బాల సాహిత్యాకాశంలో ఉదయ ‘సంధ్య’

బాల సాహిత్యాకాశంలో ఉదయ 'సంధ్య'‘తారంగం.. తారంగం../ చెమ్మచెక్కా ఆడుదాం/ తారంగం.. తారంగం../ చక్కని పాటలు పాడుదాం’ అంటూ చక్కని లయాత్మక ఊనికతో ‘బాల లయలు’ కూర్చిన కవయిత్రి, యువ పరిశోధకురాలు, విమర్శకులు, అనువాదకులు, బాల సాహితీవేత్త, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయిని డా|| వడ్డేపల్లి సంధ్య. విమర్శనా రంగంలో ముందునడుస్తున్న సంధ్య ఇతర రూపాలు, ప్రక్రియల్లోనూ అంతే కృషిచేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో 6 ఏప్రిల్‌, 1982న పుట్టిన సంధ్య ప్రాథమిక, ఉన్నత విద్యను తన స్వగ్రామంలోనే అభ్యసించింది. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌.డి పూర్తి చేసింది. సెట్‌ మరియు యుజిసి నెట్‌ పరీక్షల్లో అర్హత సాధించింది. శ్రీమతి వడ్డేపల్లి అనసూయ- రమేశ్‌ సంధ్య తల్లితండ్రులు. ప్రముఖ కవి డా||వడ్డేపల్లి కృష్ణ సంధ్యకు స్వయాన వీరి తాతయ్యకు తమ్ముడు.

