హిమాలయ లోయల లఘుశిల్పాలు

భారత దేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు వుండడం వలన ఆ ప్రాంతం అంతా ఒక లోయలా మారింది. అలా అని కాశ్మీర్‌ లోయ అక్కడి కాశ్మీరు ప్రాంతం, లోకం నుండి కనుమరుగుగా లేదు. ఇటు పశ్చిమం నుండి వచ్చే ఆసియా ఖండాలకు అదే దారి అవడం వలన, అది ప్రకృతి అందమైన లోయ అవడం వలన అక్కడ ఎన్నో విదేశీ రాజుల దాడులూ జరిగాయి. హూణులు అటు నుండే వచ్చారు. చివరికి గుప్తుల చేత పూర్తిగా చిత్తై వెనుదిరిగారు. కాశ్మీర్‌ లోయపై ఇస్లాముల దాడులు ఎన్నో జరిగాయి. నిజానికి ఇస్లాముల దాడులు దేశమంతా జరిగాయి. అలాంటి ప్రాంతీయ దాడులు జరిగినప్పుడు బౌద్ధులు, జైనులు తమ గ్రంథాలను, కళా వస్తువులను భద్రపరుచుకున్నారు. బౌద్ధులు తమ సంస్కృతికి అద్దం పట్టే పత్రాలు, కళా వస్తువులను తీసుకుని ఉత్తరాన వున్న టిబెట్‌, నేపాల్‌ వంటి ప్రాంతాలకు పారిపోయారు. అందుకనే బౌద్ధం పుట్టింది భారతదేశంలో అయినా ఇలా పక్కదేశాలకు వెళ్లి స్థిరపడింది. జైనులు తమ గ్రంథాలను, తాళపత్రాలను పెద్ద భాండాగారాలలో దాచి వుంచారు. అందువలన వారి పురాతన విషయాలూ మిగిలి వున్నాయి. హిందూరాజులు ఆ కాలంలో పెద్ద పెద్ద రాతి మందిరాలే చెక్కించారు. ఆ మందిరాలను దాడులలో ధ్వంసం చేయడం జరిగింది. అందువలన భారతీయ కళాచరిత్ర లెక్క కట్టడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాచి వుంచిన ఈ బౌద్ధ, జైన గ్రంథాల నుండి కొంత సమాచారం తెలుసుకోగలిగారు.
కాశ్మీర్‌ లోయనుండి కొన్ని చిన్నవి, పొడవు తక్కువగా వున్న ఏనుగు దంతం, లోహపు శిల్పాలూ… ఈ విధంగా దాడుల నుండి భద్రపరిచే ప్రయత్నంలో ఉత్తరాన టిబెట్‌ ప్రాంతాలకు తీసుకు వెళ్లారు. వాటిని తరువాత వలస వచ్చిన వారు వారి వెంట వెనక్కి తీసుకు రావడం జరిగింది. అందుకే అవి ఏ ప్రాంతానికి, ఏ నిర్మాణ పద్ధతులకు చెందినవి అని ఖచ్చితంగా చెప్పడం కష్టమైంది. అవి ఇంతకు ముందు మనం చూసిన క్రీ.శ. 8వ శతాబ్దపు కార్కోటకులు, ఆపై వచ్చిన ఉత్పల, లోహార రాజుల కాలానివి. అనగా క్రీ.శ. 8 నుండి క్రీ.శ. 13 లేదా 14 శతాబ్దాల వరకూ లెక్కకట్టవచ్చు.
