నా కల కూడా నిజమైంది

చిరంజీవి తాజాగా నటిస్తున్న మాస్‌-యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానిన రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మణిశర్మ వారసుడు మహతీ స్వరసాగర్‌ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చారు.
ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,
‘చిరంజీవి సినిమా అంటేనే ఎవరెస్ట్‌ను భుజాలపై మోసినట్లు ఉంటుంది. ప్రతీదీ కేర్‌ తీసుకోవాలి. చిరంజీవితో సినిమా అనగానే ఫస్ట్‌ షాక్‌ అయ్యాను. షాక్‌తోపాటు నా కల కూడా నిజమైంది. సంగీతం విషయంలో నాన్న నుంచి సూచనలు సహజంగా నేను ఏ సినిమాకు తీసుకోలేదు. కానీ ఈ సినిమాకు తప్పలేదు.
ఇంతకుముందు కళ్యాణ్‌మాలిక్‌, కిరణ్‌ దగ్గర కీబోర్డ్‌ ప్లేయర్‌గా పనిచేశాను. నాన్న దగ్గరకూడా పనిచేశాను. వారి ప్రభావం బాగా నాపై ఉంది. నాకంటూ ఒక స్టయిల్‌ నిరూపించుకోవాలని చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఇక చిరంజీవి పాటలంటే కొని లిమిటేషన్స్‌ ఉంటాయి. డాన్స్‌ మూవ్‌మెంట్‌ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ‘వేదాళం’ సినిమా చూశా. అందులో అనిల్‌ ఇచ్చిన సంగీతం సూపర్‌గా ఉంది. దాన్నుంచి నేను చిరంజీవికి ఏమి చేయగలను అనే దానిపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టాను. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా ఇచ్చాను.
అలాగే చిరంజీవి ఇంట్రడక్షన్‌ కోసం రాప్‌ థీమ్‌ తీసుకున్నాను. అది ఇంకా రిలీజ్‌ కాలేదు. మోడ్రన్‌ సౌండ్‌తో తీసుకునే ప్రయత్నం చేశాను. ఈ సినిమా ట్రావెల్‌లో చిరంజీవి చాలా ఐడియాలు ఇచ్చారు. ఇందులో జామ్‌ జామ్‌ జజ్జెనక.. మిల్కీబ్యూటీ పాటలు ఆయనకు బాగా నచ్చాయి. మంచి మ్యూజిక్‌ ఇచ్చావ్‌ అంటూ ఆయన ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది.
చిరంజీవి సినిమా చేయటమే పెద్ద ఎచీవ్‌మెంట్‌. అలాంటిది ఆయన అప్రిషియేట్‌ చేయటం నాపై మరింత బాధ్యత పెంచింది. ఈ సినిమాతో నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నారా రోహిత్‌ ‘ప్రతినిధి 2′, గోపీచంద్‌తో ఓ సినిమా, అలాగే నా స్నేహితుడు దర్శకుడిగా మరో సినిమా చేస్తున్నాను’ అని తెలిపారు.

Spread the love