ఉక్రెయిన్‌పై ‘నాటో’ అంతరంగం బహిర్గతం!

nato-insider-revealed-on-ukraineనాటో కూటమి పెద్దన్న అమెరికా చేతిలో పావుగా మారిన ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్యకు గురువారం నాటికి 540రోజులు. ఇది ఇంకా ఎన్నిరోజులు సాగుతుంది, ఎలా పరిష్కారం అవుతుంది అని అనేక మంది అడగటం తెలిసిందే. తమ దేశ భద్రతకు ముప్పు తెచ్చేందుకు చూస్తున్న నాటో కూటమికి దూరంగా ఉండేందుకు అంగీకరిస్తే తమ దాడులను విరమిస్తామని రష్యా చెబుతోంది. 2014లో విలీనం చేసుకున్న క్రిమియా ప్రాంతంతో సహా, ఇతరంగా స్వతంత్రం ప్రకటించుకున్న ప్రాంతాలకు రష్యా మద్దతు ఇవ్వటం మానుకొని తమకు అప్పగిస్తే తప్ప చర్చలు జరిపేది లేదని ఉక్రెయిన్‌ అంటోంది. కోల్పోయిన తమ ప్రాంతాలను తిరిగి తెచ్చుకొనేందుకు మేనెల నుంచి ప్రతిదాడులను ప్రారంభించినట్లు చెబుతున్న ఉక్రెయిన్‌ మిలిటరీ కబుర్లు తప్ప ఇంతవరకు సాధించిందేమీ లేదు. మరోవైపు అధునాతన క్షిపణి దాడులతో పుతిన్‌ సేన ఉక్రెయిన్‌ ఆయువు పట్టు అనుకున్న వాటిని వరుసగా దెబ్బతీస్తోంది. ఈ పూర్వరంగంలో నాటోలో సభ్యత్వం పొందాలంటే కొంత ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ త్యాగం చేయాల్సి ఉంటుందని,ఇలాగే జరగాలని తాను చెప్పటం లేదుగానీ ఉన్నంతలో పరిష్కారం ఇదే అని మంగళవారంనాడు ఒక సభలో, తరువాత నార్వే పత్రిక వెర్డెన్స్‌ గాంగ్‌తో మాట్లాడుతూ నాటో ప్రధాన కార్యదర్శి కార్యాలయ సిబ్బంది డైరెక్టర్‌ స్టియాన్‌ జెన్‌సన్‌ అన్నాడు. దీని గురించి ఎప్పుడు, ఏషరతులతో చర్చించాలనేది నిర్ణయించు కోవాల్సింది ఉక్రెయినేనని కూడా చెప్పాడు. ఇది తమకు అంగీకారం కాదని ఆ మాటలను అర్థం లేనివంటూ జెలెన్‌స్కీ యంత్రాంగం తీవ్రంగా మండిపడింది. దీని అర్ధం ప్రజాస్వామ్య ఓటమిని బుద్ది పూర్వకంగా ఎంచుకోవటమేనని, ఒక అంతర్జాతీయ నేరగాణ్ని ప్రోత్సహించటం, రష్యా పాలకులను రక్షించటం, అంతర్జాతీయ చట్టాన్ని నాశనం చేయటం, మరికొన్ని తరాలకు యుద్ధాన్ని అందించటమే అని జెలెన్‌స్కీ సలహాదారు పోడోల్యాక్‌ మండిపడ్డాడు. తమ మాదిరే నాటో కూటమి దేశాలు కూడా తమ ప్రాంతాలను ఇతర అవసరాల కోసం ఇతర దేశాలకు అప్పగిస్తాయని తాము అనుకోవటం లేదని, నాటో గొడుగు కోసం తమ ప్రాంతాలను అమ్ముకుంటామా అంటూ అర్ధం లేనిదని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పాడు. తెలివి ఉండిగానీ లేకగానీ నాటో అధికారులు మాడ్లాడే మాటలు రష్యా పలుకులను వల్లించినట్లుగా ఉన్నాయని, యూరో-అట్లాంటిక్‌ భద్రత కోసం ఉక్రెయిన్‌ విజయాన్ని త్వరిత పరిచే మార్గాలు, తమకు నాటోలో పూర్తి