పిసినారి నక్క

పిసినారి నక్కఒక అడవిలో ఒక పిసినారి నక్క వుండేది. అది మూటలు మూటలు సంపాదిస్తా వున్నా, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేది కాదు. అర్ధ రూపాయ మిగులుతాది అంటే ఐదు మైళ్ళు అయినా నడుచుకుంటా పోయేరకం. ఒకసారి ఆ నక్క చూసుకోక ఒక అరటిపండు తొక్క మీద కాలేసింది. అంతే… సర్రునజారి కింద పడింది. పడడం పడడం ఒక పెద్ద రాయిమీద పడడంతో కాలు కలుక్కుమంది. పైసలు ఖర్చు పెట్టడం ఇష్టం లేక వేడినీళ్లతో కాపడం పెట్టుకుంది. అమృతాంజనం బాగా పట్టించి దానంతట అదే తగ్గుతుందిలే అనుకొంది. కానీ నొప్పి కొంచెం కూడా తగ్గకపోగా సాయంకాలం అయ్యేసరికి మరింతగా పెరిగి వాపు వచ్చింది. దాంతో నొప్పికి తట్టుకోలేక భయపడి డాక్టర్‌ దగ్గరికి పోయింది.
డాక్టర్‌కు ఆ నక్క పీనాసితనం గురించి బాగా తెలుసు. ఇంతకుముందు కూడా డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా రెండుసార్లు ఎగ్గొట్టింది. దాంతో ”చూడడానికి ఒక వంద రూపాయలు, మందులకు ఒక వంద రూపాయలు… మొత్తం రెండువందల రూపాయలు అక్కడ పెడితే చూస్తాను. లేదంటే లేదు” అని మొగమాటం లేకుండా మొహమ్మీదనే చెప్పాడు. పిసినాసి నక్క ”రెండు వందలా మరీ ఎక్కువ. ఏదో ఇరవై రూపాయలు అయితే ఇస్తాను” అంది.
ఆ మాటలతో డాక్టర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ”ఇరవై రూపాయలకు మందులు కాదు కదా కనీసం ఆ మందులపై ఉన్న కాగితం కూడా రాదు. పో ఇక్కనుంచి. నన్ను విసిగించక” అన్నాడు కోపంగా. డాక్టర్‌ ముందు వరుసగా మందుల సీసాలు ఉన్నాయి. వాటిపై జలుబు మందులు, నొప్పి మందులు, జ్వరం మందులు… ఇలా అవి దేనికి వాడతారో వాటి పేర్లు రాసి వున్నాయి.
దొంగనక్క కన్ను ఆ మందులపై పడింది. అదే సమయంలో ఒక కుందేలు కుంటుకుంటూ డాక్టర్‌ దగ్గరికి వచ్చింది. డాక్టరు వంగి ఆ కుందేలు కాలును చూస్తావుంటే దొంగనక్క ఇదే సందనుకొని లటుక్కున మూత తెరిచి నాలుగు నొప్పి తగ్గే మాత్రలు తీసి జేబులో వేసుకొని ”సరే డాక్టర్‌… ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు. ఇంటికిపోయి తీసుకొని మరలా వస్తా” అంటూ అక్కడి నుంచి సంబరంగా బయటికి వచ్చింది. కానీ నక్క మందులు తీయడం కుందేలు చూసి డాక్టర్‌ కు చెప్పింది. డాక్టర్‌ బయటికి వచ్చి గట్టిగా ఆగమని నక్కను పిలిచాడు. కానీ నక్క వినపడనట్లుగా వెనక్కి తిరిగి చూడకుండా కుంటుకుంటా వేగంగా ఇంటికి వెళ్ళిపోయింది.
ఇంటికి పోయాక ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని సంబరపడుతూ ఒక మాత్ర తీసి వేసుకుంది. అరగంట దాటాక దాని కడుపు గుడగుడగుడ మనసాగింది. గంట దాటేసరికి కడుపులో సునామీలు మొదలయ్యాయి. చెంబు తీసుకొని బయటకురికింది. అరగంటకోసారి ఉరకడం ఉరకడం కాదు. నీరసంతో అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది.
అంతలో కుందేలు అక్కడకు వచ్చింది. ”నక్క మామా… ఆ సీసాలో ఉన్నవి నొప్పి తగ్గే మాత్రలు కాదంట. ఎవరైనా తెలియకుండా దొంగతనం చేస్తే బుద్ధి రావడానికి డాక్టర్‌ అన్ని సీసాలలోనూ బేదులు పెట్టే మాత్రలు వుంచాడంట. జాగ్రత్త. నీకు చెప్పమన్నాడు” అని అసలు విషయం చెప్పి వెళ్ళిపోయింది.
నక్క ఏడుపు మొహంతో బేదులు తగ్గడానికి మెంతులు కొన్ని తిందామని డబ్బా కోసం గూట్లో చేయి పెట్టింది. అక్కడ ఒక తేలు వుంది. అది చేయి పెట్టడం ఆలస్యం టపీమని వేలుమీద ఒక్కటి వేసింది. అంతే చేయి సుర్రుమనేసరికి అదిరిపడి ఎగిరి కిందపడింది. ఒకపక్క చేయి నొప్పి, మరొక పక్క కడుపునొప్పి, ఇంకొకపక్క కాలు నొప్పి… తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటా వుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి ఉరుక్కుంటా పోయి డాక్టర్‌ను పిలుచుకొని వచ్చారు.
డాక్టరు ఆ దొంగనక్కనున చూసి ”చూడు… ఇంత రాత్రిపూట అదీగాక ఇంటికి వచ్చి చూస్తున్నా కాబట్టి నాకు ఐదు వందలు ఫీజు ఇవ్వాలి. అలాగే మూడు నొప్పులు తగ్గడానికి మూడు రకాల మాత్రలకు మరొక ఐదు వందలు. మొత్తం వెయ్యి ఇస్తానంటే వైద్యం మొదలుపెడతా.. లేదంటే లేదు” అంది.
పిసినాసి నక్క ఆలోచిస్తా వుంటే ”దాచిపెట్టాల్సిన చోట దాచిపెట్టాలి. ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చుపెట్టాలి. అంతేగానీ ప్రతిచోటా పిసినాసితనం పనికిరాదు. సచ్చినాక ఈ మూటల్లో ఒక్క రూపాయి గూడా నీ వెంట రాదు. ఇలాగే ఇంకాసేపు వుంటే నొప్పి ఎక్కువై సచ్చినా చస్తావు” అంటూ చుట్టూవున్న జంతువులన్నీ తలా ఇంత గడ్డి పెట్టాయి.
నక్క తన పిసినాసితనానికి సిగ్గుపడుతూ డాక్టర్‌ చేతిలో వెయ్యి రూపాయలు పెట్టింది.
– డా||ఎం.హరికిషన్‌, 94410 32212

Spread the love