నిరుపేదల నేస్తం నర్రా సుఖేందర్‌ రెడ్డి

రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. అయ్యతో కలిసి మేకలు కాసేటోడు. అంతలోనే తండ్రి మరణంతో దుర్భర జీవితం. తల్లి కూలికెళ్తెనే అన్నం. బడిలో ఇచ్చే మూడు కిలోల బియ్యం కోసం ఎనిమిదేండ్ల వయసులో తొలిసారి బడి బాట పట్టిండు. ఆ బియ్యం కడుపు నింపితే… బడిలో నేర్పిన అక్షరం నేడు బతుకు నింపుతోంది. సమాజాభివద్ధికి అత్యంత కీలకమైనవి విద్య, వైద్యం. చదువుకోవడానికి తాను పడ్డ కష్టం మరొకరు పడకూడదని, చదవాలన్న ఆసక్తి ఉండి ఆర్థిక స్తోమత లేని వారికి ఇప్పుడు అతడు ఓ చేయూత.. ఆసుపత్రి పెట్టి ఎందరో నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నాడు. మరెందరికో ఉపాధి మార్గమవుతున్నాడు. మరికొందరికి తానే ఉపాధి అవుతున్నాడు. సమాజానికి ఉపయోగ పడితేనే తన చదువుకు సార్ధకత అంటున్న వట్టిమర్తి యువకుడు నర్రా సుఖేందర్‌ రెడ్డి పరిచయం అతని మాటల్లోనే..
మాది నల్గొండ జిల్లా వట్టిమర్తి. అమ్మ సుజాత, నాయన రామిరెడ్డి, నేను… ఇదే నా కుటుంబం. ఒకే ఒక్క గది ఉన్న రెకులిల్లు… అలుకు నేల. కరెంట్‌ కూడా లేదు. మాతో పాటు మా మేకల మంద కూడా ఆ గదిలోనే ఉండేవి. నాయనతో పాటు నేను కూడా మేకలు కాసేటోడ్ని. ఎనిమిదేండ్లు వచ్చే వరకు బడి అంటే ఎరుగను. అప్పుడు మా ఊళ్లో అనంతరెడ్డి అనే ఉపాధ్యాయుడు రోజు మేకల మందును అదిలిస్తూ తిరిగే నన్ను చూసి… చదువు విలువ చెప్పి ప్రభుత్వ పాఠశాలకు పంపారు. అప్పట్లో బడికి పోయె పిల్లలకు మూడు కిలోలు బియ్యం ఇచ్చేటోళ్లు. ఆ బియ్యం మా కుటుంబం ఆకలి తీర్చేవంటే ఎవరూ నమ్మరు. కానీ, అదే వాస్తవం. కరెంట్‌ కూడా లేకపోవడంతో వీధి దీపాల వెలుగులో చదువుకున్నాను. ఐదో తరగతి సర్వేల్‌ గురుకుల పాఠశాలలో సీటు వచ్చింది. అక్కడ 7వ తరగతిలో 551 మార్కులు తెచ్చుకొని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాను. అక్కడ ఉపాధ్యాయులు అందించిన సహకారం మరువలేనిది. అక్కడే క్రీడల్లో శిక్షణ ఇచ్చారు. ఎన్‌.సీ.సీ క్యాండిడేట్‌గా మంచి గుర్తింపు వచ్చింది. జాతీయ స్థాయిలో 100 మీ. అథ్లెటిక్స్‌ ప్రథమ స్థానం. టెన్నికాయిట్‌ లో నేషనల్‌ లెవెల్‌లో గోల్డ్‌ మెడల్‌ సంపాదించుకున్న. అదే సమయంలో చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. మరింత పట్టుదల పెరిగింది. దానితో పదో తరగతిలో కూడా 557 మార్కులతో ప్రభుత్వ గురుకుల పాఠశాల నుంచి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించాను. మంచి మార్కులు రావడంతో నల్గొండలో ఉన్న గౌతమి జూనియర్‌ కళాశాల నాకు ఇంటర్మీడియట్‌కు ఫ్రీ ఎడ్యుకేషన్‌ ఇచ్చారు. ఇంటర్‌లో కూడా మంచి మార్కులు రావడంతో పాటు, ఎంసెట్‌లో కూడా మంచి ర్యాంకు వచ్చింది. బిటెక్‌, ఎంటెక్‌ కూడా ఎలాంటి ఆర్థిక భారం పడకుండా పూర్తి చేశాను. హైదరాబాద్‌లో చదువుకుంటూనే అమీర్‌పేట, మైత్రీవనం, ఎస్‌.ఆర్‌.