ధ్యాన ముద్రలో వున్న ఒక బుద్ధుడి శిల్పం క్రీ.శ. 8 వ శతాబ్దానికి చెందినది, ఏనుగు దంతంతో చెక్కబడింది. ఆ ధ్యాన బుద్ధుడి చుట్టూ బోధి సత్వులు, భిక్కులు కూడా బుద్దుడి పై ధ్యాస వుంచి కూర్చుని వుంటారు. 14 సెం.మీ ల పొడవు, 9.5 సెం.మీ ల వెడల్పు వున్న ఈ శిల్పం పట్నాలోని గోపికృష్ణ కనోరియా వారి సేకరణలో వుంది. ఈ శిల్పం చుట్టూ నిర్మించిన చెక్క పీట, క్రీ.శ. 8వ శతాబ్దపు నగిషీ అవడం వలన, బహు:శా ఈ శిల్పం ఆ శతాబ్దపు శిల్పం అని గుర్తించారు. క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందినవే ఏనుగు దంతంతో చేసిన బ్రహ్మ, ఇంద్రుడి శిల్పాలూ కనుగొన్నారు. ఇవి సుమారు 10 సెం.మీ. పొడవు వుండి, బుద్ధుడి విగ్రహానికి అటూ ఇటూ అనుచరులుగా నిర్మించిన శిల్పాలవి. బౌద్ధంలో బుద్దుడి ప్రాముఖ్యం చూపించడం కోసం ఇలా హిందూ రూపాలను అనుచరులుగా చూపే పద్ధతి వుంది. ఇంద్రుడి వేషధారణ ఒక రాజులా చూపిస్తే, బ్రహ్మని ఒక సాధువులా బుద్ధుడి వేషధారణలో చూపించాడు శిల్పి. వీరి వస్త్రం చెక్కిన మడతల తీరు వేషధారణ పాకిస్తాన్‌లోని గాంధార, ఆఫ్ఘన్‌తీరులో తీర్చబడింది. అక్కడి కళాకారులు వచ్చి ఈ శిల్పాలపై పనిచేశారు. నిజానికి కాశ్మీర్‌ లోయలో ఏనుగులు నివసించవు. కొన్ని వేల సంవత్సరాల క్రితం వున్న ఏనుగుల శిథిలాలు మటుకే దొరికాయి. అంటే ఈ శిల్పాల తయారీకి కావలసిన ఏనుగు దంతాలు వేరే ప్రాంతాల నుండి ఈ లోయకు తీసుకువచ్చారు. అంత శ్రద్ధగా వస్తువులని కళలని కూర్చుకున్నారంటే కాశ్మీర్‌ వారికి కళలంటే ఎంత ప్రేమో అర్థం అవుతుంది. ఇవన్నీ చిన్న ప్రమాణంలో వున్న లఘుశిల్పాలు. పెద్ద రాతి మందిరాలు ప్రజల కోసం నిర్మించడమే కాక తమ వ్యక్తిగత ఆనందం కోసం కూడా ఈ రాజులు, ప్రముఖులు ఇలాంటి శిల్పాలను సేకరించారు. అవే ఆనాటి వాళ్ల కథలు చెప్తున్నాయి ఈనాడు మనకు.
ఈ లోయకు సంబంధించినవి కొన్ని లోహంతో తయారు చేసిన లఘు శిల్పాలు కూడా దొరికాయి. నిజానికి కార్కోట, ఉత్పల, లోహార రాజుల కాలంలో పెద్ద పెద్ద శిల్పాలు తయారు చేశారు. కానీ అవి ఎలా చేశారో తెలుసుకోవడానికి ఆ శిల్పాలు లేవు. కొల్లగొట్టబడ్డాయి. ఈ లఘు శిల్పాలను చూసి కొంత వరకూ ఆ పెద్ద శిల్పాల తయారీ పద్ధతిని అర్థం చేసుకున్నారు. నిజానికి 300 టన్నుల రాగితో బృహద్‌ బుద్ధ విగ్రహం క్రీ.శ. 8 వ శతాబ్దంలో చేశారంటే, ఆనాటికే విగ్రహాలు పోతపోసే వారి నిపుణతని అర్థం చేసుకోవచ్చు. జింకు, రాగి మిశ్రమంతో శిల్పాలను తయారు చేస్తే, ఆ రూపాలకు చక్కటి, మెత్తటి బంగారు వన్నె వస్తుంది. ఆ శిల్పాలపై వెండి, రాగితో చేసిన చిన్న చిన్న డిజైన్లను పొదిగితే, ఆ శిల్పాలు మరింత అందంగా వుంటాయి. ఇలాంటి పనితనం కాశ్మీర్‌ కళాకారులకు క్రీ.శ. 8వ శతాబ్దం కార్కోటకుల కాలం నుండి తెలుసు.
