మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం: సీపీఐ(ఎం)

– రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించండి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవ రెడ్డి
నవతెలంగాణ – కరీంనగర్ 
పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై, నాయకులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ప్రజాతంత్ర హక్కులను కాలరాస్తుందని, రాబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రోజున మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ వామపక్షపార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ చౌరస్తాలో సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ప్లకార్డులతో, మోడీ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా, స్వచ్ఛందంగా, పనిచేసే కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈ డి, ఐ టి, సీబీఐ లను తమ జేబు సంస్థలుగా బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న చట్ట ఉల్లంఘనలను పట్టించుకోకుండా బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తుందని విమర్శించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఝార్ఖండ్ సీఎం సోరన్లను అరెస్ట్లపర్వం కొనసాగిస్తుందని విమర్శించారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లను సీజ్ చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తుందన్నారు. ప్రతిపక్షాలను వేటాడేందుకు అధికార పార్టీ చాలా స్పష్టంగా ఈడిని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుందన్నారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడంలో, వేధించడంలో ప్రతిపక్షాలను బలహీనపరచడంలో రాజ్యాంగ సంస్థలను ఒక పావుగా వాడుకుంటున్నారని అన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్ల నుండి ప్రజల దృష్టిని మరల్చడం కోసం బిజెపి ప్రయత్నం చేస్తుందన్నారు. బిజెపియేతర రాష్ట్రాల ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతుందన్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఆ రాష్ట్రాలకు రావలసిన నిధులు ఇవ్వకుండా, బిల్లులు పాస్ చేయకుండా, ఆయా రాష్ట్రాల అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. ఆ రాష్ట్ర ప్రజలను ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలను నిట్ట నిలువుగా చీల్చడం లేదా నాయకులను లోబర్చుకోవడం, లొంగకపోతే ఈ డి, ఐ ఐ టి దాడులు చేసి లోబ ర్చుకోవడం జరుగుతా ఉందన్నారు. అవినీతిపరులంతా బిజెపిలోకి చేరితే  దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ఆపివేయడం దేనికి సంకేతం అన్నారు. బీజేపీలో చేరితే నీతిమంతులు అయిపోతారా అని ప్రశ్నించారు. దేశ సంపదను కార్పొరేట్లకు పప్పు బెల్లాళ్ల అమ్ముతూ దేశ ప్రజలను మతం పేరుతో మభ్యపెడు తుoదన్నారు. ఇలాంటి నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు, అభ్యుదయ శక్తులు పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ బడా సంస్థలకు లాభం చేకూరుస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కుతుంది అన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి జరగడం లేదా అని ప్రశ్నించారు. ఒక్క బీజేపీ నాయకుడి ఇళ్లల్లో సోదాలు ఎందుకు జరగవని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ సంస్థలైన ఈ డి, ఐ టి, సి బి ఐ లాంటి సంస్థలను బీజేపీ తమ రాజకీయ ప్రాబల్యం కోసం వాడుకుంటుందన్నారు. ఇలాంటి నిరంకుశ విధానాలను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమిని ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి అరెస్టులు దాడులు కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే సృజన్ కుమార్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు డి నరేష్ పటేల్, సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు పైడిపల్లి రాజు, కే మల్లవ్వ, కే బుచ్చన్న, తిప్పారపు సురేష్, జి.తిరుపతి నాయక్, పుల్లెల మల్లయ్య, గజ్జల శ్రీకాంత్, బి మహేందర్, రాయి కంటి శ్రీనివాస్, మచ్చ రమేష్,  బి సదాశివ, కే అరవింద్, చందు, నవీన్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love