Saturday, June 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమోడీకి 'కాక్రోచ్' వణుకు

మోడీకి ‘కాక్రోచ్’ వణుకు

- Advertisement -

​ప్రశ్నించే వారిపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు
వ్యవసాయ కార్మికసంఘం ఖమ్మం జిల్లా 25వ మహాసభలో..మాజీ ఎంపీ తమ్మినేని, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ముదిగొండ:
రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ.. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రాకోచ్ జనతా పార్టీ పేరుతో దేశంలో డిజిటల్ విప్లవం మొదలైందని మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం అన్నారు. జెన్ జీ యువత చేపట్టిన ఈ ఉద్యమంతో బీజేపీకి వణుకు మొదలైందన్నారు. ప్రశ్నించే వారిపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. వ్యవసాయ కార్మికసంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ఖమ్మం జిల్లా 25వ మహాసభ ముదిగొండ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. ముందుగా ముదిగొండ ఊరి పొలిమెర నుంచి ప్రారంభమైన ప్రదర్శన వెంకటాపురం గ్రామంలోని పొన్నెకంటి సంగయ్య నగర్ (రాయల కమలమ్మ ఫంక్షన్ హాల్) వరకూ సాగింది. మార్గమధ్యలో భూపోరాట అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని ప్రారంభోపన్యాసం చేశారు.

లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంతో కేంద్రం ఆటలాడుకుంటోందన్నారు. నీట్ లీకేజీపై కేంద్రానికి పట్టింపు లేదని తెలిపారు, తరతరాలుగా కలిసి ఉంటున్న హిందూ ముస్లింల మధ్య రాజకీయాల కోసం బీజేపీ చిచ్చు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తాను హిట్లర్‌‌గా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నిత్యం మూసీ ప్రక్షాళన జపమే తప్ప పేదల బతుకుల ప్రక్షాళన ఏదని ప్రశ్నించారు. హిట్లర్ పోకడలు ఇక్కడ సాగవన్నారు. రైతుబంధుతో పాటు కూలీ బంధూ ఇస్తామని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా కూలీబంధు ఇవ్వకపోగా రైతుబంధును కూడా ఎగవేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను విస్మరించి, పెద్దల కోసం పనిచేస్తున్న రేవంత్ సర్కారు తీరు మార్చుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు.

హామీల అమలేది? : బి.వెంకట్
​కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలేదని వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ ప్రశ్నించారు. తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కారు రూ. లక్ష కోట్లు బాకీ ఉందని అన్నారు. పింఛన్లు రూ. 4వేలు చేస్తానని హామీ ఇచ్చారని, వ్యవసాయ కార్మి కులకు ఏడాదికి రూ.12వేలు, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారని అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, వీటన్నింటిపై ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్ధమా అని సీఎం, డిప్యూటీ సీఎంకు సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించి… హైదరాబాద్‌లో మూసీ నది ప్రక్షాళన పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండున్నర ఏండ్లలో పేదలను మోసం చేయటం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదన్నారు. సంవత్సరానికి 12 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్న ప్రధాని మోడీ 2025 నాటికి వాటిని తొమ్మిదికి కుదించారని, 2026లో ఏడాదికి నాలుగు సిలిండర్లే ఇస్తామంటున్నారని చెప్పారు. అమెరికా- ఇరాన్ యుద్ధంతో సంబంధం లేని భారతీయ పేదలపై భారాలు పడుతున్నాయని, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. మతానికి రిజర్వేషన్‌లకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.

కన్వర్టెడ్డ్ ఎస్సీ, ఎస్టీలు, ఇతర కులాల వారికి రిజర్వేషన్ తొలగింపు సహేతుకం కాదన్నారు. ‘భూమి పంచాలి, పని హక్కును కాపాడుకోవాలి, కూలీ రేట్లు పెంచుకోవాలి’ అనే లక్ష్యంతో రానున్న కాలంలో మహాసభల స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎర్రజెండా రాజ్యంతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆగస్టు 10వ తేదీన వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, రైతుసంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, బండి రమేష్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శి బండి పద్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భట్టు పురుషోత్తం, సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -