– ప్రభుత్వ పాఠశాలలో కనీసం టీచర్ లను, స్కావెంజర్ లను నియమించలేని ప్రభుత్వం అవసరమా?
– విద్యార్థుల సమస్యలతో దద్దరిల్లిన ఎస్ఎఫ్ఐ జిల్లా కలెక్టరేట్ ముట్టడి
– నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని అడిగితే అరెస్టులా
నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రైవేటు ఫీజులకు వ్యతిరేకంగా చట్టం తీసేంతవరకు ఉద్యమించాలని ప్రభుత్వ పాఠశాలలో కనీసం టీచర్లను స్కావెంజర్లను నియమించలేని ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలతో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం దద్దరిల్లింది. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ముట్టడి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించగా విద్యార్థి సంఘం నాయకులను అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు.భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరిగింది. జి జి కళాశాల నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కళాశాల నుండి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి మాట్లాడుతూ తెలంగాణ వస్తే హాస్టల్ విద్యార్థులకు పక్కా భవనాలు నిర్మిస్తామని ఎన్నో ఆశలు చూపి కనీసం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటు విద్యా పై ఉన్న ప్రేమ ప్రభుత్వ విద్యపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా విద్యా సంవత్సరం ప్రారంభం చేయడం బురదలో పన్నీరు వంటిదని అన్నారు. గురుకుల సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం లోనే అంతర్యం ఏమిటని అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా విద్యారంగంపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయకపోవడం విడ్డూరమని అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే చలో అసెంబ్లీని ముట్టడిస్తామని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ నిజామాబాదులోని లోని ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్ పాఠ్య పుస్తకాలను ఇప్పటికే అందించకపోవడం దారుణమని అన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులు వాటర్ ప్యూరిఫైయర్స్ ని ఏర్పాటు చేయాలని మరియు మరమ్మత్తులు చేయడానికి హాస్టళ్లకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు . పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను కాస్మోటిక్ చార్జీలను పెంచిన వాటిని అమలు చేయాలని లేకపోతే రానున్న కాలంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్యల పై పరిష్కరించమని అక్రమంగా అరెస్టు హేయమైన చర్యగా అభివర్ణించారు. అక్రమ అరెస్టులు చేసిన వారిని విడుదల చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పోశమైన మహేష్, సిద్ధల నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి వాగ్మరే విశాల్, యూనివర్సిటీ అధ్యక్షులు ప్రసాద్, జిల్లా నాయకులు జవహర్, సంధ్య, నీలిమ, శైలజ, ఛిత్రు, చరణ్, ఆదిత్య తదితర నాయకులు పాల్గొన్నారు.