Thursday, September 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలౌకికత్వం, జాతీయ ఐక్యతకు ప్రమాదంగా కేంద్రం విధానాలు

లౌకికత్వం, జాతీయ ఐక్యతకు ప్రమాదంగా కేంద్రం విధానాలు

- Advertisement -

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ-గోవిందరావు పేట
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద, విభజనవాద విధానాలు దేశ లౌకిక స్వభావానికి, జాతీయ ఐక్యతకు తీవ్ర ప్రమాదంగా మారాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ములుగు జిల్లా పస్రా గ్రామంలో ‘తెలంగాణ సాయుధ రైతాంగ వీధి నాటిక – ఆట పాట’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్న దేశమని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, వ్యవసాయ సంక్షోభం వంటి కీలక సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే మతోన్మాద రాజకీయాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతుండగా, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడం ద్వారా యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, శ్రామిక వర్గాల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు.

సంక్షేమ పథకాలకు నిధులు తగ్గించడం, విద్య, వైద్యం రంగాలను నిర్లక్ష్యం చేయడంతోపాటు ప్రయివేట్, కార్పొరేట్లకు దారాదత్తం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలంగాణలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా ప్రజలు వీరోచితంగా ఎర్రజెండా నాయకత్వన పోరాటం చేసి 3000 గ్రామాలను విముక్తి చేశారని, 10,000 ఎకరాల భూమి పంచారనీ, 4వేలమంది అమరులయ్యారని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మతోన్మాద రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, ఎస్‌ఎ‌ఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు రజనీకాంత్, నాగరాజు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకట్ రెడ్డి, పొదిళ్ళ చిట్టి బాబు, రత్నం రాజేందర్, మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, గ్రామ కార్యదర్శి నాగరాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి గోంది దేవేంద్ర పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -