బీజేపీని రాష్ట్రంలోకి రానివ్వొద్దు

– మోడీ మళ్లీ గెలిస్తే దేశం మరింత వినాశనం
– ఆ పార్టీలో చేరాలనుకునే వారు ప్రమాదాన్ని గుర్తించాలి
– మతచిచ్చుతో లౌకికత్వాన్ని నాశనం చేస్తున్న కాషాయమూకలు
– మనువాదం పేరుతో చాతుర్వర్ణ వ్యవస్థ అమలుకు ప్రయత్నం
– ఒకే కులం గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు
– గిరిజనుల ప్రథమ శత్రువు బీజేపీ
– దేశ చరిత్రను, సిలబస్‌ను వక్రీకరిస్తున్నారు
– బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే బీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు
– భద్రాచలం గడ్డపై ఎర్రజెండా మళ్లీ రెపరెపలాడాలి : జనచైతన్య యాత్ర చర్ల సభలో తమ్మినేని
భద్రాద్రి కొత్తగూడెం నుంచి బొల్లె జగదీశ్వర్‌
రాష్ట్రంలోకి బీజేపీని రానివ్వొద్దనీ, అందుకోసం వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు ఐక్యంగా కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే దేశం మరింత వినాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని గద్దెదించడమే తమ లక్ష్యమన్నారు. బీజేపీ మతోన్మాదం, కార్పొరేట్‌ విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర ఆదివారం మూడోరోజు ములుగు, భద్రాద్రి కొత్తడూడెం జిల్లాల్లో సాగింది. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల మండలంలో బహిరంగ సభలను నిర్వహించింది. చర్లలో ప్రజలనుద్దేశించి తమ్మినేని మాట్లాడుతూ కాషాయ పార్టీని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకుండా వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు కృషి చేయాలని కోరారు. 2014లో అధికారంలోకి రాకముందు మోడీ అనేక వాగ్దానాలు ఇచ్చారని చెప్పారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామనీ, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనీ, రూ.80 లక్షల కోట్ల నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబం అకౌంట్‌లో రూ.15 లక్షలు జమచేస్తామంటూ హామీలిచ్చారని గుర్తు చేశారు. ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాను అణచివేస్తున్నారనీ, ప్రశ్నించే వారిపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని అన్నారు. మతచిచ్చును పెంచి లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేశారని విమర్శించారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని చెప్పారు. ముస్లిం, క్రిస్టియన్లు ఈ దేశంలో ఉండొద్దనీ, ఒకవేళ ఉన్నా మెజార్టీగా ఉన్న హిందూ మతానికి లొంగి ఉండాలంటున్నారని వివరించారు. మనువాదం పేరుతో చాతుర్వర్ణ వ్యవస్థ, కులవ్యవస్థ అలాగే కొనసాగాలని చూస్తున్నదని అన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే మతం అంటున్న బీజేపీ ఒకే కులం అని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదకరమైన పార్టీలోకి ఈ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఒకరు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అది దుర్మార్గమైన పార్టీ అని అన్నారు. దానిపై ఆ పార్టీలోకి వెళ్లేవారు ఆలోచించాలని కోరారు. వనవాసి పేరుతో గిరిజనులను బీజేపీ ఆకర్షిస్తున్నదని వివరించారు. గిరిజనుల ప్రథమ శత్రువు బీజేపీ అని విమర్శించారు. వనవాసీ అంటున్నది తప్ప ఆదివాసీలు అని ఒప్పుకోవడం లేదన్నారు. అలా అయితే ఈ దేశానికి మొదటి మనుషులు గిరిజనులే అవుతారనీ, దాన్ని ఆ పార్టీ అంగీకరించబోదని వివరించారు. ఈ దేశానికి మొదటి మనుషులు ఆర్యులన్నది వారి అభిప్రాయమన్నారు. ఈ దేశ చరిత్రను వక్రీకరిస్తున్నదని విమర్శించారు. సిలబస్‌ను మారుస్తున్నదని చెప్పారు. గర్భ సంస్కార్‌ పేరుతో పిండ దశలోనే పాఠాలు చెప్పాలని భావిస్తున్నదని అన్నారు. మతఛాందస భావాలను పెంచిపోషిస్తున్నదని విమర్శించారు. అందుకే బీజేపీని తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏడేండ్లపాటు