షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోడీ పిలుపు
బిష్కెక్ : ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా అమలు చేసే దేశాలను ఏకాకులను చేయాలని ప్రధాని మోడీ పిలుపిచ్చారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్ర కార్యకలాపాల కోసం రిక్రూట్‌మెంట్లు జరపడంపై సమిష్టిగా పోరు సల్పాలని షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)ను కోరారు. ఈ సమిష్టి పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు వుండరాదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే పాకిస్తాన్‌ను ఉద్దేశించే మోడీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు గా కనిపిస్తోంది. ఉగ్రవాదానికి నిధులు అందించడం, సమకూర్చడం, రిక్రూట్‌మెంట్, ఉగ్రవాదులకు స్వర్గ ధామాలుగా దేశాలను మార్చడం వంటి అంశాలతో కూడిన మొత్తం వ్యవస్థనే నాశనం చేయాలని, ఇందుకోసం సమైక్యంగా, సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం వుందని వార్షిక ఎస్‌సీఓ సదస్సులో మోడీ పిలుపిచ్చారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ సహా పలువురు అంతర్జాతీయ నేతల సమక్షంలోనే మోడీ ఈ మేరకు పిలుపిచ్చారు. పశ్చిమాసియా సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అన్ని ఉద్రిక్తతలను, ఘర్షణలను కదన రంగంలో కాకుండా చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ ఎల్లప్పడూ చెబుతూనే వస్తోందని మోడీ అన్నారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్‌ఐ)ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, అనుసంథాన ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలన్నారు. ఎస్‌సీఓ నిబంధనావళి ప్రాధమిక స్ఫూర్తి ఇదేనన్నారు.
బీఆర్‌ఐలో కొంత భాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) గుండా వెళ్ళడాన్ని భారత్ విమర్శిస్తోంది. ఉగ్రవాదం మానవాళికి తీవ్రమైన సవాలుగా కొనసాగుతోంది. ఈ ఉగ్రవాదంపై మనం సల్పే పోరులో చర్య, ప్రతిచర్య ధోరణికే మనమెన్నడూ పరిమితం కారాదని మోడీ పేర్కొన్నారు. వివిధ ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ మద్దతునిస్తున్న నేపథ్యంలో దానిపై సమిష్టి, సమైక్య పోరాటం తప్పదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదమనేది ఎవరికీ వ్యూహాత్మక సంపదగా మారరాదని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో తలెత్తిన పరిస్థితులు కేవలం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదని, ఆ ప్రభావం యావత్ ప్రపంచం అనుభవిస్తోందని అన్నారు. ఇంధన భద్రత దెబ్బతిందని, సముద్రజల వాణిజ్యం ప్రభావితమైందని, సరఫరాగొలుసు కూడా విచ్ఛిన్నమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ సౌత్ దేశాలు ఈ అంత రాయాల భారాన్ని, ప్రభావాన్ని తీవ్రంగా అనుభవిస్తున్నా యని అన్నారు. ఈనాటి పరస్పరాధారిత ప్రపంచంలో భద్రతా పరిధి మరింత విస్తృతమవుతోం దన్నారు. శాంతియుత యురేసియా కోసం శాంతి సుస్థిరతల ప్రాముఖ్యతను ప్రధాని నొక్కి చెప్పారు. అనుసంథానతను మెరుగుపరచాల్సిన ప్రాముఖ్యతను కూడా పేర్కొంటూ మార్కెట్లను అనుసంథానించే, వాణిజ్య సదుపాయాలు కల్పించే, అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతునిస్తుందని చెప్పారు. అయితే అదే సమయంలో అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను కూడా గౌరవించడం ముఖ్యమని చెప్పారు.
ఉగ్రవాద దేశాలను ఏకాకులను చేద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



