బృందాల సహాయం, నీటిపారుదల వంటి అవసరమైన వనరులను అందిస్తే సామాన్యుల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పేందుకు రుక్మణి జీవితం ఒక చక్కటి ఉదాహరణ.

Spread the love