వ్యవసాయ ఎగుమతుల్లో 9 శాతం పతనం

వ్యవసాయ ఎగుమతుల్లో 9 శాతం పతనంన్యూఢిల్లీ : భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో పతనం చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 8.8 శాతం క్షీణించి 43.7 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఎర్ర సముద్ర సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం పరిణామాలకు తోడు బియ్యం, గోధుమలు, పంచదార వంటి కీలక వస్తువుల ఎగుమతులపై విధించిన పరిమితుల వల్ల పతనం చోటు చేసుకుంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణంకాల ప్రకారం.. 2022-23 ఇదే 11 మాసాల్లో 47.9 బిలియన్‌ డాలర్ల వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు జరిగాయి.భారత వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లోనూ భారీ తగ్గుదల చోటు చేసుకుంది. 2022-23లో 4.7 శాతం వృద్థిని సాధించగా.. 2023-24లో కేవలం 0.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అగ్రికల్చర్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీఈడీఏ) జాబితాలోని 24 ప్రధాన వస్తువులలో 17 ఉత్పత్తులు సానుకూల వృద్థిని నమోదు చేశాయి. తాజా పండ్లు, గేదె మాంసం, ప్రాసెస్‌ చేసిన కూరగాయలు, బాస్మతి బియ్యం, అరటిపండ్లు ఎగుమతుల్లో వృద్థి చోటు చేసుకుంది.గత ఆర్థిక సంవత్సరంలో బియ్యం, గోధుమలు, చక్కెర, ఉల్లి వంటి వస్తువులపై ఆంక్షలతో సుమారు 5-6 బిలియన్‌ డాలర్ల వ్యవసాయ ఎగుమతులను దెబ్బతీశాయని ఒక అధికారి తెలిపారు. 2022-23 ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి కాలంలో 4.2 బిలియన్‌ డాలర్ల బాస్మతీ బియ్యం ఎగుమతయ్యాయి. 2023-24 ఇదే సమయంలో 22 శాతం వృద్థితో 5.2 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి.ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ధం ఎగుమతులపై ఎటువంటి ప్రభావం చూపలేదని ఓ అధికారి తెలిపారు. అధిక విలువ కలిగిన ఇండియన్‌ బ్రాండ్‌ల సరఫరాలో మంచి వృద్థిని సాధించడంతో పాటు భారతీయ ఆల్కహాలిక్‌ పానీయాల ఎగుమతుల్లోనూ పెరుగుదల చోటు చేసుకు ందన్నారు. ప్రపంచం 2022లో 113.66 బిలియన్ల విలువైన ఆల్కహాలిక్‌ పానీయాలను దిగుమతి చేసుకుంది. కాగా.. భారతదేశ ఎగుమతులు 2022లో 180 మిలియన్లుగా నమోదయ్యాయి. ఆల్కహాలిక్‌ పానీయాల ప్రపంచ ఎగుమతులలో భారతదేశం ప్రస్తుతం 40వ స్థానంలో ఉంది.

Spread the love