నగర్‌ కోచింగ్‌ సెంటర్ల దగ్గర కరపత్రాలు పంచే వాణ్ని. దీనితో పాటు ట్యూషన్స్‌ చెప్పడం, చిన్న చిన్న జాబ్స్‌ చేసుకుంటూ నా కాళ్ళపై నిలబడ్డాను. నేను ఏడో తరగతిలో ఉండగానే నాన్న అకాలమరణం చెందడంతో అమ్మపై కుటుంబ భారం పడింది. నేను హాస్టల్‌లో ఉండి చదువుకున్నా, అమ్మ కూలీకి వెళ్లక తప్పని పరిస్థితి. అలా ఆమె జీవితం ఆమె బతికింది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి నా జీవితమే ఒక ఉదాహరణ. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే నేను… ఆ చదువునే ఆయుధంగా చేసుకుని సమాజంలో అల్లుకున్న చీకట్లను చీల్చుకుంటూ విద్యా వంతులను సమాజానికి అందించాలన్న సంకల్పంతో ముందుకు అడుగేశాను. ఎంటెక్‌ పూర్తిచేసి ఎవీసీఆర్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా జాయిన్‌ అయ్యాను. అలా నేను సంపాదించిన ప్రతి రూపాయిలో సగం విద్య, వైద్యంకు ఖర్చు పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ ప్రకారమే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకున్నాను.
కొత్త ఉషస్సు
చదువుకుంటూనే పిల్లలకు ట్యూషన్లు చెప్పడం, కరపత్రాలు పంచడం చేస్తూ నా ఖర్చులు నేనే సంపాదించుకున్న. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మరొకరి చదవుకు సహాయం చేసేవాణ్ణి. అక్కడ ఉద్యోగం చేస్తూనే పసిఫిక్‌ సొల్యూషన్స్‌ అనే చిన్న కోచింగ్‌ సెంటర్‌ పెట్టుకున్నా… అతి తక్కువ ఫీజు తీసుకుని కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ కోర్సు, సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చే వాణ్ణి. ఒక్కొక్క బ్యాచ్‌లో 150 మందికి పైగా విద్యార్థులుండేవారు. క్రమంగా కోచింగ్‌ సెంటర్‌కు ఆదరణ పెరిగింది. విద్యార్థులు దాదాపు 300 మంది అయ్యారు. దానితో ఉద్యోగం వదిలేసి ఇదే సెంటర్‌ను కొంతకాలం నడిపాను. 2016లో బిజినెస్‌ చేయాలన్న ఆలోచన వచ్చింది. నేను కూడబెట్టుకున్న సొమ్ముతో పాటు బ్యాంకు లోను తీసుకుని బిజినెస్‌ ప్రారంభించాను.
బిజినెస్‌ మ్యాన్‌
బిజినెస్‌ ప్రారంభించాలని ఆలోచనైతే ఉంది కానీ, ఏం చేయాలి? ఎలా చేయాలన్న సందేహాలు వెంటాడేవి. ఆ సమయంలో తరుణి సూపర్‌ మార్కెట్‌ అధినేత శాస్త్రిగారు సూపర్‌ మార్కెట్‌ పెట్టమని సలహా ఇచ్చారు. ఆయన సూచనల మేరకు ఈ బిజినెస్‌ ప్రారంభించాను. ఆయన నన్ను చాలా గైడ్‌ చేశారు. అలా 2016లో చర్లపల్లిలో సూపర్‌ మార్కెట్‌ ప్రారంభించాను. దాని ద్వారా పది మందికి ఉపాధి కల్పిస్తున్నాను. అక్కడితోనే సంతప్తి పడలేదు. యువకులుగా ఉన్నప్పుడే ఏదైనా చేయగలమని నా విశ్వాసం. అందుకే ఈ ఒక్క బ్రాంచ్‌తో సంతప్తి పడలేదు. ఆ తర్వాత మౌలాలి, సీతాఫల్‌మండిలలో మరో రెండు బ్రాంచీలు ప్రారంభించాను. మంచి నాణ్యమైన సరుకులు అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతున్నాం. ఈ మూడు బ్రాంచ్‌ లలో దాదాపు ముఫ్పై మంది పని చేస్తున్నారు. నాచారంలో రిషిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ పెట్టి నిరుపేదలకు రాయితీ ఇస్తూ వైద్యం అందిస్తున్నాం.