సభ్యత్వం ఇవ్వటం గురించి చర్చించాలని అన్నాడు. నాటో అధికారి చేసిన వ్యాఖ్యలు ఆ కూటమిని కుదిపివేశాయంటే అతిశయోక్తి కాదు. కొద్ది గంటలు కూడా గడవక ముందే నష్ట నివారణలో భాగంగా సదరు అధికారి నోటితోనే తాను తప్పు మాట్లాడినట్లు చెప్పించటమే గాక ఉక్రెయిన్‌ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు పూర్తి మద్దతు ఇస్తామని జూలైలో జరిగిన విలినస్‌ శిఖరాగ్ర సమావేశంలో నేతలు చేసిన ప్రకటనకు కట్టుబడే ఉన్నట్లు నాటో బుధవారంనాడు ఒక ప్రకటన చేసింది. నిజానికి అందరూ ఆశించినట్లుగా ఒక నిర్దిష్టత లేకుండా కూటమి దేశాలు అంగీకరించినపుడు, షరతులను నెరవేర్చినప్పుడు ఉక్రెయిన్‌కు సభ్వత్వం ఇస్తామని మాత్రమే ఆ సభలో చెప్పారు. తాను చెప్పిన మాటలకు క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించిన జెన్‌సన్‌ విస్తృత చర్చలో భాగంగా అలా అన్నానని, తాను చెప్పిన అంశాన్ని పూర్తిగా కాదనలేరని కూడా చెప్పటం విశేషం. రష్యాతో సంప్రదింపులకు నాటో సభ్యత్వాన్ని తురుపుముక్కగా వాడుకుంటారన్న తమ ఆందోళన నిజమే అని ఈ వ్యాఖ్యలు రుజువు చేశాయని ఉక్రెయిన్‌ అధికారి ఒకరు అన్నట్లు వార్తలు. ఇదంతా కొన్ని రాజకీయ లక్ష్యాల కోసం కావాలని చెప్పిన మాటలు తప్ప వేరు కాదని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియ జఖరోవా పేర్కొన్నది. జెన్‌సన్‌ చిన్నా చితక వ్యక్తికాదు. నాటోలో పది సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. నాటోలో చర్చల తీరుతెన్నుల గురించి బాగా తెలిసిన వాడే. అంతర్గతంగా అనుకుంటున్నవాటిని బహిర్గతంగా చెప్పి ఉక్రెయిన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడన్నది స్పష్టం. ఇలాంటి మాటలు చాలా రోజుల నుంచి నడుస్తున్నాయి గానీ, బహిరంగంగా చెప్పటం ఏమిటని ఒక నాటో అధికారి స్పందించాడు. ప్రతిఘటన దాడుల పేరుతో ఉక్రెయిన్‌ మిలిటరీ గత మూడు నెలలుగా సాధించిందేమీ లేకపోవటం, రానున్న రోజుల్లోనైనా అది జరుగుతుందనే ఆశ నాటోలో లేదన్నది జెన్‌సన్‌ మాటలు స్పష్టం చేస్తున్నాయి.రష్యాకు ధీటుగా దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రయిన్‌ మిలిటరీకి అందించేందుకు అమెరికా, నాటో కూటమి సిద్దంగా లేదు. జెలెన్‌స్కీ అడుగుతున్నట్లు ఎఫ్‌-16 విమానాలను కూడా ఇప్పటికిప్పుడు అందించలేమని అమెరికా చేతులెత్తేసింది. ఒక వేళ అలా అందించటమంటే సంక్షోభం మరో తీవ్ర మలుపు తిరిగినట్లే. ఇప్పటి వరకు వెనుక నుంచి అవసరమైన ఆయుధాలను అందించుతున్న నాటో కూటమి నేరుగా రష్యాతో తలపడినట్లే అవుతుంది.

Spread the love