Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోషల్ మీడియాలో రిల్స్ తో పేరుతో మునుగోడును బ్రష్టు పట్టిస్తున్నారు

సోషల్ మీడియాలో రిల్స్ తో పేరుతో మునుగోడును బ్రష్టు పట్టిస్తున్నారు

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్ 
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదని, ప్రాంత సమస్యలపై అతనికి ఎలాంటి అవగాహన లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పనిచేయకుండా సోషల్ మీడియాలో రీల్స్‌పై మాత్రమే దృష్టి పెట్టుతున్నారని విమర్శించారు. “రీల్స్‌తో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమా?” అని ప్రశ్నించారు. నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కెసిఆర్ నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు.

మిషన్ భగీరథ ద్వారా చౌటుప్పల్‌లో త్రాగునీటి సమస్యను పరిష్కరించి ఫ్లోరోసిస్‌ను తగ్గించానని చెప్పారు. అలాగే సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, వంద పడకల ఆసుపత్రి వంటి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని వివరించారు. ఫ్లైఓవర్ నిర్మాణంపై మాట్లాడుతున్న ఎమ్మెల్యేకు పూర్తి అవగాహన లేదని, ఏడాది నుంచి పనులు నిలిచిపోయినా పట్టించుకోలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ మిత్రపక్షం సీపీఐ(ఎం) పార్టీతో ధర్నాలు నిర్వహించి, అధికారులను కలిసినట్లు తెలిపారు. బస్‌స్టేషన్ వద్ద అండర్‌పాస్ ఏర్పాటు చేయడానికి అధికారులు సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు.

నేను ఉపఎన్నికల్లో గెలిచిన తర్వాత తీసుకొచ్చిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ చేసిన పనులు ఏమిటో చెప్పాలని సవాలు విసిరారు.“నీకు వంద మంది అవసరం లేదు, నేను ఒక్కడినే చాలు, మళ్లీ రాజీనామా చేసి ఎన్నికలకు రా, ఎవరు గెలుస్తారో చూద్దాం” అని ఆయన సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల సమయంలో చేసిన హామీలను గుర్తు చేస్తూ,ఆ హామీలను అమలు చేయకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిందలు వేయడం సరైంది కాదన్నారు. అధికారులతో రోడ్డు పనులపై సమీక్షలు నిర్వహించారా అని ప్రశ్నించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా దర్గాకు ఒక కోటి రూపాయలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. వృద్ధాశ్రమ నిర్మాణం ఇతర ప్రాంతాల్లో చేయగలిగిన ఎమ్మెల్యే, మునుగోడులో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అభివృద్ధి వ్యక్తిగత నిధులతో కాదు, ప్రభుత్వ నిధులు తెచ్చి చేయాలని సూచించారు.

రైతుల సమస్యలపై కూడా ఎమ్మెల్యే స్పందించడం లేదని విమర్శించారు. యూరియా కొరత, రైతు బంధు, రైతు భరోసా, కళ్యాణలక్ష్మి పథకాలు సరిగా అమలు కావడం లేదని అన్నారు. డిండి ప్రాజెక్ట్ ద్వారా నీరు రాకపోవడం, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు 10 కిలోలు తరుగు పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పెన్షన్‌లపై కూడా ఎమ్మెల్యే స్పందించడం లేదని, ప్రజా సమస్యలపై తాను మాట్లాడితే బెదిరింపులు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగం వదిలి వచ్చానని, కాంట్రాక్ట్ పనుల కోసం రాజకీయాలు చేయలేదని తెలిపారు. ఎంపీగా గెలిచిన మీ అన్న వెంకట్ రెడ్డి ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి లను ఇప్పటివరకు ఒక్కసారైనా  గెలిచినప్పటి నుంచి నియోజకవర్గానికి తీసుకో రాలేదని కూసుకుంట్ల విమర్శించారు.

కేంద్ర పరిధిలో ఉన్న ఫ్లైఓవర్ పనులపై ఎంపీని జోక్యం చేయించడంలో రాజగోపాల్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, బీఆర్‌ఎస్ పార్టీ తన వెనుక బలంగా ఉందని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈయనకు మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘాటైన సమాధానమే చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ గౌడ్,  సింగిల్ విండో మాజీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పెద్దింటి బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మున్నా మహేష్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -