మనసులు గెలవాలి

మనసులో పొంగే పవిత్ర భావం ప్రేమ, పెద్దలను ఒప్పించే ధైర్యం లేక విలువల బంధంలో ఓడిపోతుంది. ప్రేమిస్తే చావేనా..? అనే తరహాలో ఈ మధ్య పరిస్థితులు కలవరపరుస్తున్నాయి. ఓవైపు చాలా మంది ప్రేమికులు జీవితంలో ఒక్కటై ప్రేమైక జీవనాన్ని అందుకుంటుంటే.. ఇంకొందరు. తమ ఇష్టాన్ని చిన్న చిన్న కష్టాలు దాటి గెలువలేక. కోరి తనువు చాలిస్తున్నారు. ప్రేమ బంధంలో తమ విలువను తెలియజెప్పేలా వికత చేష్టలకు పాల్పడుతున్నారు. అనాలోచితంగా, ఆవేశపూరితంగా తీసుకుంటున్న నిర్ణయాలతో కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. ప్రేమ పెండ్లీలపై విస్పష్టమైన అవగాహనలేని వయసులోనే దాని వెంట పరుగులు పెడుతూ బంగారుమయ జీవితాల్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. పరిణితి లోపించిన మనసుతో వీరు తీసుకునే నిర్ణయాలు అటు వ్యక్తిగత జీవితానికి కుటుంబాలకు దూరమయ్యే దుస్థితిని కల్పిస్తున్నాయి. యువత దక్పథంలో రావాల్సిన మార్పులు.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల తీరుపై నవతెలంగాణ జోష్‌ కధనం.
ఆందోళనకరమే..

ప్రేమ పండితే మంచిదే. వికటిస్తే జీవితాలను ముంచేస్తుంది. చదువు, ఉపాధి, ఉద్యోగంలో స్థిరపడ్డాక అనుభవించేది అసలైన లవ్వంటే నమ్మాల్సిందే. రెండు దశాబ్దాల కిందట అరుదైన సంఘటనలుగా కనిపించిన ప్రేమ వివాహాలు ఇప్పుడు నిత్యకత్యాలుగా మారుతున్నాయి. ఇదే స్థాయిలో అఘాయిత్యాల పరంపర పెరుగు తుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన రెండేళ్లుగా అనేక ప్రేమజంటలు ఆత్మ హత్యలకు పాల్పడటం పరిస్థితి తీవ్రత తెలియజేస్తోంది.
ఓ యువకుడు వీడియోకాల్లో తాను ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కలత చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకరినొకరు ప్రేమించుకున్న ఈ ప్రేమికులు తమ పెండ్లికి పెద్దల అంగీకారం ఉండటం లేదనే సాకుతో ఒకరి తరువాత ఒకరు ప్రాణాల్ని వదలడం వారి కుటుంబాల్లో తీరని బాధనే మిగిల్చింది. లోకం పోకడ తెలుసుకునే వయస్సులోనే నిండు నూరేళ్లను నింపుకొన్నారు.
తల్లిదండ్రుల బాధ్యత ఇలా..
యుక్త వయస్సుకు వస్తున్న పిల్లల మనస్తత్వాలపై కన్నేసి ఉంచాలి. ప్రేమ పేరుతో ఉజ్వల భవిష్యత్తు పెడదారి పడుతున్న తీరుపై అవగాహన కల్పించాలి. స్నేహితుల ప్రభావం కారణంగా పెడదారులు పట్టే అవకాశం కౌమారదశలో ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి స్నేహతులతో మాట్లాడుతున్నారనే విషయమై గమనించాలి. ఉద్రేకంలో తీసుకున్న నిర్ణయాలతో ఎదురయ్యే ఇక్కట్లను గుర్తెరిగేలా పిల్లలకు మంచి మాటలు చెప్పి భవిష్యత్తులో స్థిరపడేలా లక్ష్యాల్ని నిర్దేశించాలి.
ధైర్యంగా నిలబడాలి
మానసిక పరిపక్వత లోపం వల్లనే ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రేమించిన వ్యక్తి దొరకాలనే భావోద్వేగంలో విపరీతమైన నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. ప్రేమను గెలిపించుకునేలా ధైర్యం ఉండాలి. ఇన్నాళ్లు నీ ఎదుగుదలకు తోడ్పడిన కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా నీ ప్రేమ నిలబడాలి.

Spread the love