‘అయ్యో పాపం’ దగ్గర ఆగిపోడు

He does not stop at 'Oh my God'ఇతరుల దీనస్థితికి తను ‘అయ్యో పాపం’ దగ్గర ఆగిపోడు. చేయూతనందిస్తాడు. తనతోపాటు మరికొందరిని భాగస్వామ్యం చేస్తూ తనే ఒక సంస్థగా మారాడు. కలిసొచ్చిన వాళ్లందర్నీ కలుపుకొని తోడు నీడలేని వారికి అండగా నిలబడ్డారు. వద్ధుల నుండి అనాథ శవాలదాకా, గ్రామంలో మద్యపాన నిషేధం నుండి పేదవిద్యార్థుల చదువుదాకా ‘వివేకానంద ఫౌండేషన్‌’ ద్వారా సేవలందిస్తూ వస్తున్న ‘పాపిజెన్ని రామకష్ణారెడ్డి’తో ఈ వారం ‘జోష్‌’ ముచ్చట…
సంపాదన మొదలు పెట్టాల్సిన వయసులోనే సమాజసేవ కోసం ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
పసితనం నుండే పేదరికంతో సహవాసం చేస్తూ పెరగడం వలన, చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను సమస్య పట్ల తక్షణం స్పందించేలా పురిగొల్పాయి. బాగా సంపాదించాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. పూర్తి సమయం సేవకే కేటాయించాలని ప్రతిక్షణం తపిస్తుంటాను. దాచుకోవడం తెలియదు.. పంచడం మాత్రమే తెలుసు.
కుటుంబ గురించి
మాది బద్వేలు(కడప) తాలుకాలోని తెల్లపాడు (కలసపాడు మం.). నాన్న పాపిజెన్ని యర్రారెడ్డి, అమ్మ మహాలక్ష్మమ్మ, తమ్ముడు శ్రీకాంత్‌ రెడ్డి, చెల్లెలు సుమిత్ర. 2014లో ముత్తుముల రామతులసితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు(వివేకానంద-కుషల్‌). వర్షం వస్తే తప్ప పండని రెండెకరాల పొలం. కరువునేలలో వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకున్న కుటుంబం. నేను ప్రొద్దుటూరులో రైల్వే గేట్‌మెన్‌గా పనిచేస్తున్నాను. ఇది స్థూలంగా నా కుటుంబం.
ఎన్నో మార్గాలు ఉండగా ‘వద్ధులు’, ‘అనాథ శవాల సంస్కారాలు’ మాత్రమే చేయడానికి ప్రత్యేక కారణం?
మానవ జీవితంలోని అన్ని దశలకంటే వద్ధాప్యం క్లిష్టమైనది. శరీరం పట్టు సడలుతుంది. మనసు చంచలమైతుంది. రోగాలతో పోరాటం మొదలవుతుంది. ఈ స్థితిలో నా అన్న వాళ్ళకు భారంగా మారుతారు. అలాంటి పరిస్థితులలో వారికి నేనున్నానని భరోసా ఇస్తే ఇంతకుమించిన సేవ లేదనిపించింది. కొందరు రాజభోగాలు అనుభవించి కాలక్రమంలో కొన్ని కారణాల వలన అనాథలుగా మారతారు. కొందరు జీవితాంతం అనాథలుగానే ఉంటూ మరణిస్తారు. మరణానికి పేద, ధనిక తేడా ఉండదు. వారి గతం ఎలా ఉన్నా మరణించిన వారిని గౌరవంగా, సంప్రదాయబద్దంగా ఖననం చేయాలన్నది నా అభిప్రాయం. ప్రయోజనం ఆశించి చేసేది వ్యాపారం. తప్తి కోసం చేసేది సమాజసేవ. అందుకే ఈ మార్గాలను ఎంచుకొన్నాను. ఇందులో శ్రమ కంటే తప్తే ఎక్కువ.
వివేకానంద పేరు మీదనే సేవాసంస్థ మొదలు పెట్టడం వెనక ఉన్న ప్రత్యేకత?
