తలసేమియా నిర్మూలనకు కృషి చేద్దాం

– డాక్టర్‌ ప్రదీప్‌ సేవలు అభినందనీయం
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం
తలసేమియా నిర్మూలనకు కృషి చేద్దామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మంలోని లేక్‌ వ్యూ హాల్‌లో ప్రపంచ తలసేమియా దినోత్సవం పురస్కరించుకొని తలసేమియా, సికిల్‌ సెల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు కూరపాటి ప్రదీప్‌ కుమార్‌ నిర్వహించారు. తొలుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేక్‌ను చిన్నారులతో కలిసి కట్‌ చేసి తినిపించి దీవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధ పడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, సొసైటీ సేవలతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరు తలసేమియా పిల్లల పట్ల బాధ్యతగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వారికి మీ వంతు కృషిని అందించాలని కోరారు. తలసేమియా రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మీకు తోచిన రీతిలో వారికి రక్తం అందించేందుకు సహకరించాలని కోరారు. ఇది చాలా పెద్ద బాధ్యత అని, ఇంతటి సమర్థవంతమైన బాధ్యత నిర్వహిస్తున్న టిఎస్సీఎస్‌ను, డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌ను మంత్రి అభినందించారు. డాక్టర్‌ ప్రదీప్‌ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా టిఎస్సీఎస్‌ వ్యవస్థాపకులు చంద్రకాంత్‌ అగర్వాల్‌, రత్నావలి చేస్తున్న సేవలను వివరించారు. తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం, తలసేమియా నిర్మూలన కోసం పనిచేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ టిఎస్సీఎస్‌ అని, 3500 మంది తలసేమియా పిల్లలకు ఉచితంగా సేవలందిస్తున్న ఏకైక సంస్థ టిఎస్సీఎస్‌ అని తెలిపారు. ఇప్పటివరకు టిఎస్సీఎస్‌ ఆధ్వర్యంలో 3076 రక్తదాన శిబిరాలు నిర్వహించి 2,38,119 మంది తలసీమియా పిల్లలకు రక్తం ఎక్కించారన్నారు. అనంతరం పిల్లలకూ తల్లిదండ్రులకు ఆటలు పాటలు, డ్యాన్స్‌ పోటీలు నిర్వహించడంతో పాటు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఫైర్‌ రవి, జబర్దస్త్‌ ఫేమ్‌ మొగిలి, మాయాద్వీపం ఫేమ్‌ నాగేందర్‌ వారి బృందం పిల్లలను అలరించారు. అనంతరం తలసీమియా దినోత్సవం సందర్భంగా ఐఎంఏ హాల్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఖమ్మం మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ వారిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణా పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 24వ డివిజన్‌ కార్పరేటర్‌ కమర్తపు మురళి, ఖమ్మం నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జావేద్‌ పాషా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చావా నారాయణ, సైదబాబు, పాలకుర్తి నాగేశ్వరరావు, టిఎస్సీఎస్‌ సొసైటీ డాక్టర్‌ రాజ్‌కుమార్‌, డాక్టరు యశ్మిత, సభ్యులు నజీర్‌, అభిషేక్‌ శర్మ, సిరాజ్‌, నరేష్‌, వంశి, లక్ష్మీ, సుచరిత, మల్లేశ్‌, సుగుణ, దివ్య, నిర్మల, భద్రమ్మ , పిల్లల తల్లితండ్రులు పాల్గొన్నారు.

Spread the love