ఇత్తడితో చేసిన ఒక సూర్యవిగ్రహం క్లీవ్‌ లాండ్‌ మ్యూజియంలో వుంది. క్రీ.శ. 7వ శతాబ్దపు కాశ్మీర్‌కి చెందిన ఈ శిల్పం పొడవు 48.6 సెం.మీ.లు. ఈ శిల్పంలో ఇరాన్‌, పాకిస్తాన్‌కి చెందిన గాంధార పద్ధతులూ కనిపిస్తాయి. కఫ్తాన్‌ వంటి అంచులు తేల్చిన వస్త్రం, బుట్టలాంటి కిరీటంతో పాటు మరో ప్రత్యేకత వుంది. ఇటు ఆగేయ దేశాలలో చేసే సూర్యవిగ్రహాలకు కాళ్లకి బూట్లు నిర్మిస్తారు. ఈ విగ్రహానికీ బూట్లు వున్నాయి. ఈ సూర్యుడి విగ్రహం చేతిలో తామరపూల గుత్తులు వుంటాయి. భారతదేశంలో చెక్కిన చాలా సూర్యవిగ్రహాల చేతిలో ఒక్కో తామరపువ్వే కనిపిస్తుంది. తామర సూర్య కిరణాలతో విచ్చుకుంటుంది. శిల్ప శాస్త్రంలో తామర పువ్వుని చేతిలో చూపిస్తే అది సూర్య నారాయణ మూర్తి విగ్రహం అని గుర్తు.
ఇలా ఆగేయ దేశాల పద్ధతిలోనూ ఉత్తర, మధ్య భారత దేశ రీతిలో తయారు చేసిన కాశ్మీర లోహపు శిల్పాలను వేరు వేరు చోట్ల భద్రంగా వుండడం గుర్తించారు. క్లీవలాండ్‌ మ్యూజియంలో అభయ ముద్రలో నిలుచున్న ఒక బుద్ధ విగ్రహం వుంది. ఈ ఇత్తడి విగ్రహం పొడవు 98 సెం.మీ. నడుము కొంచెం ఒరిగి భంగిమలో నిలుచున్న ఈ విగ్రహం క్రీ.శ. 8వ శతాబ్దపు శిల్పం. ఈ విగ్రహం కాశ్మీర్‌లోయలోనే తయారు చేశారు కానీ ఒక టిబెట్‌ ధర్మకర్త కోసం తయారు చేయబడింది. దానిపై ‘పూజనీయ నాగరాజు విగ్రహం’ అని ఒక శాసనం రాసి వుంది. నాగరాజు అనే మాట ఇక్కడ శాక్యముని బుద్ధుడి గురించి చెపుతోంది. థాయిలాండ్‌లో ‘నడిచే బుద్ద’ విగ్రహాలు చాలా ప్రసిద్ధి. అడుగువేసి నడుస్తున్నట్టున్న ఈ విగ్రహం కూడా అదే రీతిలో తయారు చేయబడింది. క్రీ.శ. 7,8 శతాబ్దాలకు చెందినదే ప్రవచన ముద్రలో వున్న మరో ఇత్తడి బుద్ధ విగ్రహం లాస్‌ యాంజలస్‌ మ్యూజియంలో వుంది. ఈ విగ్రహం పొడవు 41 సెం.మీ. ఈ శిల్పంపై వెండితో డిజైన్లు పేర్చారు.
ఆర్భాటంగా పోత పోసిన ఒక ఇత్తడి బుద్ధ విగ్రహం, న్యూయార్క్‌ లోని రాక్‌ఫేల్లర్‌ వారి వద్ద వుంది. దీని పొడవు 31 సెం.మీ. క్రీ.శ. 9 వ శతాబ్దపు ఈ శిల్పం పై వెండితో డిజైన్లు పొదిగారు. పెద్ద కిరీటం, ఆభరణాలు పొదిగి, ఈ శిల్పానికి అటు ఇటు రెండు స్తంభాలు, పీఠంపై ధర్మచక్రం, జింకలు అమర్చి ఒక ఎత్తైన కమలంపై కూర్చొని వున్న ఈ బుద్ధ విగ్రహాన్ని జ్ఞానానికి ప్రతిరూపంగా ప్రవచన ముద్రలో నిర్మించబడింది. ఈ విగ్రహానికి ధర్మకర్తలు శంకరసేన, దేవశ్రియ అనే రాణివాస స్త్రీలు. వజ్రాయుధం చేతపట్టిన బోధి సత్వుడి పేరు వజ్రపాణి. ఈయన ఒక అద్వైత జ్ఞానానికి, మాయకి గుర్తు. కోపంతో మంటలా లేచిన శిరోజాలతో వున్న ఒక వజ్రపాణి విగ్రహం క్లీవ్‌లాండ్‌ మ్యూజియంలో వుంది. ఇది 21 సెం.మీ పొడవు, క్రీ.శ. 8 లేక 9 శతాబ్దాలకు చెందింది.
