మోడీకి తెలంగాణ కనిపించడం లేదా?

 Modi doesn't see Telangana?– బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులిస్తారా…
– కేంద్రం నుంచి వరదసాయం ఏదీ
– మండలిలో బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆవేదన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రధాన మంత్రి మోడీకి తెలంగాణ కనిపించడం లేదా?అని బీఆర్‌ఎస్‌ సభ్యులు బండ ప్రకాశ్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తాత మధు ప్రశ్నించారు. భారత్‌లో తెలంగాణ భాగం కాదా?అని అడిగారు. ప్రకృతి విపత్తులు, భారీ వర్షాలు, వరదలొస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌, మధ్యప్రదేశ్‌కే నిధులిస్తారా? అంటూ నిలదీశారు. తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని సూటిగా ప్రశ్నించారు. శాసనమండలి వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్సీ వేదాల వెంకట నరసింహాచారి మరణం పట్ల మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం శాసనమండలికి కొత్తగా ఎన్నికైన బీఆర్‌ఎస్‌ సభ్యులు దేశపతి శ్రీనివాస్‌, చల్లా వెంకట్రామ్‌రెడ్డి, ఎంఐఎం సభ్యుడు మీర్జా రహమత్‌ బేగ్‌, బీజేపీ సభ్యుడు ఏవీఎన్‌ రెడ్డిని పరిచయం చేశారు. అనంతరం రాష్ట్రంలో అత్యధిక వర్షపాత పర్యవసానాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై లఘు చర్చ ప్రారంభమైంది. ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రకాశ్‌, రవీందర్‌రావు, తాత మధు మాట్లాడుతూ భారీగా కురిసిన ఈ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అయినా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, అధికారులు నిద్ర, ఆహారం మాని ప్రజలకు అండగా ఉన్నారని అన్నారు. బాధితులకు రక్షణగా నిలబడ్డారని వివరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. మోరంచపల్లి నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఆరుగురిని భూపాలపల్లిలోని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. రోడ్లు దెబ్బతిన్నాయనీ, ఇండ్లు నీట మునిగాయనీ, పశువులు, పలు వాహనాలు కొట్టుకుపోయాయని చెప్పారు. అయితే గతనెల 31న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తక్షణ సహాయ, పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షతను ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. 2020లో వరదలు వచ్చినపుడు సాయం చేయలేదని గుర్తు చేశారు. ఇంకోవైపు బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారనీ, విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ప్రజలను, తెలంగాణను గాలికొదిలేయకుండా కేంద్రం కాపాడాలనీ, విపత్తుల సమయంలో సహాయం అందించి తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు, ఆ పార్టీ ఎంపీలు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఎంఐఎం సభ్యుడు మీర్జా రహమత్‌ బేగ్‌ మాట్లాడుతూ తాను డ్రైవర్‌గా పనిచేసినా ఎమ్మెల్సీగా అవకాశమివ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా పాతబస్తీలోని ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనీ, వాటిని పరిష్కరించాలని కోరారు. నల్లగొండ చౌరస్తా నుంచి సంతోష్‌నగర్‌ ఓవైసీ ఆస్పత్రి వరకు నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జీ పనులను వేగవంతం చేసి పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.
వరద సాయం రూ.10 వేల కోట్లకు పెంచాలి : జీవన్‌రెడ్డి
వరద సాయం కింద ప్రభుత్వం ప్రకటించిన రూ.500 కోట్లు ఏమాత్రం సరిపోవనీ, దాన్ని రూ.10 వేల కోట్లకు పెంచాలని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని కోరారు. బాధితులు, నిస్సహాయులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా భూముల ఆనవాళ్లు లేకుండా పంట పొలాల్లోకి ఇసుక మేటలు వచ్చాయని అన్నారు. వాటిని తొలగించేందుకు ఎకరాకు రూ.50 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కడెం ప్రాజెక్టుకు 18 గేట్లు సరిపోవడం లేదనీ, అదనపు గేట్లు అమర్చాలని సూచించారు. కుట్టి ప్రాజెక్టును నిర్మించాలని కోరారు. గతేడాది వరదల సమయంలో భద్రాచలానికి సీఎం కేసీఆర్‌ వచ్చి రూ.వెయ్యి కోట్లు ప్రేకటించినా, ఇంత వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్రానికి వివక్ష ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయం తీసుకోవాలని సూచించారు. ఈ సమయంలో బీఆర్‌ఎస్‌ సభ్యులు కవిత జోక్యం చేసుకుని పార్లమెంటులో ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. భానుప్రసాదరావు రన్నింగ్‌ కామెంటరీ చేస్తే ‘మీరు చీఫ్‌ విప్‌. అది మరిచిపోవద్దు’అంటూ చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చురకలంటించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే బీఆర్‌ఎస్‌ సభ్యులు తనను అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమని జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు.

Spread the love