సేవా కార్యక్రమాలు
నడిచి వచ్చిన దారి మర్చిపోకూడదు అన్నది ఫిలాసఫీ. జీవితంలో ఉన్నతంగా ఎదగడమంటే మన వల్ల మరో పది మందికి మేలు చేయడమే. అలా చేయలేనప్పుడు మనసు ఉన్నతంగా లేనట్లే. అందుకే మా నాన్న పేరు మీద నర్రా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాను. పేద విద్యార్థులకు చదువుకు కావాల్సిన సహాయసహకారాలు అందిస్తున్నాను. ప్రతియేటా దాదాపు మూడు లక్షల రూపాయలు ఇలా ఫీజులు కట్టడానికి ఉపయోగిస్తాం. దానితో పాటు పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, ఇతర అవసరాలు తీరుస్తున్నాం. కరోనా సమయంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశాం. ఆ సమయంలో పోలీసులకు కూడా వాటర్‌ సప్లరు చేశాం. మాస్కులు, శానిటైజర్లు పంపిణి చేశాం. మెడికల్‌ క్యాంపులు పెట్టి పేదలకు ఉచిత వైద్యం, మందులు అందజేస్తున్నాం.
కష్ణానగర్‌ కాలనీ ప్రెసిడెంట్‌గా
కష్ణానగర్‌ కాలనీ ప్రెసిడెంట్‌గా 2019లో ఎన్నికయ్యాను. నాటి నుంచి నేటి వరకు స్థానిక శాసన సభ్యులు భేతి సుభాష్‌ రెడ్డి సహకారంతో అనేక అభివద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. కాలనీని ఒక రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు నా శాయశక్తులా కషి చేస్తున్నాను. వరదల సమయంలో కాలనీలోని పేదలకు సరుకులు పంపిణీ చేశాం.
ఆసుపత్రి
నా జీవిత భాగస్వామి రిషిత పేరుతో 2019లో నాచారంలో 25 బెడ్స్‌తో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ కట్టించాను. అందులో 13 మంది డాక్టర్లు వైద్యసేవలు అందిస్తున్నారు. మరో ఇరవైఐదు మంది స్టాఫ్‌ పని చేస్తున్నారు. అందులో పేదలకు వైద్యంతో పాటు, మందులు కూడా రాయితీ ఇస్తున్నాం. మా హాస్పటల్‌లో డెలివరీ అయి ఆడపిల్ల పుడితే వారికి 50 శాతం ఫీజు మాత్రమే తీసుకుంటాం. ఈ హాస్పటల్‌ నిర్వహణ మొత్తం మా శ్రీమతి రిషితానే చూసుకుంటారు.

కుటుంబం
2015లో రిషితతో వివాహం జరిగింది. మేమే ఒకరిని ఒకరం ఇష్టపడ్డాం. పెద్దలకు చెప్పి అందరి అంగీకారంతో పెండ్లి చేసుకున్నాం. తాను నా జీవితంలోకి రావడం నిజంగా నా అదష్టం. నన్నే కాదు.. నా ఆశయాలను కూడా ఆమె ప్రేమిస్తోంది. వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సలహాలు సూచనలు ఇస్తూ, నాతో పాటు కలిసి నడుస్తోంది. మాకు ఇద్దరు పిల్లలు హిమాన్షు సుహన్షు. వాళ్లిద్దరి బాధ్యత కూడా ఆమె చూసుకుంటుంది.
అమ్మ
చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో నాకు అమ్మ… అమ్మకు నేనుగానే బతికాం. తాను విస్తా అనే కంపెనీలో కూలీ పని చేసేది. జీవితాంతం తాను సంపాదించుకొని బతికిందే తప్ప ఎవరిపైనా ఆధారపడింది లేదు. చివరి వరకు ఒకరికి భారం కాకుండానే గతేడాది డిసెంబర్‌లో మాకు దూరమైంది. నా భార్య కూడా అమ్మను అమితంగా ప్రేమించేది. ఆమె మరణం మా కుటుంబానికి పెద్ద లోటు. నేడు నేనే ఒకరికి పెట్టే స్థితిలో ఉండటం చూసి అమ్మ చాలా సంతోషపడుతుండేది.
– మోహన్‌

Spread the love