మోడీని సమర్థించిన కేసీఆర్‌ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 2024లో బీజేపీని గద్దెదించడమే లక్ష్యమంటూ ప్రకటించారని అన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం)ను వచ్చే ఎన్నికల్లో కలుపుకుని పోతామన్నారని గుర్తు చేశారు. బీజేపీ ఎత్తుగడలను చిత్తుచేసింది, మునుగోడులో ఆ పార్టీని ఓడించింది కమ్యూనిస్టులేనని ఉద్ఘాటించారు. బీఆర్‌ఎస్‌ను సమర్థించినంతమాత్రాన రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను సమర్థించినట్టు కాదన్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు, పోడు భూములకు పట్టాలు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ధరణిలో లోపాలను సరిదిద్దకపోతే, ప్రజలకు నష్టం చేస్తే పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ సక్రమంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పనిచేస్తామన్నారు. వాడుకుని కరివేపాకులా తీసేయాలని చూస్తే మిరపకాయలా మారతామని చెప్పారు. బీజేపీ ప్రమాదాన్ని ప్రజలకు వివరించడం కోసమే ఈ యాత్ర చేస్తున్నామని వివరించారు. పోరాటాల ఫలితంగానే పోడు భూములకు పట్టాలిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. శాటిలైట్‌ సర్వే ఆధారంగా, గొత్తి కోయలకు, నక్సలైట్లకు సహకరిస్తున్నారంటూ పట్టాలివ్వబోమంటూ ప్రకటించడం సరైంది కాదని చెప్పారు. పోడు సాగుదార్లందరికీ పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన పేదలందరికీ ఇండ్లస్థలాలివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షలు, కేంద్రం రూ.పది లక్షలు కలిపి ఇంటి నిర్మాణం కోసం రూ.15 లక్షలివ్వాలని సూచించారు. భద్రాచలంలో ఏడుసార్లు గెలిచామనీ, వచ్చే ఎన్నికల్లో ఈ గడ్డపై ఎర్రజెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు
అదానీ కా అమృత్‌ మహౌత్సవాలు : పోతినేని
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహౌత్సవాలను నిర్వహిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జనచైతన్య యాత్ర బృంద నాయకులు పోతినేని సుదర్శన్‌ అన్నారు. కానీ అదానీ, అంబానీకా అమృత్‌ మహౌత్సవాలు జరిగాయని విమర్శించారు. మోడీ పాలన వారిద్దరికే ఉపయోగపడుతున్నదని చెప్పారు. ప్రజలు, కష్టజీవులు, కార్మికులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలకు వ్యతిరేకంగా పాలన ఉందన్నారు. పోరాడే వారిని అణచివేస్తున్నారనీ, ప్రశ్నించే వారిని చంపేస్తున్నారని వివరించారు. వరవరరావు, సాయిబాబాను జైల్లో నిర్బంధించారనీ, గౌరీలంకేష్‌, కల్బుర్గి చంపడమే అందుకు నిదర్శనమనీ చెప్పారు. పెగాసస్‌ పేరుతో స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌తో న్యాయమూర్తులు, ప్రతిపక్ష నాయకులు, మేధావులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారని విమర్శించారు. ఒకే మతం అంటున్న బీజేపీ ఒకే కులం అని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. కులనిర్మూలన జరిగితేనే దేశం అభివృద్ది చెందుతుందని అంబేద్కర్‌ చెప్పినా దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి బలపడాలని చూసే బీజేపీని గద్దెదించడమే తమ లక్ష్యమని చెప్పారు. సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్‌ మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోడు భూములతోపాటు వలస ఆదివాసీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అర్హులందరికీ పోడు భూములకు పట్టాలివ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) చర్ల మండల కార్యదర్శి కారం నరేష్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, నాయకులు పుల్లయ్య, బ్రహ్మచారి, మచ్చా రామారావు, మురళి, సమ్మక్క, తాటి నాగమణి, చర్ల ఉప సర్పంచ్‌ శివ, వార్డు మెంబర్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు..

Spread the love