ఇంటింటికి బడి బాట ఎంపీపీ పాల్త్య విఠల్..

నవతెలంగాణ – నసూరుల్లాబాద్
బడిబాట కార్యక్రమంలో భాగంగా నసురుల్లాబాద్ మండలంలోని సంగెం, కంశేట్ పల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరారు. ఈ సందర్భంగా సంగెం గ్రామంలో ఉపాధ్యాయులతో కలసి ఎంపిపి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య, భోజనం, అనుభవం గల ఉపాధ్యాయులు ఉంటారని తల్లిదండ్రులకు వివరించారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రక్రియకు సంబంధించి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామన్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యాబోధన జరిగేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఊతమిచ్చేలా ప్రోత్సహిస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా వారిని అవగాహన కల్పించాలన్నారు. మనఊరు-మనబడి మొదటి విడుతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యుదీకరణ, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం, మరమ్మతులు, శిథిలావస్థలో ఉన్న వాటిలో నూతన గదులు, డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్ల నిర్మాణం, వంట గదులు, ప్రహారీలు నిర్మించడం ద్వారా పూర్తిస్థాయిలో పాఠశాల అభివృద్ధి వైపు దృష్టి సారిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని ఎంపిపి తెలిపారు.

Spread the love