తెలుగు ఉపాధ్యాయినిగా, సాంఘిక సంక్షేమశాఖ గురుకుల డిగ్రీ కళాశాల తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేసిన సంధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యాభైకి పైగా అంతర్జాతీయ, జాతీయ సదస్సుల్లో పాల్గొని పత్రసమర్పణలు చేసింది. దాదాపు అన్ని ప్రధాన సాహిత్య పత్రికల్లో సంధ్య వ్యాసాలు అచ్చయ్యాయి. రచనా రంగంలో దశాబ్ద కాలంగా పనిచేస్తున్న సంధ్య తన తొలి రచనగా తనకు ఇష్టమైన విమర్శ గ్రంథాన్ని ‘యోచన’ పేరుతో తెచ్చింది. అటుతరువాత మరో విమర్శా వ్యాసాల సంపుటి ‘సంహిత’ అచ్చయ్యింది. వివిధ విశ్వవిద్యాలయాల్లో చేసిన ప్రసంగ వ్యాసాల సమాహారం ‘చేతన’ పేరుతో వెలువడనుంది. ఉస్మానియా విశ్వ విద్యాలయం ప్రాచ్య భాషల విభాగంలో డా.సిల్మా నాయక్‌ మార్గదర్శనంలో సంధ్య ‘డా. సినారె సినీ గీతాలు- వస్తు శిల్ప వివేచన’ అంశంగా పిహెచ్‌.డి పూర్తిచేసింది. సినారె గారి సాహిత్యంపై వచ్చిన ఎన్న దగిన పరిశోధనల్లో ఇదొకటి. సంధ్య పుట్టి పెరిగింది చేనేతల ఖిల్లా సిరిసిల్లలో… తన బాల్యం నుండి ఇంట్లో తండ్రి, తాతలు చేస్తున్న ఆ నేత ఆ వృత్తిని చూస్త్తూనే ఎదిగింది. నేపథ్యానికి పద్యాకృతినిచ్చి ఇటీవల సంధ్య ప్రచురించిన నానీల సంపుటి ‘జరీపూల నానీలు’. ఇందులో అనేక అంశాలతో పాటు చేనేతల గురించిన చక్కని, చిక్కని నానీలు ఉన్నాయి. పరిశోధకురాలుగా అనేక సదస్సుల్లో పాల్గొన్న సంధ్య విషయనిపుణులుగా రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ, అజిమ్‌ ప్రేమ్‌జీ యునివర్సిటి, మానేరు రచయితల సంఘం, రంగినేని చారిటబుల్‌ ట్రస్ట్‌ మొదలగు వివిధ సంస్థల కార్యశాలల్లో పాల్గొంది. లేడి లెజండ్‌ అవార్డు, బి.ఎస్‌.రాములు స్ఫూర్తి పురస్కారం, మహతి మహిళాశక్తి పురస్కారం, పెందోట బాల సాహిత్య పురస్కారం, కాళోజి రాష్ట్రస్థాయి పురస్కారం వంటివి అందుకున్న సంధ్య తన తొలి బహుమతిని మహాకవి సినారె చేతులమీదుగా స్వీకరించింది.
పిల్లలతో నిరంతరం గడిపే సంధ్య పిల్లల కోసం కథలు, గేయాలు, తెలుగులో నాన్సెన్స్‌ రైమ్స్‌ ‘బాల లయలు’ రాసింది. హిందీ నుండి తెలుగులోకి పిల్లల కథలను అనువాదం కూడా చేసింది. అచ్చయిన సంధ్య బాల సాహిత్యంలో మొదటిది ‘చిటపట చినుకులు’ బాల గీతాలు. ‘రీడ్‌’ ఇండియాలో భాగంగా పిల్లల కోసం గరిపెల్లి ట్రస్టు ప్రచురించిన ‘చిలుకల దండ’ రచయిత్రుల్లో సంధ్య ఒకరు. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ కోసం సంధ్య అనువదించిన బాలల కథ ‘ఇల్లు కోసం వెతుకులాట’ పేరుతో పుస్తకంగా వచ్చింది. ‘తారంగం.. తారంగం…’ పేరుతో సంధ్య రాసిన బాల లయలు త్వరలో అచ్చుకానున్నాయి. ఇవేకాక తెలుగు బాల సాహిత్యంపైన ఈమె చక్కని విమర్శ, సమీక్షా వ్యాసాలు రాసింది. ‘అమ్మంటే మమకారపు/ మహాకావ్యము/ అంతులేని ప్రేమకు/ ఆలంబనము/ నాన్నంటే దారి చూపు/ దీప స్తంభము’ అని రాసిన సంధ్య, ఒకచోట మన మాతృభాష గురించి ‘అమ్మ చేతి కమ్మనైన/ పాలబువ్వ తెలుగు!/ ఆకుపచ్చ రామచిలుక / పలకరింపు తెలుగు’ అంటుంది. సంధ్య బడి జీవి కదా! అందుకే ‘మన తరగతి గదులు/ అవి తరగని నిధులు’ అని కీర్తిస్తుంది. ఇంకా అక్కడితో ఆగిపోక, ‘రాజైనా పేదైనా/ ఎవరైనా ఒక్కటే!/ డాక్టరైన, యాక్టరైన/ తొలి అడుగు ఇక్కడే!’ అంటుంది. సంధ్యది చక్కని పరిశీలనా తత్వ్తం, దేనినైనా సునిశితంగా అధ్యయనం చేస్తుంది, తరువాత రచనగా మలుస్తుంది. ‘అన్నదాత రైతన్న’, ‘చీమలు’ వంటి గేయాలు అదుకు ఉదాహరణ. ఈమె గేయాలకు లయ తావిలాగా అబ్బి పాడుకునేందుకు సులభంగా ఉంటాయి. ‘ఎవరు నేర్పారు, మీకెవరు నేర్పారు/ ఆటల్లు, పాటల్లు, అందాల మాటలు’, ‘బోసి నవ్వుల మా తాతా/ పిల్లల పాపల మాతాత’ వంటివి ఆ కోవలోని గేయాలు. తను చేసుకునే పండుగలు, పబ్బాలను తన పిల్లల కోసం గేయాలుగా మలిచింది సంధ్య. ‘ఎల్లమ్మకు బోనాలు/ పెద్దమ్మకు బోనాలు…/ ఆషాడం బోనాలు’ గీతం తెలంగాణ విలక్షణ వారత్వ సంపదైన పండుగల గేయం. ‘తెలంగాణ మెంతో/ పులకించే నేడు/ ఊరువాడ ఒక్కటై/ ఆడిపాడె చూడు’ అంటు బతుకమ్మకు బాలల కోసం అక్షరాల బతుకమ్మగా మలిచింది. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాల కలయికగా నిలిచి నేటి యువతరం పరిశోధక, విమర్శకుల్లో ఒకరుగా వెలుగుతున్న డా||వడ్డేపల్లి సంధ్య తెలంగాణ బాల సాహిత్యాకాశంలోనూ నులివెచ్చని గేయకథాకవన కాంతులు ప్రసరిస్తున్న తెలంగాణ బతుకమ్మ! ఉదీయమాన బాలగేయ కర్త! జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548 

Spread the love