ప్రపంచానికి మార్గదర్శి మార్క్సిజమే

కర్నాటకలో మోడీకి దిమ్మతిరిగే షాక్‌
– సుందరయ్య ఆదర్శ రాజకీయనేత
– నవతెలంగాణ నూతన వెబ్‌సైట్‌ ప్రారంభోత్సవంలో తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మార్క్సిజం, లెనినిజం విశ్వసిద్ధాంతమని, ఇదే ప్రపంచానికి మార్గదర్శి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నవతెలంగాణ దినపత్రిక నూతన వెబ్‌సైట్‌ను హైదరాబాద్‌లోని ఎమ్‌హెచ్‌ భవన్‌లో గురువారం ఆయన ప్రారంభించారు. సుందరయ్య వర్థంతి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పేజీలను సీజీఎం ప్రభాకర్‌ ప్రారంభించారు. పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతి సందర్భంగా సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీజీఎం ప్రభాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడారు. మారుతున్న రాజకీయ పరిణామాలను గమనించాలని అన్నారు. 30ఏండ్లలో మార్క్సిస్టు సిద్ధాంతానికి వ్యతిరేక పరిస్థితులుండేవని, ప్రస్తుతం అనుకూలంగా వాతావరణం ఉందని తెలిపారు. బద్ధ శత్రువులైన సౌదీ, ఇరాన్‌ మిత్రులుగా మారారని, అందుకు చైనా మధ్యవర్తిత్వమే కారణమని చెప్పారు. ప్రపంచ స్థాయి మీడియా సోషలిజం, కమ్యూ నిజంవైపు చూస్తున్నదని అన్నారు. ప్రపంచ రాజకీయాల్లో అమెరికాను చైనా అధిగమిస్తోందని అన్నారు. అమెరికా దివాళా దశలో ఉందని, రాబోయే కాలంలో డాలర్‌ పతనమయ్యే అవకాశముందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కొత్త కరెన్సీ ముందుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఎదురులేదని భావించిన మోడికి కర్నాటక ఫలితాలతో దిమ్మతిరిగిందని అన్నారు. ప్రజాసమస్యలను పక్కనపెట్టి మతం పేరుతో ప్రజలను తప్పుదోవపట్టించారని, బీజేపీ మైండ్‌గేమ్‌ రాజకీయం ప్రజలకు అర్థమైందని, ఇక నుంచి ఆ పార్టీ ఆటలు సాగవని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ బీజేపీ వ్యతిరేక పోరాటంతోపాటు ప్రజాస్వామికంగా వ్యవహరించాలని, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సూచించారు. పోడు భూములు, డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పంపిణీ, ధరల నియంత్రణ, షెడ్యూల్‌ పరిశ్రమలకు సంబంధించిన కనీస వేతనాల జీవోలు వంటివాటిపై కేసీఆర్‌ వైఖరి మారాలని అన్నారు.
సుందరయ్య స్థిరత్వం కల్గిన ఆదర్శ రాజకీయ నేత అని కొనియాడారు. కమ్యూనిస్టు మేనిఫెస్టోను భారతదేశ పరిస్థితులకు అన్వయించిన దార్శనికుడని చెప్పారు. ఆదర్శం, నిరాడంబరత కల్గిన నేత అని, కార్యకర్తల పట్ల ప్రేమను చూపించేవారని తెలిపారు. భావజాల రంగంలో పత్రికలు, సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత రాజకీయాలను అర్ధం గావించి, ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యత పత్రికల మీద ఉందని, అందుకనుగుణంగానే నవతెలంగాణ సిబ్బంది పని చేయాలని అన్నారు. సీజీఎం ప్రభాకర్‌ మాట్లాడుతూ పత్రిక రంగంలో డిజిటల్‌ రంగం వేగంగా విస్తరిస్తోందని అన్నారు. అందులో భాగంగానే ఈ-పేపర్‌ తీసుకొచ్చామని, దీన్ని 25లక్షలకుపైగా మంది చూస్తున్నారని తెలిపారు. ఈ-పేపర్‌, వెబ్‌సైట్‌ను ఎక్కువ మంది చూసేవిధంగా ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. మొబైల్‌ ఫోన్లు పెరగడంతో డిజిటల్‌ మీడియా ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. సుందరయ్య వర్ధంతి రోజున వెబ్‌సైట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఎన్నో నిర్భంధాలను ఎదుర్కొని ప్రజాశక్తిని ఏర్పాటు చేశారని, అదే స్ఫూర్తితో నవతెలంగాణ కొనసాగుతున్నదని అన్నారు. సుందరయ్య కన్న కలలను సాకారం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇన్‌చార్జి ఎడిటర్‌ రాంపల్లి రమేష్‌ మాట్లాడుతూ ఆనాడు సుందరయ్య ‘పత్రిక ఒక్కటుంటే పదివేల సైన్యం’ అని అన్నారని గుర్తుచేశారు. పత్రిక ఏర్పాటుకు బీజాలేసింది ఆయనేనని అన్నారు. ఆయన ఆశయాలు, అకాంక్షలకు అనుగుణంగా పత్రిక పనిచేయాలని సూచించారు. నేడు వెబ్‌మీడియా విశ్వసనీయ సమాచారం అందిస్తున్నదని అన్నారు. నవతెలంగాణ వెబ్‌సైట్‌ అకర్షనీయంగా, అకట్టుకునేవిధంగా, పాఠకులను చదివించేవిధంగా ఉండాలని సూచించారు. స్వేచ్ఛ ఇన్‌చార్జి ప్రవీణ్‌ మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానంతో భావజాల వ్యాప్తిని పెంచాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సమాచారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. టాప్‌5 వెబ్‌సైట్‌లలో నవతెలంగాణ ఒకటిగా ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. నవతెలంగాణ బుక్‌ హౌస్‌ ఎడిటర్‌ ఆనందాచారి, 10టీవీ మాజీ ఎండీ వెణుగోపాల్‌, స్వేచ్చ ఇంఛార్జ్‌ ప్రతినిధులు భువన్‌, దివ్య, నవతెలంగాణ వెబ్‌ డెస్క్‌ ఇంచార్జీ అనంతోజు మోహన్‌ కష్ణ, నవతెలంగాణ బోర్డు సభ్యులు, జనరల్‌ మేనేజర్లు, మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love