పోరుమామిళ్ళలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నప్పుడు రిటైర్డ్‌ డి.యం.హెచ్‌.ఓ. డా||మార్కారెడ్డి వివేకానందుని గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన సాహిత్యం చదివేకొద్ది నాలో ఆలోచన విధానం, అలవాట్లు, మారాయి. యువత వల్లనే ఏదైనా సాధ్యం అన్న ఆయన మాటలతో ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలనిపించి ‘వివేకానంద ఫౌండేషన్‌’ పేరుతో ఆయన పుట్టినరోజున (12 జనవరి 2010) నా స్నేహితుల సహకారంతో ప్రారంభించాను. ఆ తరువాత ఆశ్రమాన్ని కూడా ఏర్పాటుచేశాం.
మీ ఆశ్రమం ప్రత్యేకత?
మా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం. అనాథలకు అన్నదానం, వస్త్రదానం, చలికాలం దుప్పట్లు ఇవ్వటం వంటివి చేస్తుంటాం. మురికి బట్టలతో, మాసిన వెంట్రుకలతో ఉన్న అనాథల దగ్గరకు వెళ్ళి క్షౌరము చేసి, మంచిగా తయారు చేసి మళ్ళీ అలానే రోడ్ల మీద వదిలేసేవాళ్ళం. కొన్నాళ్ళకు వాళ్ళు మరణిస్తే మేమే అంత్యక్రియలు చేసేవాళ్ళం. ఒకసారి ఒక అనాథ యువకుడు కాలికి గాయమై పురుగులు పట్టి నరకయాతన అనుభవించాడు. అతనికి దగ్గరగా వెళ్ళి వైద్యం చేయాలన్నా దుర్వాసన వచ్చేది. అప్పుడు నేను నా టీం కలిసి అతనికి సేవ చేశాం. కానీ అతను ఎక్కువ కాలం బతుకలేదు. ఆ క్షణం ఆలోచన మొదలైంది. ఇలాంటి వారికి సరైన వసతి, ఆహారం అందిస్తే జీవితం నిలబెట్టవచ్చని అనుకున్నా. ఆ ఆలోచనను మా పెద్దలకు, కుటుంబ సభ్యులకు, సంస్థ ప్రతినిధులకు తెలియచేయడంతో అంగీకరించారు. కాశినాయన మండలంలోని పిట్టికుంట గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి బోయిళ్ళ విద్యార్థన రెడ్డి ఒక ఎకరా స్థలాన్ని ఓబుళాపురం గ్రామం సమీపంలో గల సగిలేరు నది ఒడ్డున ఇవ్వడంతో ఆశ్రమం నిర్మాణం చేశాం. పట్టణంలో మాదిరిగా ఇరుకుఇరుకుగా కాకుండా పల్లె వాతావరణంలో ప్రశాంతంగా, విశాలమైన గదులతో, మంచానికి పరిమితమైన వారికి ప్రత్యేక వసతులతో ఆశ్రమాన్ని తీర్చిదిద్దాం. పూర్వం ఆశ్రమాలు తలపించేలా ప్రశాంత వాతావరణంలో ఉంది. సేవలు అందిస్తున్నాము.
దాతల సహకారం ఏమైనా ఉందా?
ఏదీ ఒక్కడితోనే కాదు. కేవలం నేనొక వారధిని మాత్రమే. శింగల్‌ రెడ్డి రామకష్ణారెడ్డి, వేచలపు స్వాతి, శిరీషా, రవీంద్రారెడ్డి, నరాల శ్రీనివాసరెడ్డి, ముమ్మటిరెడ్డి, నాగేంద్రరెడ్డి, నరసింహారెడ్డి, కలసపాటి దేవమణి, రఘనాధ్‌ అన్న, దేవసాని శ్రీనివాసరెడ్డి లాంటి పెద్దవాళ్ళ తోపాటు వందలాది మంది దాతలున్నారు. స్థానిక రాజకీయ నాయకుల సహకారం, ప్రోత్సాహం కూడా ఉంది. చప్పట్లే ఒక్క చేతితో సాధ్యం కానప్పుడు… నలుగురికి సాయం చేయడం మాత్రం ఒకరితో ఎలా సాధ్యపడుతుంది?
కుటుంబం నుంచి సహకారం?