హిమాలయ లోయలు : కాశ్మీర్‌ ఒక్కటే కాదు, హిమాలయాల్లో మరెన్నో లోయలున్నాయి. నిజానికి ఇవన్నీ కొంచెం పక్కగా వుండడం వలన కొన్ని లాభాలూ జరిగాయి. వారి వారి సంస్కృతి, కళలను వారు కాపాడుకోగలిగారు. పక్కగా వుండడం వలన పరదేశీయుల దాడులకు కనుమరుగై ఈ పర్వతాలు ఒక పరదాలాగా పనిచేశాయి. ముఖ్యంగా చంబా, గులేర్‌, కాంగ్రా లాంటి ఎన్నో లోయలు కళాకారులకు స్థావరాలయ్యాయి. ఆ సమయంలో జరిగిన యుద్ధాలకు కళాకారులు ఈ లోయల్లోని రాజ్యాలకు వలస పోయి అక్కడ ఎన్నో కళలను సృష్టించారు. నిజానికి ఆ కళల వలనే మన భారతీయ సంప్రదాయ కళలకు భవిష్యత్తు మిగిలింది. ఆ లోయల రాజులు అందుకు దాతలయ్యారు. చంబాలోయలో తయారు చేసిన లోహపు మహిషాసుర మర్దిని విగ్రహంపై ‘లక్షణ’ అని రాసి వుంది. బహుశా ఇది బ్రామోర్‌లోని లక్షణాదేవి మందిరానికి సంబంధించిన విగ్రహం అయివుంటుంది. దీని పొడవు 125 సెం.మీ. ఇది క్రీ.శ. 7వ శతాబ్దంలో కార్కోటక రాజుల మొదటి దశలో చేసిన విగ్రహం. ఈ విగ్రహంలో కాశ్మీర్‌ కళాకారుల శిల్పరీతి కనిపిస్తుంది. చక్కని శరీర సౌష్ఠవం, సన్నగా పొడవుగా వున్న ఈమె విగ్రహం మహీషుడిని త్రిశూలంతో చంపి తోక ఎడమ చేత్తో పట్టుకుని నిలుచుని వుంది.
ఇదే పద్ధతిలో చక్కని బంగారు మెరుపుతో తయారు చేసిన ఇత్తడి నరసింహ విగ్రహం కూడా చంబాలోయలోని బ్రామోర్‌ లోనిదే. ఇదీ క్రీ.శ. 7 వ శతాబ్దంలో తయారు చేసినదే. బలమైన శరీర సౌష్ఠవంతో ఒక గద్దెపై కూర్చుని, ఒక జత చేతులు చుబుకం కింద, మరో జత చేతులు వేళ్లు పైకి పెట్టినట్టు వుంటుంది, ఈ విగ్రహం. కొండ ప్రాంతాలలో నరసింహుడిని కొలిచే ఆనవాయితీ చాలా చోట్ల కనిపిస్తుంది. గమనించదగ్గ విషయం ఏంటంటే చెప్పులు కూడా ఈ మూర్తిలో భాగమే. ఇదీ ఇరాను వారి పద్ధతిలోనే చేయడం జరిగింది.
అక్కడి మరో లోయ, టిబెట్‌లోని బౌద్ధ ఆరామాలలో ఎన్నో చిత్రాలు, గ్రంథాలు క్రీ.శ. 11వ శతాబ్దం నుండే భద్రపరచబడ్డాయి. క్రీ.శ. 11వ శతాబ్దపు బోధిసత్వుడి లోహపు నిలువెత్తు విగ్రహం కరాచి మ్యూజియంలో వుంది. ఇలా ఎన్నో బౌద్ధ ఆధ్యాత్మిక మండల చిత్రాలు లే, లదాక్‌, టిబెట్‌లలో భద్రంగా వున్నాయి. కాశ్మీర్‌లోయ అన్ని దారుల కూడలి అవడం వలన అక్కడి కళలు ధ్వంసం అయినా ఆ పద్ధతిలో నిర్మించిన కళాసంస్కృతికి, చుట్టుపక్కల లోయలు భాండాగారాలై భద్రపరిచాయి.
-డా||యమ్‌.బాలామణి,
8106335716

Spread the love