– గవర్నర్ డాక్టర్ తమిళి సై
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ప్రాంతం భారత యూనియన్‌లో విలీనమైన రోజు (సెప్టెంబరు 17) ఇక్కడి ప్రజలకు ఎంతో ప్రత్యేకమైందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగానే నిజాం ఏలుబడిలో ఉన్న ప్రాంతాలు భారతదేశంలో కలిశాయని ఆమె గుర్తు చేశారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళి సై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నాటి త్యాగధనుల పోరాటాలను స్మరించుకోవాలనీ, వారి స్ఫూర్తితో ప్రజలంతా కలిసి మెలసి జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాజ్‌భవన్‌కు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.