మోడీ హామీలు నీటి మూటలే !

Modi's assurances are water bags!– అన్నదాతలకు రెట్టింపు ఆదాయం ఎక్కడీ
– కనీస మద్దతు ధర సైతం కరువు
– వ్యవసాయం నుంచి దూరం చేయడమే లక్ష్యం
– కార్పొరేట్‌ సంస్థలకే అందలం
– దిక్కుతోచని రైతన్న
న్యూఢిల్లీ : 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్నదాతలపై నరేంద్ర మోడీ, బీజేపీ వరాల జల్లు కురిపించాయి. ఉత్పత్తి వ్యయం కంటే కనీసం ఒకటిన్నర రెట్లు అదనంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందజేస్తామని నమ్మించారు. పాపం… రైతన్నలు అదంతా నిజమేనని నమ్మేశారు. మోడీ వరాల జల్లు చిలకరిస్తే వారు ఏకంగా ఓట్ల వర్షమే కురిపించారు. ఫలితంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే అన్నదాతల ఆశలు ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. తాను ప్రచార సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఎంఎస్‌పీని నిర్ణయించడం సాధ్యం కాదని, ఒకవేళ ధర పెంచితే అది మార్కెట్‌ను తలకిందులు చేస్తుందని సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.
2016 ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాని మోడీ మరో హామీ గుప్పించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని నమ్మబలికారు. అన్నదాతలు నిజమేకాబోలని నమ్మారు. మరోవైపు ఎంఎస్‌పీ హామీ సంగతి ఏమైందంటూ 2017లో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దీనిపై మేలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఓ ప్రకటన చేస్తూ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలోనే…అంటే 2017 నాటికే ఎంఎస్‌పీ హామీని దాదాపుగా నెరవేర్చామని పచ్చి అబద్ధం చెప్పారు. ధరను అంచనా వేసేటప్పుడు భూమి ధరను మినహాయిస్తే ఉత్పత్తి వ్యయం కంటే రైతుకు 43% అదనంగా ఎంఎస్‌పీ లభిస్తోందని తెలిపారు. భూమి ధరను పరిగణనలోకి తీసుకొని ఎంఎస్‌పీని నిర్ణయించడం అసాధ్యమని తేల్చేశారు.రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే విషయంపై అధ్యయనం చేసేందుకు కేంద్రం 2016 ఏప్రిల్‌ 13న అశోక్‌ దల్వారు కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ ఆదాయం ఏటా 10.4% వృద్ధి సాధిస్తేనే రైతు ఆదాయాన్ని నిర్ధారిత సమయంలో రెట్టింపు చేయగలమని కమిటీ తెలిపింది. అయితే రైతులు పంట దిగుబడులను, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక మద్దతు ఇవ్వలేదు. అంతేకాక తీసుకోవాల్సిన చర్యలను సైతం సూచించలేదు.
లోపభూయిష్టంగా సర్వే
వ్యవసాయ కుటుంబాల పరిస్థితిని అంచనా వేసేందుకు 2021లో నిర్వహించిన సర్వే ప్రకారం 2018-19లో వ్యవసాయ కుటుంబం నెలసరి ఆదాయం రూ.10,218 మాత్రమే. ఇది లక్ష్యంగా నిర్దేశించుకున్న మొత్తానికి కనీసం దగ్గరగా కూడా లేదు. ఎందుకంటే 2022 నాటికి వ్యవసాయ కుటుంబ సగటు నెలసరి ఆదాయాన్ని రూ.22,610కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఎస్‌బీఐకి చెందిన ఆర్థిక పరిశోధనా విభాగం మాత్రం కొన్ని పంటలకు సంబంధించి 2018తో పోలిస్తే 2022లో రైతుల ఆదాయం రెట్టింపయిందని చెబుతోంది. మహారాష్ట్రలో సోయాబీన్‌, చెరకు, కర్నాటకలో వరి, రాజస్థాన్‌లో గోధుమ, గుజరాత్‌లో వేరుశనగ, పత్తి పంటలను పండిస్తున్న రైతులను ఇందుకు ఉదాహరణగా చూపింది. మిగిలిన పంటలు వేసిన రైతుల ఆదాయం కూడా 1.3-1.7 రెట్లు పెరిగిందని తెలిపింది. అయితే ఆ రాష్ట్రాలను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? ఆదాయం లెక్కించడానికి తీసుకున్న ప్రాతిపదిక ఏమిటి? వంటి వివరాలను మాత్రం తెలపలేదు. ఈ సర్వేలో భూమి లేని కౌలుదారులను పట్టించుకోలేదు. పైగా ఆయా పంటల సేకరణ కూడా నామమాత్రంగానే జరిగింది. చెరకు పంట విషయానికి వస్తే అసలు ప్రభుత్వాలు దానిని కొనుగోలు చేయడం లేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ సర్వే పూర్తి లోపభూయిష్టంగా జరిగిందని అర్థమవుతోంది.
