మరకలు పోగొడదాం

ఎడతెరిపి లేని వానలతో రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. ఎంత జాగ్రత్త తీసుకున్నా… ఏదో విధంగా బట్టలు, వస్తువుల మీద మరకలు పడుతూనే ఉంటాయి. పిల్లలు చేసే మరకల గురించి చెప్పక్కర్లేదు. ఇవేకాక కొన్ని సందర్భాలలో ఇంట్లో బట్టల మీద నూనె మరకలు పడుతూ ఉంటాయి. వాటి నుండి దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఆ మరకలను పోగొట్టి, మన బట్టలను, వస్తువులను ఎలా కాపాడుకోవాలో చూద్దాం…
మరకల వద్ద లిక్విడ్‌ డిటర్జెంట్‌తో రుద్ది ఆ తర్వాతే సబ్బుతో ఉతికి చూడండి. మరీ మొండి మరకలైతే మాత్రం వెనిగర్‌తో కేవలం ఆ ప్రాంతాన్ని మాత్రమే రుద్ది ఆ తర్వాత మాములుగా సబ్బుతో కడిగేయవచ్చు.
వెనిగర్‌ లేకుంటే గోరువెచ్చని నీటిలో నాలుగు యాస్పరిన్‌ బిళ్ళలు వేసి ఆ నీటిలో దుస్తులు నానబెట్టి ఉతికేయవచ్చు.
తెల్లని దుస్తులైతే మాత్రం కాస్త హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ను మరకలపై రాసి అయిదు నిముషాల తర్వాత ఉతకండి.
పెన్ను, లిప్‌స్టిక్‌ మరకలు బట్టలపై పడితే మరకపైకి వచ్చేలా ఉంచి, ఓ చిన్న పాత గుడ్డను ఆల్కాహాలులో ముంచి దాన్ని మరకపై తట్టి నట్టుగా పదేపదే చేయండి. ఆ తర్వాత ఉతకండి. మరకలు మరీ జిడ్డుగా అంటుకున్నట్లుగా అనిపిస్తే కిరోసిన్‌ తీసుకుని మరకపై పూసి అయిదు నిముషాల తర్వాత శెనగపిండితో గట్టిగా రుద్ది కడిగేయండి.
కార్పెట్‌పై క్యాండిల్‌ చుక్కలు పడితే ఓ స్టీలు గిన్నెలో ఐసుముక్కలు వేసి దాన్ని ఈ క్యాండిల్‌ చుక్కలపై కాసేపు ఉంచండి. చల్లదనా నికి ఈ క్యాండిల్‌ వ్యాక్స్‌ మరింతగా గట్టిగా మారు తుంది. అప్పుడు ఏదైనా స్పూన్‌ మొనతో దానిని చెక్కేసి బ్రష్‌తో శుభ్రంగా తొలగిస్తే సరిపోతుంది.
నిత్యం వాడే బకెట్లు మగ్‌లపై ఉండే జిడ్డు మరకలు పోవాలంటే ముందుగా వాటిని కిరోసిన్‌లో తడిపిన గుడ్డతో గట్టిగ తుడిచి ఆ తర్వాత సబ్బుతో కడగాలి.
ప్లాస్కులో దుర్వాసన పోవాలంటే నాలుగైదు కోడిగుడ్డు పెంకులను చిన్న చిన్న ముక్కలు చేసుకుని వాటిని ప్లాస్కులో వెయ్యాలి. దానిపై వేడినీటిని పోసి మూతపెట్టాలి. మధ్య మధ్యలో బాగా కదిలిస్తూ ఓ గంటన్నర పాటు ఉంచండి. ఆ తర్వాత సబ్బుతో కడిగేయండి. తడారిన తర్వాత ఓ చెంచాడు పంచదార అందులో వేసి మూతపెట్టి ఉంచండి. దుర్వాసన రాకుండా తాజాగా ఉంటుంది.

Spread the love