గుహలో గొర్రెలు

గుహలో గొర్రెలుడేరాకండ్రిగ గ్రామంలో సుభద్రక్క అనే గొర్రెల కాపరి ఉండేది. రోజూ గొర్రెలను తోలుకుని ఊరి పక్కనే ఉన్న నిశ్శంకుదుర్గం అడవికి వెళ్ళేది. సాయంత్రం దాకా అడవిలోనే ఉండి వాటిని మేపుకుని ఇంటికి తిరిగి వచ్చేది.
ఆమె మందలో రెండు పొగరుబోతు గొర్రెలు ఉండేవి. సుభద్రక్కకి తన దగ్గర ఉండే గొర్రెలన్నిటినీ మేపడం ఒక ఎత్తయితే ఈ రెండింటినీ మేపడం మరో ఎత్తు.
ఓ ఆదివారంనాడు మందతోటి పన్నెండేళ్ళ కొడుకు కుబేరుణ్ణి తీసుకుని అడవికి వెళ్ళింది.
సుభద్రక్క కొన్ని గొర్రెలను మేపుతూ పెద్దగుట్ట మీదకి వెళ్ళింది. కుబేరుడు కూడా కొన్ని గొర్రెలను తోలుకుని చిన్న గుట్టమీదకి వెళ్ళాడు.
సాయంత్రం దాకా బాగా మేపారు. ఇంటికి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. బయలుదేరేముందు గొర్రెలను లెక్కవేసేది సుభద్రక్కకు అలవాటు. అలా లెక్క వేస్తున్నప్పుడు ఆ రెండు పొగరుబోతు గొర్రెలు ఎక్కడికో తప్పించుకుని వెళ్ళినట్లు గుర్తించింది.
ఆ విషయాన్ని కొడుకుతో చెప్పింది. ఇద్దరూ కలిసి వెదికారు. గుట్ట ఎక్కి చూశారు, చెట్టు ఎక్కి చూశారు. ఎక్కడా కనిపించలేదు. అవి నిశ్శంకుదుర్గంలోని గుహల్లో దాక్కొన్నట్లు వారికి అర్థమయ్యింది. గుహల లోపలికి వెళ్ళాలంటే చీకటిగా ఉండటంతో ఇద్దరూ లోపలికి వెళ్ళడానికి సాహసించలేదు.
”కొద్దిసేపైతే చీకటి పడుతుంది. వాటిని వెదికేది చాలా కష్టం. పులో, సింహమో వచ్చి వాటిని తినేసి పోతే ఏమి చేసేదిరా భగవంతుడా!” అని సుభద్రక్క బాధపడింది.
”కష్టాలు కలకాలం ఉంటాయా? సమస్య అన్నాక పరిష్కారం లేకుండా ఉంటుందా?” అని అమ్మకి ధైర్యం చెప్పినాడు కుబేరుడు.
‘గొర్రెలను ఎలా పట్టుకోవాలా?’ అని ఆలోచనలు చేసినాడు. గుహ మొదటికి పోయి అగ్గిపుల్లలు వెలిగించి గొర్రెల కోసం వెదికాడు. అవి అగుపించలేదు. గొర్రెలాగా అరిచినట్లు ‘బ్యా… బ్యా…’ అని అరుస్తూ గుహల చుట్టూ తిరిగాడు. అయినా అవి బయటికి రాలేదు.
బాగా తిరగడంతో అలసిపోయి కొంచెంసేపు పడుకుందామనుకున్నాడు. చెట్టు కింద అమ్మ ఒడిలో పడుకున్నాడు. చల్లటి గాలికి చెట్టు ఆకులు రాలాయి. అప్పుడు తల ఎత్తి చెట్టును చూశాడు. అది అవిశాకు చెట్టు. వెంటనే అతడికి ఓ ఆలోచన వచ్చింది.
‘మన గొర్రెలు తిండికి తిమ్మరాజులు, పనికి పోతురాజులు కదా, వాటికి అవిశాకు అంటే ఇష్టం కదా. ఈ ఆకుల్ని కోసి గుహల ముందర పెడదాం. వాటిని తినడానికైనా అవి బయటికి వస్తాయి’ అని అనుకున్నాడు. అమ్మకు విషయం చెప్పాడు. అమ్మ కూడా ‘సరే’ అంది.
గబగబా చెట్టెక్కి కొమ్మలు విరిచి కింద వేశాడు. వాటిని తీసుకెళ్ళి సుభద్రక్క గుహల ముందు పరచింది.
గుహల్లో దాక్కొని ఉన్న గొర్రెలకు అవిశాకు వాసన తగిలింది. కొంచెంసేపు మేకపోతు గాంభీర్యంతో గమ్మున ఉండిపోయాయి. అయితే ఎక్కువసేపు ఉండలేక ఓ గొర్రె అవిశాకు కోసం బయటికి వచ్చింది. దాని వెనుకే ఇంకో గొర్రె కూడా వచ్చేసింది.
వాటికోసమే ఎదురు చూస్తున్న అమ్మాకొడుకులిద్దరూ లటుక్కున ఆ గొర్రెలను పట్టుకుని మందలోకి చేర్చారు. ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుంది సుభద్రక్క. కొడుకు తెలివికి సంబరపడింది.
చింత చెట్టునుంచి చింత కొమ్మ విరిచి దాంతో వాటిని నాలుగు దెబ్బలేశాడు కుబేరుడు.
ఇద్దరూ మందను తోలుకుంటూ, లేత చింతకాయలు తింటూ ఇంటికి చేరారు.
– ఆర్‌.సి.కృష్ణస్వామిరాజు, 9393662821

Spread the love