ఒక పని చేస్తున్నప్పుడు ప్రోత్సాహం, ఫలించాక ప్రశంస అవసరం. ఈ రెండు మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. కానీ, వాటితోపాటు కనీస కుటుంబ అవసరాలు కూడా తీర్చాలి. లేకపోతే ప్రశంసలు కూడా విసుగ్గా అనిపిస్తాయి. ఈ విషయంలో నేను అదష్టవంతుడిని. నా కుటుంబసభ్యులు కూడా నాలాగే సేవాభావాన్ని కలిగి ఉండడం నా ఆశయానికి మరింత ఊపిరి పోసింది. నా కుటుంబ అవసరాలు తీర్చడానికి నా ఉద్యోగం (రైల్వే డిపార్ట్మెంట్‌) తోడుగా ఉంది.
మీ ఫౌండేషన్‌ సేవలకు అర్హులైన వారెవరు? మిమ్మల్ని ఎలా సంప్రదించాలి?
మా సంస్థద్వారా ఎక్కడ ఏ అవసరం ఉందో మా శక్తి మేరకు సహాయం అందిస్తున్నాం. పేద విద్యార్థులకు, నిరుపేదలకు చేయూతను ఇవ్వటం కూడా జరుగుతుంది. మా సేవాశ్రమంలో చేరాలంటే ఆదరణలేక, నిరాదరణకు గురైనవారు, ఆస్తులు ఏమి లేకుండా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. 8897292237, 9346850854 నెంబర్ల ద్వారాగానీ, వెబ్‌ సైట్‌(vivekanandasevasramam.org)) ని సంప్రదించవచ్చు.
ఆశ్రమ నిర్వహణలో మీ భార్య సహాకారం?
తను ఫౌండేషన్‌లో ఒక వాలంటీర్‌గా సేవలందించేది. నా భావాలకు, నా ఆశయాలకు తగ్గిన వ్యక్తి, నా బాటలో నడిచే వ్యక్తి అయితే పెండ్లి చేసుకోవాలనుకున్నా. మా బంధువుల అమ్మాయి రామతులసితో నాకు పరిచయం ఏర్పడింది. తనకు నా విధానాలు, ఆశయాలు చెప్పాను. ‘మంచే చేస్తున్నావు’ నీ వెనుక నేను నిలబడతానని నా చేయి అందుకుంది.
ఊర్లో బెల్టు, నాటుసారాయి పై పోరాటం?
మా ఊరులో నాటుసారా తయారు చేసేవారు. బయట ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం గానీ సొంత ఊరిలో తాగుడుకు బానిసై జీవితాలు విచ్ఛిన్నం కావడం కలచివేసింది. 20 మంది యువకులు ఉద్యమానికి సిద్ధమై నాతో నడిచారు. అప్పటి మా ఎస్‌ఐ రాజారెడ్డి సహకారంతో సరిగ్గా సంక్రాంతి పండుగ రోజున నాటుసారా, బెల్టుషాపులపై ఉద్యమం మొదలుపెట్టాం. ఈ ఉదంతంలో మాకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకే అడుగులేశాం. ఈ విషయంలో ప్రింట్‌ మీడియా, పోలీస్‌ శాఖ మా వెనంటి ఉండి నడిపించటం వల్ల సంపూర్ణ మద్యపాననిషేధం చేయగలిగాం.
మీ ఫౌండేషన్‌ నుంచి మునుముందు ఏ కార్యక్రమాలు ఉండవచ్చు?
‘వివేకానంద సేవాశ్రమం’ ముఖ్య ఉద్దేశ్యం ఎవరూలేని వారికి అండగా నిలవటం. దాదాపు 50 మందికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసుకున్నాం. అమ్మానాన్నలులేని పిల్లలను, నిరుపేద విద్యార్థులను చదివించాలనుకుంటున్నాం. మా సమీపంలో ఉన్న యానాది కాలనీల్లోని అడవి బిడ్డలకు అవసరమైన నిత్యావసర సరుకులు, వారికి అవసరమైన సహాయం చేస్తున్నాం. దీన్ని మరికొన్ని ప్రాంతాలకు విస్తరింపచేయాలని ఉంది. అటువైపుగా ప్రణాళికలు, వనరులను సిద్ధం చేసుకొంటున్నాం. మా సేవలను వీలైనంతవరకు విస్తరణ చేయడమే ముఖ్య లక్ష్యం.
– మహేష్‌ బోగిని,
89852 02723
హైదరాబాద్‌, విశ్వవిద్యాలయం, 

Spread the love