కేజ్రీవాల్‌తో మమత భేటీ ఆర్డినెన్స్‌పై ఆప్‌ పోరాటానికి పూర్తి మద్దతు

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం, ఆప్‌ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మమత పూర్తి మద్దతు ప్రకటించారు. అలాగే ఈ ఆర్డినెన్స్‌ రాజ్యసభలో బిల్లుగా ఆమోదం పొందకుండా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని మమత పిలుపునిచ్చారు. కేజ్రీవాల్‌తో భేటీ తరువాత మమత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపిని ఓడించడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఈ ఆర్డినెన్స్‌ ఒక ‘పెద్ద అవకాశం’ కల్పించిందని మమత తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌ను ప్రతిపక్షాలు అడ్డుకోగలిగితే ప్రజలకు బలమైన సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. ఇలాంటి ఆర్డినెన్స్‌లు దేశానికి ప్రమాదమని మమత అన్నారు. కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ఈ ఆర్డినెన్స్‌తో కేంద్రం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందని విమర్శించారు. ఎన్నికైన ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను భంగం చేయడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూడు మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తుందని కేజ్రీవాల్‌ విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించడం, గవర్నర్లు-ఆర్డినెన్స్‌ను ఉపయోగించడమే అనే మూడు మార్గాలు అని చెప్పారు.
కేంద్రం ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు
దేశమంతా తిరుగుతా : కేజ్రీవాల్‌
సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకుండా చూసేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలను కలవడానికి దేశవ్యాప్తంగా పర్యటన చేస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మంగళవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడానికి ముందు కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీ వాసుల హక్కుల కోసం దేశమంతా తిరుగుతా.. ఢిల్లీ ప్రజలకు న్యాయం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి కేంద్రం ఆ హక్కులను లాగేసుకున్నది’ అని కేజ్రీవాల్‌ చెప్పారు. ‘ఇది రాజ్యసభలోకి వచ్చినప్పుడు ఆమోదం పొందకుండా చూసుకోవాలి. నేను అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుసుకుని మద్దతు కోరతాను’ అని కేజ్రీవాల్‌ తెలిపారు. అలాగే, ఈ బ్లాక్‌ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జూన్‌ 11న ఇక్కడి రాంలీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఇప్పటికే ప్రకటించింది.

Spread the love