ఎంఎస్‌పీ నిర్ణయంలో మాయాజాలం
ఇప్పుడు కనీస మద్దతు ధరకు సంబంధించిన వాస్తవ చిత్రాన్ని పరిశీలిద్దాం. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి జూన్‌ 7న ప్రకటించిన ఎంఎస్‌పీ సమంజసంగా లేదు. పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభించేలా కూడా ఎంఎస్‌పీని నిర్ణయించలేదు. విభిన్న పంటల సాగును ప్రోత్సహించే పేరుతో వ్యవసాయంలో పెట్టుబడి పెట్టేందుకే రైతులు వెనకడుగు వేసే పరిస్థితిని కల్పించారు. రైతుల ఆదాయం రెట్టింపు అవడం మాట అటుంచి పెట్టుబడి వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. చిన్న, మధ్యతరహా రైతులు, కౌలుదారులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పెట్టుబడి వ్యయాన్ని లెక్కించే సమయంలో అధికారులు కౌలు ధరను పరిగణనలోకి తీసుకోవడం లేదు. కొందరు రైతులు తమ వద్ద ఉన్న సొమ్మునే పెట్టుబడిగా పెడుతుంటారు. మరి ఆ డబ్బును బయట వడ్డీకి ఇస్తే ఎంత వస్తుందో ఆ మొత్తాన్ని కూడా సాగు వ్యయంగానే చూడాలి కదా. కానీ అధికారులు ఆ విషయాన్నే పట్టించుకోరు.
అంచనాలకు దూరంగా…
ధాన్యం ఉత్పత్తికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తుంటాయి. అయితే కొన్ని రాష్ట్రాల అంచనాల కంటే వ్యవసాయ ఖర్చులు-ధరల కమిషన్‌ (సీఏసీపీ) అంచనాలు తక్కువగా ఉంటాయి. అంటే దీనర్థం వాస్తవ ఖర్చును ఈ కమిషన్‌ తగ్గించి చూపుతోంది. పెరుగుతున్న ఉత్పాదక వ్యయాలకు, ద్రవ్యోల్బణానికి సీఏసీసీ అంచనాలలో చోటు లేకుండా పోతోంది. కేంద్రంలోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పట్టించుకోవడం లేదు. కేరళలో ధాన్యం ఉత్పత్తి వ్యయం ఎక్కువ. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.800 బోనస్‌ ఇస్తూ రూ.2,850 రూపాయలకు కొనుగోలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలను నిరుత్సాహపరుస్తోంది. అదేమంటే మార్కెట్‌లో పరిస్థితులు దెబ్బతింటాయని అంటోంది. సీఏసీపీ అంచనాల ప్రకారమే క్వింటాలు ధాన్యం మద్దతు ధరను రూ.2,866గా నిర్ణయించాలి. కానీ ప్రకటించిన ఎంఎస్‌పీ రూ.2,183 మాత్రమే. అదే రాష్ట్రాల అంచనాల ప్రకారమైతే ఎంఎస్‌పీ రూ.3,208.5గా ఉండాలి. తెలంగాణలో పండిస్తున్న పత్తి పంట ధరనే చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలు ధరను రూ.11,031గా అంచనా వేయగా సీఏసీపీ అంచనా కేవలం రూ.6,264 మాత్రమే. కేంద్రం మాత్రం ఎంఎస్‌పీగా క్వింటాలుకు రూ.6,620ని నిర్ణయించింది. హెక్టారుకు సగటున పదిహేను క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అనుకున్నా రైతు సుమారు రూ.31 వేలు నష్టపోతున్నాడు. దేశంలో రబ్బరు పండించే రైతులు కూడా కనీస మద్దతు ధర లభించక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.
వారు ఆడింది ఆట…పాడింది పాట
ఒక వైపు సాగు ఖర్చు పెరుగుతుంటే మరోవైపు కనీస మద్దతు ధర సైతం కరువై అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా ధరల నిర్ణయంలో కంపెనీలదే పైచేయి అవుతోంది. వాటిపై ఎలాంటి నియంత్రణలు లేవు. ఎంఎస్‌పీని పెంచితే వినియోగదారులపై భారం పడుతుందన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదు. రైతులు, వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతూ కంపెనీలు సాగిస్తున్న దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అగ్రి-బిజినెస్‌ గురించి పదేపదే ఊదరగొడుతున్న కార్పొరేట్‌ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులకే ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.
సాగు నుంచి సాగనంపడానికే..
బీజేపీ ప్రభుత్వం కోరుకుంటున్నది… క్షేత్ర స్థాయిలో జరుగుతోంది ఒక్కటే. రైతులు అప్పుల విషవలయంలో చిక్కుకొని వ్యవసాయాన్ని వదిలేయడమే పాలకులకు కావాల్సింది. కార్పొరేట్‌ కంపెనీల లాభాలు గరిష్ట స్థాయికి చేరాలన్నదే వారి అభిమతం. సాగు చట్టాలు తెచ్చినా, విద్యుత్‌ బిల్లుకు సవరణలు ప్రతిపాదించినా ప్రభుత్వ లక్ష్యం రైతులను వ్యవసాయం నుండి దూరం చేయడమే. పెట్టుబడి వ్యయం పెరిగినా ఆశించిన దిగుబడి రాకపోవడం, వచ్చినా తగిన ధర లభించకపోవడంతో అన్న దాతలు వ్యవసాయ రంగం నుండి దూరమవుతున్నారు. ప్రభుత్వ హామీలు, తీపి కబుర్లు వారిని ఏ మాత్రం ఊరడించలేకపోతున్నాయి. గత దశాబ్ద కాలంలో దేశంలో నాలుగు లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు.రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో కాదు… వారి కష్టాలను రెట్టింపు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విజయం సాధించింది.మోడీ గ్యారంటీ ఇచ్చింది రైతుల ఆదాయానికి కాదు…కార్పొరేట్‌ సంస్థల లాభాలకు. ఇలాంటి పరిస్థితులలో రైతులకు మిగిలింది ఏమిటి? తీరని వ్యథ తప్ప…

Spread the love