గంజాయి రూటు మారింది

– మిర్చిబజ్జీలు, సమోసాల్లో కలిపి విక్రయాలు
– పట్టణాలు సహా గ్రామాల్లోనూ గుప్పుమంటున్న మత్తుపదార్థాలు

– అంబులెన్సులు, ద్విచక్రవాహనాల్లో తరలింపు
– పట్టుబడుతున్న కేసులన్నీ రూరల్‌ ప్రాంతాల్లోనివే..
– ఏపీ, మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొస్తున్న ముఠా
– ‘డ్రగ్‌ ఫ్రీ’ లక్ష్యంతో పోలీస్‌ శాఖ దృష్టిసారింపు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
గంజాయి రూటు మారింది. పంథా మార్చుకున్న కేటుగాళ్లు.. ఊహించని రీతుల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. ఇది పట్టణాల నుంచి గ్రామాలకూ పాకింది. తినే పదార్థాల్లో కలిపి మరీ గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో రెండ్రోజుల కిందట మిర్చిబజ్జీలు, సమోసాల్లో కలిపి విక్రయిస్తుండగా పోలీసులు బట్టబయలు చేశారు. ఇన్నాళ్లూ సిగరేట్‌ పీకల్లోనూ, కూల్‌ డ్రింక్స్‌లోనూ కలిపి అలవాటు చేసేవారు. ఇప్పుడు తినుబండారాల్లో కలిపి మరీ అలవాటు చేస్తున్నారు. ఇక ఇటీవల పట్టుబడుతున్న కేసులన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే కావడం గమనార్హం. ఏపీ, మహారాష్ట్ర నుంచి అడ్డదారుల్లో తీసుకొస్తున్న కేటుగాళ్లు.. అంబులెన్స్‌ల్లోనూ తరలిస్తున్నారు. విద్యార్థులు, కార్మికులే టార్గెట్‌గా విక్రయిస్తున్న ముఠా సభ్యులు వారినీ ఈ దందాలోకి లాగుతున్నారు. ఈజీమనీ కోసం యువతే పెద్దఎత్తున గంజాయి స్మగ్లింగ్‌లో చేరి జీవితాలు నాశనం చేసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా నిఘా పెట్టినా.. గంజాయి స్మగ్లర్లు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు. కొన్నాళ్లుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఉన్నత చదువులు చదువుకుని ఎదగాల్సిన సమయంలో యువత మత్తులో జోగుతోంది. జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఈ దందాలో చేరుతున్న తీరును పోలీసులు గమనించారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో ఓ అంబులెన్స్‌ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా.. గంజాయి బయటపడింది. కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల నుంచి గంజాయి లింకును ఛేదించే పనిలో ఉన్నారు. అయితే నిందితులకు విక్రయించిన వారి వివరాలుగానీ, సమాచారంగానీ సరిగా లేకపోవడం, ఇతర రాష్ట్రాల్లో వారి దందా సాగడం వంటి పరిస్థితుల్లో పోలీసులు మరింత శ్రమించాల్సి వస్తోంది. ఏదేమైనా కరీంనగర్‌ కమిషరేట్‌ వ్యాప్తంగా పరిశీలిస్తే 2020లో 27 కేసులు నమోదు చేసిన పోలీసులు 71మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 381.830కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2021లో 24 కేసులు నమోదు చేసి 384.430 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని 61మందిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది 2022లో 22 కేసులు నమోదు చేసి 59మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 33.919కిలోగ్రాముల గంజాయిని, 0.600మిల్లీ లీటర్ల లిక్విడ్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వేడి వేడి బజ్జీల్లో గంజాయి గుమ్ము
వేడి వేడి బజ్జీలంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. సాయంత్రం పూట స్నాక్స్‌ తీసుకునే సమయంలో వేడి బజ్జీలను తింటుంటే ఆ మజానే వేరు. రుచికరమైన బజ్జీలను సాయంత్రం వేళల్లో తినేందుకు చాలామంది స్నాక్స్‌ సెంటర్ల ముందు క్యూ కడతారు. అదే సమయంలో బజ్జీలలో మత్తు పదార్థమైన గంజాయిని కలిపి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యవహారం రెండ్రోజుల కిందట రాజన్నసిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. జీవనోపాధి నిమిత్తం ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన ఒక వ్యక్తి కోనరావుపేట మండలంలో ఒక హోటల్‌ నడుపుతున్నాడు. ఈ హోటల్‌లో బజ్జీలలో గంజాయి కలుపుతూ ప్రజలకు విక్రయిస్తున్నాడు. కొంతమంది స్థానికులు దీనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హోటల్‌లో తనిఖీ చేయగా.. నిందితుడి గుట్టు బయటపడింది. గంజాయి ఆకులను ఎండబెట్టిన తర్వాత మిర్చీలు, బజ్జీలలో కలుపుతున్నట్టు పోలీసులు తేల్చారు. హోటల్‌ యజమానితోపాటు అతడికి సహకరిస్తున్న మరొక వ్యక్తిని రిమాండ్‌కు తరలించారు.
‘డ్రగ్‌ ఫ్రీ’ లక్ష్యంతో..
‘డ్రగ్‌ ఫ్రీ’ కరీంనగర్‌ లక్ష్యంతో పోలీస్‌ శాఖ దృష్టిసారించింది. గంజాయి రవాణా, ఇతర మత్తు పదార్థాలు, పానీయాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం అక్రమ రవాణా నియంత్రణ కోసం తనిఖీలు, దాడులను కొనసాగిస్తోంది. యువతను సన్మార్గంలో పయనింపజేయాలనే ఉద్దేశంతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించి పట్టుబడిన వారికి వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తోంది. ముఖ్యంగా మాదకద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించినా పీడీయాక్ట్‌లు నమోదు చేస్తోంది. ఈ ఏడాది కరీంనగర్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా 20మందిపై పీడీయాక్ట్‌లు నమోదు చేసింది.
మత్తుకు బానిసలు కావొద్దు
యువత మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎక్కువశాతం మంది యువత వాటిని మొదట సరదాగా తీసుకుని తర్వాత బానిసలుగా మారుతున్నారు. ఆ మత్తులో ఉన్మాదులుగా మారి హింసాయుత ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాల్సిన వయసులో ఎందుకూ పనిరాకుండా పోవడమే కాకుండా సమాజ వినాశకులుగా మారుతున్నారు. మత్తు పదార్థాలు విక్రయించినా, రవాణా చేసినా పీడీయాక్ట్‌లు నమోదు చేస్తాం.
ఎస్‌ శ్రీనివాస్‌, అడిషనల్‌ డీసీపీ(శాంతిభద్రతలు)

Spread the love