మేడే స్పూర్తితో హక్కుల రక్షణకై పోరాడుదాం

– ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
నవతెలంగాణ-ఖమ్మం
మే డే స్ఫూర్తితో హక్కుల రక్షణకై కార్మిక లోకం పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని గిరి ప్రసాద్‌ భవన్‌లో 138వ మేడే దినోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక పండుగగా మే డేని భావిస్తారని, మే 1వ తేదీన అంతర్జాతీయంగా దాదాపు 180 దేశాలు మేడే దినోత్సవాన్ని జరుపుకుంటాయని తెలిపారు. 1886 వ సంవత్సరంలో పని గంటల కోసం చికాగోలో మొదలైన పోరాటంలో కార్మికుల రక్తం నుండి ఉద్భవించిందే ఎర్రజెండా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పండుగకు ఎలాంటి ఎలక్షన్‌ కోడ్‌ ఆంక్షలు పెట్టకూడదని అధికారులను కోరారు. మే డే స్ఫూర్తితో భవిష్యత్తులో కార్మికుల హక్కుల సాధనకై పోరాడని ఆయన కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, అధ్యక్ష కార్యదర్శులు గాదే లక్ష్మీనారాయణ, తోట రామాంజనేయులు, కార్యనిర్వాహక అధ్యక్షులు రావి శివరామకష్ణ, ఉపాధ్యక్షులు ఎండీ.జాకీరుద్దీన్‌, పేరబోయిన మోహన్‌ రావు, నాయకులు పోటు పూర్ణచందర్‌రావు, మేకల రవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love