Sunday, May 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపట్ట‌ణీక‌ర‌ణ‌తో భవిష్య‌త్ లో మ‌రిన్ని స‌వాళ్లు

పట్ట‌ణీక‌ర‌ణ‌తో భవిష్య‌త్ లో మ‌రిన్ని స‌వాళ్లు

- Advertisement -

మూసీ పునరుజ్జీవం రాష్ట్ర ప్రగతికి దిక్సూచి
అధిగమించే ప్రణాళికల అమలే లక్ష్యం
సిగల్‌ ఫ్రీ సిటీగా హైదారాబాద్‌
పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్‌లో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని ట్రాఫిక్‌, సిగల్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దానికోసం అండర్‌ పాస్‌, సర్ఫేస్‌, ఎలివేటెడ్‌ అనే మూడు స్థాయిల విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదనీ, మల్టీ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలనీ, పార్కింగ్‌ ఇబ్బందులను అధిగమించేందుకు సిటీలో మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

శనివారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై చర్చించారు. అంతకుముందు అధికారులు తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పార్లమెంటరీ స్టాండిగ్‌ కమిటీకి వివరించారు. ఆయా ప్రాజెక్టులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని కమిటీకి అధికారులు విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌పై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆసక్తి కనబర్చింది.

ఇదో విప్లవాత్మక నిర్ణయమని కమిటీ చైర్‌పర్సన్‌ శ్రీనివాసులు రెడ్డి ప్రసంసించారు. ఒక నదిని పునరుజ్జీవం చేయడం దేశంలోనే మొదటిదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రణాళికపై సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించారు. అలాగే రాష్ట్రంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలనూ కమిటీ సభ్యులు అభినం దించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రాన్ని క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ భాగాలుగా విభజించి, దానికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ పనితీరును అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్న ఎంపీలు అలోక్‌శర్మ, కున్వర్‌ సింగ్‌ తన్వర్‌, లవ్లీ ఆనంద్‌, మహిమా కుమారి మేవార్‌, మాలా రాజ్యలక్ష్మిషా, గుమ్మ తనుజా రాణి, హిబి ఎడెన్‌, సంజరు దినాపాటిల్‌, రవీంద్రవైకర్‌, రాజ్యసభ సభ్యులు ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి తదితరులు పాల్గొ న్నారు. అంతకుముందు సీఎం స్టాండింగ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌తో పాటు సభ్యులను ఘనంగా సత్కరించారు. వారికి తెలంగాణ రైజింగ్‌ -2047 విజన్‌ డాక్యుమెంట్‌ను అందజేశారు.

‘క్యూర్‌’లో సర్వీస్‌ సెక్టార్‌
ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఉన్న ఏరియాను ‘క్యూర్‌’గా గుర్తించి, అక్కడ సర్వీస్‌ సెక్టార్‌ను అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) బయట, రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) లోపల ఉన్న ప్రాంతాన్ని ‘ప్యూర్‌’గా గుర్తించి మ్యాన్యుఫాక్చర్‌ సెక్టార్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు బయట ఉన్న ప్రాంతాన్ని ‘రేర్‌’గా గుర్తించి అగ్రికల్చర్‌ సెక్టార్‌గా గుర్తించి, దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్‌-2047 మాస్టర్‌ప్లాన్‌ను ఆవిష్కరించామన్నారు.

మెట్రో రెండోదశను సిఫారసు చేయండి
హైదరాబాద్‌ మెట్రోరైల్‌ (హెచ్‌ఎమ్‌ఆర్‌) రెండోదశ ప్రాజెక్ట్‌ను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సిఫార్సు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హెచ్‌ఎమ్‌ఆర్‌ మొదటి దశ ప్రాజెక్ట్‌ను ఎల్‌ అండ్‌ టీ కంపెనీ నుంచి ప్రభుత్వం టేకోవర్‌ చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో అమృత్‌ సిటీలు, స్మార్ట్‌ సిటీలుగా ఎంపికైన పట్టణాలకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నదనీ, దాన్ని నివారించాలని కోరారు.

‘మూసీ’తో సంస్కృతి అనుసంధానం
మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌కు తెలం గాణ సంస్కృతిని అనుసంధానం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలి పారు. నగరంలో కాలుష్య నియంత్ర ణకు చర్యలు తీసుకుంటున్నామనీ, దానిలో భాగంగా హైదరాబాద్‌లో ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. ‘క్యూర్‌’ పరిధిలో ఆటోలకు ఉచి తంగా రెట్రో ఫిట్టింగ్‌ చేయించి ఎలక్ట్రిక్‌ వాహనా లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణ యించిందన్నారు. ‘క్యూర్‌’ పరిధిని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తూ, హైదరాబాద్‌ నగరాన్ని విస్తరిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -