సిద్ధిపేట బాల సాహిత్య కారోబార్‌ డబ్బీకార్‌

సిద్ధిపేట బాల సాహిత్య కారోబార్‌ డబ్బీకార్‌యాదృచ్చికమో… వారసత్వమో తెలియదు కానీ, సిద్ధిపేట కమాన్‌ మీది రెపరెపలాడుతున్న జండా మీద బాల సాహిత్య నక్షత్రాల సంఖ్య కోకొల్లలే. అవును నిజం! విద్వత్‌కవి వేముగంటి నుండి నేటి దాకా అనేకమంది ఆ జండాను మోస్తున్నారు. తెలుగు బాల సాహిత్యాకాశంలో వెలుగులు విరజిమ్యుతున్నారు. ఆ వరుసలో మొదట లెక్కించదగినవారిలో ఒకరు డబ్బీకార్‌ సురేందర్‌.
డబ్బీకార్‌ సురేందర్‌ కవి, రచయిత. తెలంగాణ ఉద్యమసమయంలో ముందు నడిచిన కార్యకర్త. ముఖ్యంగా సిద్ధిపేట దీక్షా శిభిరంలో ఈయన లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. సురేందర్‌ నేటి సిద్ధిపేట జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం తోగుటలో ఆగస్టు 10, 1974న పుట్టారు. శ్రీమతి డబ్బీకార్‌ లక్ష్మీబాయి- శ్రీ మల్లోజి వీరి అమ్మానాన్నలు. దశాబ్దాల కాలంగా ప్రైవేటు బడి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ముందుండే డబ్బీకార్‌ తెలంగాణ యువ సాహితీ మండలి వ్యవస్థాప అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మైత్రి మిత్ర మండలి ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. సాహిత్యేతర కార్యక్రమాల విషయంలో తెలంగాణ దీక్షా శిభిరంలో 1531 రోజులు దీక్ష నిర్వహించారు. దాదాపు 5000 ఉత్తరాలు శ్రీకృష్ణ కమిటికి రాయించారు. రోడ్డుమీద కవిసమ్మేళనం నిర్వహించి వాటిని సంకలనంగా తెచ్చారు. కదం కదం, మొలక మండె, మహాదీక్ష, తెలంగాణ ఉద్యమ కెరటాలు సంకలనాలు తెచ్చారు. మెతుకు సీమ, నేలతల్లి వందనం, యిరుసు, సుప్రియాంజలి సంకలనాల్లో వీరి రచనలు చోటుచేసుకున్నాయి.
ఉద్యమకారునిగానే కాక రచయితగా, కవిగా అనేక సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు డబ్బీకార్‌. వాటిలో జాతీయ సాహిత్య పరిషత్‌ పురస్కారం, కిన్నెర బాల నాటక రచయిత పురస్కారం, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, గురజాడ ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా జాతీయ కవి పురస్కారం, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార సభ సత్కారంతో పాటు ఇతర గౌరవ సత్కారాలు వీరు అందుకున్నారు.
ఎన్ని కార్యక్రమాలు, ఉద్యమాల్లో పాల్గొని నిలిచినా డబ్బీకార్‌ సురేందర్‌ ప్రాయికంగా కవి, రచయిత, బాల సాహితీవేత్త. బాలల కోసం గేయాలు రాశారు, నాటికలు రాసి బహుమతులు అందుకున్నారు. ఇతర రూపాలు, ప్రక్రియల్లోనూ బాలల కోసం రచనలు చేశారు. వాటిలో గేయాల శాతం ఎక్కువ. తన చుట్టూ వున్న ప్రతి వస్తువును డబ్బీకార్‌ సురేందర్‌ బాలల కోసం గేయం చేశాడు. ఇవ్వాళ్ల సెల్‌ఫోన్‌ లేని మనిషి, ఇల్లు లేదు. ఒకరకంగా పిల్లలు కూడా సెల్‌ఫోన్‌ వల్ల తమ ఆటపాటల వంటివాటికి దూరం అవుతున్నారు. అటువంటి సెల్‌ ఫోన్‌ను ‘రూపం ఏమో బెత్తెడు/ రూపాయికే పలుకుతావు’ అంటూ అసలు ముచ్చట తేల్చి చెబుతూ ఇంకా, ‘నాన్న జేబులో దాక్కుంటావు/ అన్న చేతిలో అగుపిస్తావు/ ఎక్కడెక్కడికో వెళ్ళిన/ ఎప్పుడు మరువరు నిన్ను’ అంటూ మంచి చెడులూ రెంటినీ ఈ గేయంలో చెబుతాడు సురేందర్‌. మనం చదువుతున్నాం, చూస్తున్నాం.. అమ్మను – నాన్నను. దాదాపు అందరు బాలల రచయితల అక్షరబద్ధం చేస్తూనే ఉన్నారు. డబ్బీకార్‌ కూడా నాన్నను గురించిన చక్కని గేయాన్ని ఈ గేయాల సంపుటిలో రాశారు. ‘నాన్న మనసు వెన్న/ అన్నిటి కన్న మిన్న/ చేయిపట్టి నడిపించు/ తప్పుచేస్తె దండించు/ ఆకలిని చంపుకుని/ ఆశలతొ పెంచుకొను/ కొపమ్మును దిగమింగి’ పెంచుకుంటాడు పిల్లల్ని అంటాడు. ఇంకా తండ్రి గొప్పతనాన్ని ‘రాళ్ళబాట నడిచినా/ పూలబాట పరచును/ బ్రతుకంతా ఒడిసిపట్టి/ ప్రేమంతా పంచిపెట్టు’ అని చెబుతాడు.
పిల్లలకు ఏది చెప్పినా బడి దశలోనే బోధించాలి. అప్పుడే ఆ విషయం వాళ్ళ మనసులపై చక్కగా తిష్టవేసుకు కూర్చుని వారు సక్రమ మార్గంలో నడిచేందుకు ఎంతో దోహదపడుతుంది. పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఉదయం లేచి పండ్లు తోమడం మొదలు అనేక విషయాలు మనం చెబితేనే వాళ్ళకు తెలుస్తాయి. దానినే అంటే బ్రష్‌ చేసుకోవడానిని గురించి కూడా ఒక గేయం రాశాడు కవి. ‘నిగ నిగలాడే నా పండ్లు/ నవ నవలాడే నా మేను/ భల్లున తెల్లవారితే చాలు/ నా చేత చేరితేనే బ్రష్‌/ .. దంతాలు ధగ ధగ మెరిసే/ తలెలన్ని మిలమిల మెరిసె/ బట్టలు తళతళ మెరిసె/ అరోగ్యం అందరికి చేరును’ అంటూ దంతదావనం మొదలుకుని ఇంట్లో అంట్లు తోమే వరకు గేయంలో చెబుతాడు కవి. ఇదే కోవలో ‘పొరల పొరల పొట్టివాడా!/ రోషానికి సోపతిగాడా!/ పట్టుకుంటే జారిపోతావు/ బంతిలాగా పారిపోతావు/ కోసినవారిని ఏడిపిస్తావు’ అని ఉల్లి గురించి రాస్తాడు. ‘చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా’ గేయం మనకు తెలుసు అదే బాణీలో ఆటపాటల గురించి ఆధునికంగా రాస్తాడు బాలల గేయకవి, ఉపాధ్యాయుడు, ఉద్యమకారుడు డబ్బీకార్‌ సురేందర్‌. బాలల కోసం డబ్బీకార్‌ సురెందర్‌ మరింత సృజనచేయాలని కోరుతూ… జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love