పెండ్లి చేసుకున్న ‘దసరా` దర్శకుడు

నవతెలంగాణ హైదరాబాద్: ‘దసరా’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా తనదైన ముద్రవేసుకున్న శ్రీకాంత్‌ ఓదెల చిన్ననాటి స్నేహితురాలు సౌమ్యకృష్ణను వివాహం చేసుకున్నారు. గోదావరిఖనిలో జరిగిన వివాహనికి కొద్దిమంది బంధువులు, పలువురు సినీ ప్రముఖుల మాత్రమే హజరయ్యారు. ఆందుకు సంబంధించిన ఫొటోని ప్రముఖ హీరో నాని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘మన శ్రీకాంత్‌ పెళ్లి చేసుకున్నాడు. మీ ఆశీస్సులు పంపండి’’ అని అభిమానుల్ని కోరారు. దాంతో, నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వేరే రాష్ట్రంలో తన కొత్త సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండడంతో శ్రీకాంత్‌ పెళ్లికి నాని హాజరుకాలేకపోయారని సమాచారం. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దగ్గర ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ సినిమాలకు పనిచేసిన శ్రీకాంత్‌ ‘దసరా’తో డైరెక్టర్‌గా మారారు. నాని, కీర్తిసురేశ్‌, దీక్షిత్‌శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా రూ.100 కోట్లకిపైగా వసూళ్లు సాధించి, నాని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తెలంగాణలోని సింగ‌రేణి స‌మీపంలో వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ సాగే క‌థ ఇది. ఈ ఏడాది మార్చి 30న థియేటర్లలో రిలీజ్‌ అయి సందడి చేసిన ‘దసరా’ ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Spread the love