సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన ఆఖరి సినిమా ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’ చిత్ర ట్రైలర్‌ను గురువారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. అంబ మూవీ పతాకంపై కన్నడ దర్శకుడు హెచ్ మధుసూదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీపాద్ హంచాటే నిర్మాత. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు, టి.రామసత్య నారాయణ, లయన్ సాయి వెంకట్, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు హెచ్ మధుసూదన్ మాట్లాడుతూ, ‘వంశం’సినిమా దర్శకుడిగా నా తొలి సినిమా. ఆ చిత్రానికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఈ క్రమంలో శ్రీపాద్ హంచాటే పిలిచి కష్ణ గారితో సినిమా చేద్దామన్నారు. 2007లో సినిమా పూర్తయింది. విడుదల కోసం ఎంతో వెయిట్ చేశాను. అయినా రిలీజ్ కాలేదు. ఈలోపు నేను కన్నడలో చాలా పిక్చర్స్ డైరక్ట్ చేశాను. అయితే కృష్ణ గారి సినిమా ఎలాగైనా రిలీజ్ చేయాలని, మా నిర్మాత దగ్గర నుంచి తీసుకొని సరికొత్త హంగులతో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా మార్చి నేనే ఈనెలలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నా.కృష్ణ అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా’ అని తెలిపారు. యశ్వంత్, సుహాసిని జంటగా నటించిన ఈ చిత్రంలో నాగబాబు, అలీ, ఎమ్మెస్ నారాయణ కీలక పాత్రలు పోషించారు.