వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పావుల్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
విబిజిఆర్‌ఎస్‌ఏఎంజి పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పావుల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2026 మే 15న నిర్వహించే దేశవ్యాప్త గ్రామీణ సమ్మెలో ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టించడంలో ఉపాధి హామీ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా చెరువుల పూడికతీత, గట్ల నిర్మాణం, మట్టి పనులు, వ్యవసాయ భూములకు రహదారుల ఏర్పాటు, కాలువల నిర్వహణ వంటి పనులను ఉపాధి హామీ కార్మికులే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే కుట్రలో భాగంగానే కొత్త పథకాలను తీసుకొస్తున్నారని ఆరోపించారు.విబిజిఆర్‌ఎస్‌ఏఎంజి పేరుతో కొత్త విధానాలను అమలు చేస్తూ కార్మికులను ఉపాధికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో తాగునీరు,నీడ,ప్రథమ చికిత్స వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు.చేసిన పనికి ఎంత కూలి వస్తుందో స్పష్టత లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకూలిని రూ.800లకు పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ,భోగం రమేష్,పొన్నం లక్ష్మయ్య, కేతావత్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



