సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించండి

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌ వెస్లీ రాగన్నగూడలోని పార్టీ కార్యాలయంలో సుందరయ్య వర్థంతి
నవతెలంగాణ-తుర్కయాంజల్‌
సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిం చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌ వెస్లీ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) పార్టీ ఉద్యమ నిర్మాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరాడంబర జీవి కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతి సభ తుర్కయంజాల్‌ మున్సిపాలిటీలోని రాగన్నగూడలోనీ పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా జాన్‌ వెస్లీ హాజరై సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ ప్రజా శ్రేయస్సు కో సం, సమసమాజ స్థాపన కోసం, అసమానతలు అంటరా నితనానికి వ్యతిరేకంగా కుల వివక్షత వ్యతిరేక పోరాటా లను తన ఇంటి నుండి ప్రారంభించారని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే చదువును కూడా త్యాగం చేసి స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన గొప్ప దేశభక్తుడని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి నైజాం రజాకారులను తరిమికొట్టిన గొప్ప దీషాలి అని కొనియాడారు. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు గానీ పార్లమెంటుకు గాని ఎన్నికైన సందర్భంగా తన వాక్చాతుర్యంతో ప్రజా సమస్య లపై పాలకవర్గాలను నిలదీసి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు చట్టసభల్లో పోరాటం చేసిన మహానేత సుందరయ్య అని అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా.. శాసనసభలో నికార్సైన ప్రతిపక్ష నేతగా ప్రజా గొంతుకగా సుందరయ్య నిలిచారని అన్నారు. నేడు పార్లమెంట్లో గాని శాసనసభల్లో గాని ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రజా నాయకులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల సాధన కోసం ప్రజలు తిరుగుబాటుకు సిద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో గుడిసెల పోరాటం చేయబోతున్నామని, అందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం111 జీఓ ఎత్తివేసి రంగారెడ్డి జిల్లాలో పెద్దఎత్తున ప్రభుత్వ భూములను సేకరిస్తున్నదని, ఇదే అదనుగా అందరూ భూపోరాటానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు పగడాల యాదయ్య, తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ కన్వీనర్‌ డి.కిషన్‌, నాయకులు ఏం. సత్యనారాయణ, పెంటయ్య, ప్రకాష్‌ కారత్‌, కొండిగారి శంకర్‌, ఐ.కృష్ణ, కే.శారద, బి.శంకరయ్య, జే. ఆశీర్వాదం, శివప్రసాద్‌, మాల్యాద్రి, డి.శ్రీధర్‌, రత్నమ్మ, కల్పన, యాదయ్య, అంజిసాయి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love