ప్రజా సంఘాల ఐక్యవేదిక బహిరంగ సభను విజయవంతం చేయండి

నవతెలంగాణ- కంటేశ్వర్
ప్రజా సంఘాల ఐక్యవేదిక బహిరంగ సభను విజయవంతం చేయాలని నిజామాబాద్ సిపిఎం ఏరియా కార్యదర్శి పెద్ది సూరి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూ పోరాటాలను సందర్శించుటకై ఈనెల 18న ప్రారంభమైన ప్రజా సంఘాల ఐక్యవేదిక బస్సుయాత్ర ఈనెల 24 తారీఖున నిజామాబాద్ రానున్నది ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇండ్లు , ఇండ్ల స్థలాలకై ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న బాధిత ప్రజలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ సిపిఎం ఏరియా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ.. నగర పార్టీ ఆధ్వర్యంలో స్థానిక దుబ్బ ప్రాంతంలో నెల రోజుల క్రితం ప్రారంభమైన భూ పోరాట ప్రజలు మరియు ఇప్పటికి ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇండ్లలో బ్రతుకులు ఈడుస్తున్న ప్రజలందరూ ఈ బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల జీవితాల్లో మార్పు రావట్లేదని ప్రజల పక్షాన పని చేసిన ప్రభుత్వాలే కరువయ్యాయని ముఖ్యంగా నివాస స్థలాలు లేక అనాధల్లా ప్రజలు బతుకుతున్న పరిస్థితి మన దేశంలో రాష్ట్రంలో దాపరించిందని అన్నారు. పోరాడి సాధించుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ దిశగా సిపిఎం పార్టీ ప్రజలను ఏకం చేసి పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్, బెజగం సుజాత, పి మహేష్,కటారి రాములు, నగర కమిటీ సభ్యులు, ధ్యానంగుల కృష్ణ, అనసూజమ్మ,నల్వాల నర్సన్న, పాల్గొన్నారు.

Spread the love