ఇండ్ల స్థలాలు సమస్యల పరిష్కారంకై జులై 3న కలెక్టరేట్ వద్ద మహాధర్న

–  జయప్రదానికి ప్రజా సంఘాల పోరాట వేదిక పిలుపు 

నవతెలంగాణ కంఠేశ్వర్
ఇండ్లు ఇండ్ల స్థలాలు సమస్యల పరిష్కారం కోసం జూలై మూడున కలెక్టరేట్ వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల పోరాట వేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లాలో సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు నూర్జహాన్, పెద్ది వెంకట్రాములు, పి వెంకటేష్ , పెద్దిసూరి సుజాత,  అనిల్, కొండ గంగాధర్ నాయకులు మాట్లాడుతూ.. ఇండ్లు, ఇండ్ల స్థలాలు సమస్య పరిష్కారం కోసం, జూలై 3న కలెక్టర్ కార్యాలయాల దగ్గర మహాధర్నను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక పిలుపునిస్తున్నది. ఇండ్లు లేని పేదలు వేలాదిగా తరలివచ్చి ధర్నాల్లో పాల్గొనాలని, తమ గొంతు వినిపించాలని కోరుతున్నది.  ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకత్వ బృందం కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తుంది, జిల్లాలో సమస్య లోతుపాతులను కలెక్టర్కు వివరిస్తుంది. పరిష్కార మార్గాలు ప్రతిపాదిస్తుంది. సమస్య తీవ్రతను పాలకులు గుర్తించటం లేదు. కొన్ని కేంద్రాల్లో పోలీసులు, రెవిన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, రియల్ ఎస్టేట్ కబ్జాదారులతో కుమ్మక్కై పేదల మీద దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం, సమస్య పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పోరాట వేదిక నిర్ణయించింది. దిక్కులేని బతుకులు వెతలు గమనించింది. అందుకే పోరాటం ఉదృతం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికైనా గుడిసె వాసులపై నిర్బంధం ఆపాలనీ, కేసులు రద్దు చేయాలనీ, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నది. గుడిసెలు వేసుకున్న వారందరికీ 125 గజాల చొప్పున పట్టాలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలి. ఇండ్లు లేని పేదలందరికీ స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేయాలి. గృహలక్ష్మి పథక నిబంధనలు సవరించాలి. సొంత ప్లాటు ఉన్న పేదలందరికీ వర్తింపజేయాలి. ఆర్థిక సహాయం పైన చెప్పిన విధంగా మార్పు చేయాలి నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లన్నీ వెంటనే అర్హులకు కేటాయించాలి. మిగిలినవి తక్షణం నిర్మాణం పూర్తి చేసి కేటాయించాలి. గుడిసెవాసుల మీద కేసులు రద్దు చేయాలి. నిర్బంధం ఆపాలి. సమస్యలను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్, ఏషాల గంగాధర్, అనిత, జంగం గంగాధర్ పుష్పులింగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love