తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు..

– సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో భాగంగా ఇటీవల ప్రకటించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం హర్షణీయమని తెలిపారు. విలక్షణమైన రీతిలో తన అత్యుత్తమ నటన ద్వారా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 69 ఏండ్ల కాలంలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడుగా అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరిత మైన పాత్రలద్వారా తెలుగు సహా జాతీయ అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్‌, తన నటనా ప్రతిభతో మొట్ట మొదటి జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర నటుడుకావడం., తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమన్నారు. నాటితరం గొప్పనటుడు అల్లు రామలింగయ్య వారసుడుగా, విలక్షణ నటులైన చిరంజీవి వంటి వారి స్పూర్తితో నేటితరం నటుడుగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్‌ కృషి గొప్పదని తెలిపారు. అదే సందర్భంలో…తన సృజనాత్మక రచనతో సినీ పాటల సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు, ఉత్తమ సినీ సాహిత్యానికి జాతీయ అవార్డు దక్కడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌, ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ కాలభైరవ, ఉత్తమ ఫిల్మ్‌ క్రిటిక్‌ పురుషోత్తమాచార్యులుతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు,సాంకేతిక సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Spread the love